ప్రజాపక్షం/రంగారెడ్డి ప్రతినిధి /వెల్దండ రంగారెడ్డి జిల్లా మహేశ్వరం పరిధిలోని హైదరాబాద్ శ్రీశైలం రహదారి పైనున్న తుమ్మలూరు గేట్ సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.సంఘటన సంబంధించి స్థానికులు, పోలీసుల కథను ప్రకారం.. మహేశ్వరం పోలీస్ స్టేషన్ పరిధి తుమ్మలూరు గేట్ సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున హైదరాబాద్ నుండి శ్రీశైలం వైపు వెళ్తున్న కారును ఎదురుగా వస్తున్న డిసిఎం డ్రైవర్ అజాగ్రత్త, అతివేగంగా నడుపుతూ ఢీకొన్న ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు మృతి చెందారు. మృతులంతా నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలం పోతేపల్లి గ్రామానికి చెందిన కేశవులు (35), యాదయ్య (34), శ్రీను (30), లింగారెడ్డిపల్లి గ్రామానికి చెందిన రామస్వామి (32)లుగా పోలీసులు గుర్తించారు. వీరంతా హైదరాబాదులో జరిగిన శుభకార్యంలో వంట చేసేందుకు వెళ్లి తిరిగి వస్తున్న తరుణంలో ఈ ప్రమాదానికి గురైనట్లుగా పోలీసులు తెలిపారు. మృతులందరికీ భార్య, ఇద్దరు చొప్పున పిల్లలు ఉన్నారు. విషయం తెలిసిన వెంటనే ఆయా గ్రామాలకు చెందిన బంధుమిత్రులు, ప్రజలు పెద్ద ఎత్తున ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని, ప్రమాదానికి బాధ్యులైన డిసిఎం డ్రైవర్ పై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ శ్రీశైలం, హైదరాబాద్ ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.దీంతో ఇరువైపులా కిలోమీటర్ల కొద్దీ వాహనాలు ఎక్కడికి అక్కడ నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు మృతుల కుటుంబాలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని ఆందోళకారులకు నచ్చ చెప్పి ఆందోళనను విరమింపజేశారు. మృతదేయాలను పోస్టుమార్టం నిమిత్తం హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రికి తరలించి పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు. ఈ దుర్ఘటనపై ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఈ ఘటనపై మాజీ ఎంపిపి పుట్టరాంరెడ్డి, కొప్పు రాజశేఖర్, సర్పంచ్ వెంకటమ్మ, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు బొల్లె ఈశ్వర్ విచారం వ్యక్తంచేశారు.
బాధితులకు న్యాయం జరగాలని ధర్నా ః
రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన మృతుల కుటుంబాలకు న్యాయం జరగాలని వెల్దండ మండల సింగిల్‌విండో వైస్‌చైర్మన్ సంజీవ్‌కుమార్, యాదవ సంఘం అధ్యక్షులు జక్కుల చిన్నజంగయ్యయాదవ్, బిఆర్ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు ఆలీసాబ్, లింగారెడ్డిపల్లి సర్పంచ్ మల్లెపాకుల చంద్రమ్మ సోమయ్యలు జాతీయ రహదారిపై రెండుగంటలపాటు ధర్నా రాస్తారోకో నిర్వహించారు. అనంతరం సంజీవ్‌కుమార్ మృతుల కుటుంబాలకు రూ.25వేల చొప్పున ఆర్థికసాయం అందజేశారు. కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ బాధిత కుటుంబాలకు 10వేల చొప్పున ఆర్థికసాయం అందజేశారు. అదేవిధంగా కుటుంబాలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి
RELATED ARTICLES