లోక్‌సభ స్పీకర్‌కు లేఖ
న్యూఢిల్లీ: కేంద్ర సర్కారు కొత్తగా తీసుకొచ్చిన మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా సుమారు ఎనిమిదిన్నర నెలలుగా రైతులు ఢిల్లీ సరిహద్దు వద్ద ఆందోళనలు కొనసాగిస్తున్న విషయాన్ని వామపక్షాలు సహా ప్రతిపక్ష పార్టీలు ప్రస్తావించాయి. అప్ప టి నుంచి ఇప్పటి వరకూ ఎంతమంది రైతులు మృతి చెందారో నిర్ధారించడానికి సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జెఎసి)ని ఏర్పాటు చేయాలని లోక్‌సభ స్పీకర్‌కు రాసిన లేఖలో సిపిఐ, సిపిఎం, ఎన్‌సిపి, బిఎస్‌పి, శిరోమణి అకాలీదళ్, శివసేన, జెకెఎన్‌సి, ఎల్‌ఎల్‌పి డిమాండ్ చేశాయి. రైతు ఆందోళనల్లో ఎంత మంది మరణించారనే అంశంపై తమ వద్ద ఎలాంటి సమాచారం లేదని పార్లమెంటులో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ప్రకటన చేసిన నేపథ్యంలో, వాస్తవాలు బయటకు రావాల్సిన అవసరం ఉందని విపక్షాలు అభిప్రాయపడుతున్నాయి. వాస్తవాల నిగ్గు తేల్చడానికి జెపిసిని నియమించాలని కోరాయి. మరణించిన రైతుల వివరాలు లేవని కేంద్ర మంత్రి తోమర్ పార్లమెంటులో ప్రకటించడం దేశ వ్యాప్తంగా కోట్లాది మంది అన్నదాతల మనోభావాలను కించపరిచడమేనని విపక్షాలు శుక్రవారం విడుదల చేసిన ఒక సంయుక్త ప్రకటనలో వ్యాఖ్యానించాయి. ఈ విషయంలో రైతులకు మంత్రి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాయి. గత ఏడాది నవంబర్ నుంచి ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఆందోళనలు నిర్వహిస్తున్నప్పటికీ, ప్రభుత్వం పట్టించుకోకపోవం దారుణమని, ఈ ఆందోళనా కాలంలో ఎంత మంది రైతులు మరణించారనే సమాచారం కూడా తెలియదనడం ఘోరమని పేర్కొన్నాయి. రైతుల ఆందోళన అంశాన్ని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ దృష్టికి తీసుకెళ్లనున్నట్టు శిరోమణి అకాలీదళ్ నేతలు తెలిపారు. శనివారం రాష్ట్రపతిని కలవనున్నట్టు వారు ప్రకటించారు. ‘కిసాన్ ఆందోళన్’లో ఇంత వరకూ వందలాది మంది మరణించినట్టు విస్పష్టమైన ఆధారాలు ఉన్నప్పటికీ, సమాచారం లేదని కేంద్ర మంత్రి పేర్కొవడం మోడీ సర్కారు బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం కనీసం అధ్యయనం కూడా చేయించకపోవడం అన్యాయమని అకాలీదళ్ నేతలు విమర్శించారు. దేశం మొత్తాన్ని కేంద్ర వ్యవశాయ మంత్రి తోమర్ తప్పుతోవ పట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష సభ్యుడి నాయకత్వంలో జెపిసిని ఏర్పాటు చేసి, వాస్తవాలను దేశానికి తెలియపరచాల్సిన బాధ్యత మోడీ ప్రభుత్వంపై ఉందని అన్నారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహిస్తూ మృతి చెందిన రైతుల కుటుంబాలను ఆదుకోవాలని వారు కోరారు. ఇందు కోసం మృతుల సంఖ్యను తేల్చాల్సిన అవసరం ఉందన్నారు. లోక్‌సభ స్పీకర్‌కు రాసిన లేఖపై ఎం. సెల్వరాజ్ (సిపిఐ), పిఆర్ నటరాజన్ (సిపిఎం), హర్‌సిమ్రత్ కౌర్ బాదల్ (శిరోమణి అకాలీదళ్), సుప్రియా సూలే (ఎన్‌సిపి), అరవింద్ సావంత్ (శివసేన), దనీష్ అలీ (బిఎస్‌పి), హనుమాన్ బెనీవాల్ (ఆర్‌ఎల్‌పి), హస్‌నైన్ మసూదీ (జెకెఎన్‌సి) తదితరులు సంతకాలు చేశారు.
రైతు మరణాలపై జెపిసికి ప్రతిపక్షాల పట్టు
RELATED ARTICLES