జమ్మూకశ్మీర్ విజయపూర్ సభలో ప్రధాని మోడీ
జమ్ము: ‘కాంగ్రెస్ రైతుల రుణమాఫీతో ఎన్నికల్లో ఓట్టు పొందాలని చూస్తోంది. ఆ పార్టీ రుణమాఫీ ఓ జిమ్మిక్కు. గతంలో ఇలాంటి యత్నం కేవలం దళారులకు, ఎంపిక చేసుకున్న కొందరు రైతులకు ప్రయోజనం కలిగించింది’ అని ప్రధా ని నరేంద్ర మోడీ అన్నారు. ‘మేము రైతుల కోసం అనేక చర్యలు చేపట్టాం. వ్యవసాయానికి నేరుగా ఆదాయ మద్దతు ఇవ్వడానికి రూ. 6000 ఇస్తున్నాం. గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసిన రైతుల సంక్షేమం కోసమే ప్రభుత్వం ఈ చర్య చేపట్టింది’ అన్నారు. ‘కాంగ్రెస్ ఎల్లప్పుడూ 70 నుంచి 80 శాతం మంది పేద రైతులను ఈ రైతు రుణమాఫీలో వదిలేసేది. ఈ పేద రైతుల సంగతేమిటి?’ అని మోడీ ప్రశ్నించారు. ప్రధాని మోడీ రూ. 6000 కోట్ల విలువచేసే వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. విజయపూర్‌లో ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్), చీనాబ్ నదిపై వంతెన, దేవిక, తావి నదులపై కాలుష్య నివారణ ప్రాజెక్టులు, కథువాలో యూనివర్సిటీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, నార్తర్న్ రీజియనల్ సెంటర్ ఆఫ్ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ వంటి ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేశారు. విజయపూర్‌లో బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ పౌరసత్వ(సవరణ) బిల్లును ప్రతిపాదించామన్నారు. తమ మత విశ్వాసాన్ని నమ్మి పీడితులైన వారికి భారత్ ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. పాకిస్థాన్,ఆఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్‌లో పీడనకు గురైన ముస్లిమేతరులకు భారత పౌరసత్వం ఇచ్చేందుకు ఉద్దేశించిందే ఈ పౌరసత్వ(సవరణ) బిల్లు అని వివరించారు. ‘కశ్మీరీ పండితుల’ అంశంపై కూడా ఆయన చాలా భావోద్వేగంతో ప్రసంగించారు. స్వస్థలాన్ని వదిలేసిన ప్రజల బాధలపట్ల తాను అనుభూతి చెందుతున్నానన్నారు. ప్రజల రక్షణ కోసం జమ్ములో 14,000 బంకర్లను నిర్మించనున్నట్లు తెలిపారు. ‘ఉగ్రవాదం పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నాం’ అన్నారు. ‘వన్ ర్యాంక్ వన్ పెన్షన్’ అంశంలో కాంగ్రెస్ అబద్ధాలు చెబుతోందన్నారు.‘సైనికుల సంక్షేమం గురించి మాట్టాడే కాంగ్రెస్ వారికి కేవలం రూ. 500 కోట్లు మాత్రమే కేటాయించింది. అదే తన ప్రభుత్వం రూ. 35,000 కోట్లు కేటాయించింది. ఇందులో ఇంకా రూ. 11,000 ఏరియర్లు కూడా చేర్చింది’ అన్నారు.