బెంగళూరు : శ్రీహరికోట షార్ ప్రయోగ కేంద్రం నుండి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ‘ధ్వని క్షిపణి’ (సౌండింగ్ రాకెట్)ని ప్రయోగించింది. భూ వాతావరణంలోని వివిధ ఎత్తుల్లో ఉండే తటస్థ వాయువులను, అయానోస్పియర్ పొరల్లో ఉండే నాలుగు మౌలిక పదార్థాలలో ఒకటైన ప్లాస్మా చలనశీలత తీరుతెన్నులను అధ్యయనం చేసేందుకు ఇస్రో శుక్రవారంనాడు ఈ ‘ధ్వని క్షిపణి’ని ప్రయోగించింది. భూ వాతావరణంలోని అయానోసియర్‌లో, భూమి చుట్టుపక్కల ఉన్న అంతరిక్షపర్యావరణంలోని మేగ్నోసియర్‌లోనూ ఈ ప్లాస్మా చలనశీలత కనిపిస్తుంది. రోహిణి సిరీస్ పేరుతో ఇస్రో ఈ ధ్వని క్షిపణులను అభివృద్ధి చేసింది. వీటిల్లో ఆర్‌హెచ్-200 మిల్లీమీటర్లు, ఆర్‌హెచ్-300 మిల్లీ మీటర్లు, ఆర్‌హెచ్-560 మిల్లీమీటర్లు వ్యాసార్థంలో ఉండే ధ్వని క్షిపణులు ముఖ్యమైనవని బెంగళూరులోని ఇస్రో కేంద్ర కార్యాలయం తన ట్వీట్‌లో పేర్కొంది. ఆర్‌హెచ్-560 ధ్వని క్షిపణి ప్రయోగం ద్వారా వాతావరణ పొరల్లోని వివిధ ఎత్తుల్లో ఉండే తటస్థ వాయువులు, ప్లాసా డైనమిక్స్‌ను అధ్యయనం చేసేందుకే ఈ ప్రయోగం చేసినట్లు ఇస్రో ట్వీట్ చేసింది. అంతరిక్ష పరిశోధనల నిమిత్తం భూమిపైన అత్యున్నతశ్రేణిలో ఉన్న వాతావరణ ప్రాంతాలను మన అంతరిక్ష ప్రయోగ అవసరాలకు అనుగుణంగా అధ్యయనం చేయడానికి ఈ రోహిణి సిరీస్ ధ్వని క్షిపణులు ఉపయోగపడతాయి. లాంచ్ వెహికిల్స్‌ను, ఉపగ్రహాలను ప్రయోగించడానికి సంబంధించిన ఉపవ్యవస్థల ప్రయోజనాలకోసం ఈ అధ్యయనాలు ఇస్రోకు ఎంతో లబ్ధి చేకూరుస్తాయి.
రోహిణి-560 ధ్వని క్షిపణి ప్రయోగం
RELATED ARTICLES