అవినీతిని అడ్డుకోలేకపోయిన కాంగ్రెస్ పాలకులు
ఎన్ఆర్ఐలు భారతీయ బ్రాండ్ అంబాసిడర్లు
ప్రవాసి భారతీయ దివస్ సదస్సులో ప్రధాని మోడీ
వారణాసి : ఒక మాజీ ప్రధానమంత్రి అవినీతిని గుర్తించినప్పటికీ, దశాబ్దాలపాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ అవినీతిని ఏ మాత్రం అడ్డుకోలేకపోయిందని, బిజెపి కేవలం నాలుగున్నరేళ్లలో 85 శాతం దోపిడీని నివారించిందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. రోగం తెలిసినా నయం చేయలేని అసమర్థులు కాంగ్రెస్ పాలకులని విమర్శించారు. ఒక రూపాయిలో కేవలం 15 పైసలు మాత్రమే జనానికి చేరుతున్నదని రాజీవ్‌గాంధీ గతంలో చేసిన వ్యాఖ్యలను మోడీ పరోక్షంగా ప్రస్తావించారు. ఈ లీకేజీని అడ్డుకోవడానికి కాంగ్రెస్ ఏ ఒక్క ప్రయత్నం కూడా చేయలేకపోయిందని విమర్శించారు. కానీ తమ ప్రభు త్వం వివిధ పథకాల ద్వారా దాదాపు 5,80,000 కోట్ల రూపాయలను నేరుగా ప్రజలకే చేర్చడంలో సఫలీకృతమైందని చెప్పుకొచ్చారు. తన పార్లమెంటరీ నియోజకవర్గమైన వారణాసిలో 15వ ప్రవాసి భారతీయ దివస్ సదస్సును మంగళవారంనాడు మోడీ ప్రారంభించారు. ఈ సదస్సుకు పెద్దసంఖ్యలో హాజరైన ప్రవాస భారతీయులను ఉద్దేశించి మోడీ ప్రసంగిస్తూ, ఎన్ఆర్ఐలు భారతీయ బ్రాండ్ అంబాసిడర్లు అని అభివర్ణించారు. దేశ సామర్థ్యాలకు వారే గుర్తులని అన్నారు. దేశం ఎన్నటికీ మారదన్న భావనను తమ ప్రభుత్వం పూర్తిగా మార్చివేసిందని మోడీ చెప్పారు. ఈ సదస్సుకు మారిషస్ ప్రధానమంత్రి ప్రవీంద్ జగ్నాథ్ ముఖ్య అతిథిగా హాజరుకాగా, విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్, హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖత్తార్, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్రసింగ్ రావత్, యుపి గవర్నర్ రామ్‌నాయక్, విదేశాంగ శాఖ సహాయమంత్రి వి.కె.సింగ్ తదితరులు హాజరయ్యారు. భారతదేశ సేవలు అంతర్జాతీయ స్థాయిలో మంచి ప్రతిష్టను సంపాదించుకున్నాయని, ముఖ్యంగా పర్యావరణం విషయంలో భారత పాత్ర అద్భుతమని మోడీ పేర్కొన్నారు.