పత్తి చేలపై మిడతల దాడి
ఆందోళనలో రైతాంగం
ప్రజాపక్షం/ ఖమ్మం బ్యూరో రైతు ఆశలు ఏదో ఒక రూపంలో వమ్ము అవుతున్నాయి. అతివృష్టి, అనావృష్టి లేదంటే దిగుబడి తగ్గిపోవడం, పంట పండితే ధర లేకపోవడం, ధర ఉన్నా పంట పండక పోవడం గత కొంత కాలంగా జరుగుతుంది. ఇక చీడ, పీడల సంగతి చెప్పనవసరం లేదు. ఎప్పుడు ఏ రూపంలో వచ్చి పంటలను దెబ్బతీస్తాయో అర్థం కానీ పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు పురుగులు, మిడతలు రైతు ఆశలను తొలిచేస్తున్నాయి. మారాకు వేయకుండానే పంటలను తినేస్తున్నాయి. ఉమ్మడి ఖమ్మంజిల్లాలో పత్తి చేలను మిడతల దండు ఆగం చేస్తుంటే పునాస పంటల ఆకులను పురుగులు తినేస్తున్నాయి. ఈ ఏడాది సానుకూల వాతావరణం ఉండడంతో రైతులు పత్తి, పెసర, మిను ము, కంది పంటలను సాగు చేశారు. పంటలు మారాకు వేయక ముందే పురుగులు పంటల మీద దాడికి దిగాయి. కత్తెరపురుగు, మిడతల ధాటికి పచ్చబడాల్సిన చేలు ఆకులు లేక వెలవెలబోతున్నాయి. ఇప్పటికే అనేక ఇబ్బందులు పడుతున్న రైతులకు ఈ వ్యవహారం అశనిపాతంలా మారింది. ఇటీవల కాలంలో రైతాంగం ఎక్కువగా బిటి రకం పత్తి విత్తనాలను సాగు చేస్తున్నారు. బిటి రకం పత్తి విత్తనాలకు 60 నుంచి 90 రోజుల దాకా ఎటువంటి పురుగు ఆశించే అవకాశం లేకపోగా తెగుళ్లు కూడా రాకూడదు. ఏం జరిగిందో కానీ ఈ ఏడాది పత్తి మారాకు తొడగక ముందే మిడతలు, కత్తెర పురుగు ఆకులను తినేస్తుంది. పత్తి ఆకులు లేకుండా పోవడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అలాగే పత్తి, పెసర, మినుము పంటలను కూడా మిడతలు, కత్తెర పురుగులు తినేస్తున్నాయి. గతేడాది ఒక్క రాత్రిలోనే ఎకరం, రెండెకరాల మొక్కజొన్న తొటలను తినేసిన కత్తెరపురుగు ఈ ఏడాది ఆదిలోనే రావడంతో రైతులు ఈ ఏడాది పంటల పరిస్థితిపై ఆందోళనకు గురవుతున్నారు. మాగాణి భూముల్లో బలం కోసం జిలుగులు, ఇతర పచ్చిరొట్ట విత్తనాలను సాగు చేస్తారు. జిలుగు ఇతర పచ్చిరొట్ట పంటలపై పురుగులు దాడి చేస్తూ సాయంత్రం పచ్చగా ఉన్న చేను తెల్లవారే సరికి ఆకు లేకుండా తినేస్తున్నాయి. గతంలో ఉత్తర భారతదేశంలో మిడతల దండు పంటలను మింగేసిందన్న వార్తలను విన్నాం, చూశాం కానీ ఈ ఏడాది ఖరీఫ్ ప్రారంభంలోనే ఈ మిడతల దండు రావడం, పంటలను తినేస్తుండడం భవిష్యత్తుపై ఆశలను చంపేస్తుంది. పెరిగిన పెట్టుబడుల నేపథ్యంలో చీడ పీడలు ఆశిస్తే దిగుబడులు తగ్గి తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని ఇప్పటికైనా వ్యవసాయ అధికారులు కత్తెరపురుగు, లద్దెపురుగుతో పాటు ఈ మిడతల దాడులను పరిశీలించి తగు నివారణ చర్యలు చేపట్టేవిధంగా రైతులకు సలహాలు ఇవ్వాలని, దీనిని ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను చూపాలని రైతులు కోరుతున్నారు. గతంలో మొక్కజొన్న తోటలపై పంట ఎదిగిన తర్వాత వచ్చే కత్తెర పురుగు ఈ ఏదాది ఆదిలోనే రావడం విస్మయం కలిగిస్తుంది.
రైతు ఆశలపై కత్తెర పురుగులు
RELATED ARTICLES