ప్రజాపక్షం/ సూర్యాపేట బ్యూరో : రైతు సంక్షేమమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం వారు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించేందుకు కసరత్తును ప్రారంభించింది. అందులో భాగంగా కేంద్ర గిడ్డంగుల శాఖ ఆధ్వర్యంలో పంట కొనుగోలకు శ్రీకారం చుడుతోంది. పంట నిల్వలకు సౌకర్యాలు కల్పించనుంది. మొత్తం 43 గిడ్డంగులను నిర్మిస్తుండగా తెలుగు రాష్ట్రాలోనే 37 నిర్మించతలపెట్టింది. తెలంగాణలో సూర్యాపేట, ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులో ప్రయోగాత్మకంగా నిర్మిస్తోంది. గత నాలుగు రోజుల కిత్రం కేంద్రం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. రైతులు తమ పండించిన పంటను అమ్ముకునేందుకు సరైన మార్కెట్ సౌకర్యం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చేసేదేమీలేక వారు పండించిన పంటను అడ్డికి పావుసేరు అమ్ముతూ తీవ్రంగా నష్టపోతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం రైతు సంక్షేమమే లక్ష్యంగా వారు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించేందుకు యోచన చేసింది. రైతులు పండించిన పంటను నేరుగా కేంద్ర గిడ్డంగుల శాఖ ఆధ్వర్యంలో కొనుగోలు చేసేందుకు నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా మొత్తం 43 సెంట్రల్ వేర్ హౌస్‌ంగ్ కార్పొరేషన్ గోదాంలను నిర్మించి పంట నిల్వలు చేసుకునేందుకు వీలు కల్పించడంతో పాటు నేరుగా అక్కడి నుండే పంట అమ్ముకునే సౌకర్యానికి శ్రీకారం చుట్టింది. కాగా తెలుగు రాష్ట్రాల్లోనే 37 గోదాంలను నిర్మించేందుకు సన్నాహలు చేస్తుండగా.. మొదట ప్రయోగాత్మకంగా తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట, ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులో నిర్మించతలపెట్టింది. ఈ గోదాంల ఏర్పాటు వల్ల రైతులకు ఎంతో మేలు జరగనుంది. రైతుల పంట అమ్మకాల్లో జాతీయ మార్కెట్ విధానం అమలు కానుంది. మార్కెట్‌కు అమ్మకానికి ధాన్యాన్ని తీసుకొచ్చిన రైతులు గిట్టుబాటు ధర రాకుంటే తెచ్చిన ధాన్యం తిరిగి ఇంటికి తీసుకువెళ్లకుండా ఈ గోదాంలో భద్రపర్చుకొని వారు ఇష్టం వచ్చిన రోజున ఈనామ్ పద్ధతిలో పంటను అమ్ముకునే అవకాశం ఉంది. రైతులు తమ ఇంటి నుండే అధికారులకు ఫోన్ చేస్తే నిల్వ చేసిన పంటను ఎలక్ట్రానిక్ వేర్‌హౌస్ రిస్టిట్ సిస్టమ్ ద్వారా అమ్ముకునే సదుపాయాన్ని కలగించనుంది.
రైతు గిట్టుబాటు ధరకు సర్కార్ కసరత్తు
RELATED ARTICLES