బిఆర్‌ఎస్‌కు అధికారదాహం తీరలేదు
రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారానికి ఎవరొచ్చినా కలుస్తా
శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమాధానం
ప్రజాపక్షం/ హైదరాబాద్ రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారానికి, కెసిఆర్‌తో సహా ఎవరొచ్చినా తాను కలిసేందుకు సిద్ధంగా ఉన్నానని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అన్నారు. అన్ని రాజకీయ పార్టీలకు చెందిన ప్రజా ప్రతినిధులతోనూ తాను కలుస్తానని, తనను ఎవరైనా కలువొచ్చని, తాను అందరికీ సిఎం అని తెలిపారు. తెలం గాణ రాష్ట్ర హక్కులను, కృష్ణా జలాలను కాపాడుకునేందుకు తాము ప్రధాని మోడీతో పోరాటం చేసేందుకు సిద్ధపడుతుంటే బిఆర్‌ఎస్ నేతలు కాళ్లల్లో కట్టెలు పెట్టి, తమను బొర్ల పడేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశా రు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని అడ్డుకోవాలంటే ఢిల్లీలో ధర్నా చేయాలని, కానీ నల్లగొండలో ధర్నా చేస్తే అక్కడ ప్రధాని మోడీ ఉంటారా? అని ఎద్దేవా చేశారు. రాష్ట్ర హక్కులు సాధించే వరకు లేదా అమరులయ్యే వరకు కెసిఆర్, కెటిఆర్, హరీశ్‌రావు ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద నిరవదిక దీక్ష చేపడితే, అందుకు తాము పూర్తి అండగా ఉంటామని చెప్పారు. హైదరాబాద్‌లోని శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సభ్యులు ప్రస్తావించిన అంశాలపై సిఎం రేవంత్‌రెడ్డి సమాధానమిచ్చారు. బిఆర్‌ఎస్‌కు అధికార దాహం తీరలేదని, తమ రాజకీయ స్వార్థం కోసం రైతుల హక్కులపై మరణ శాసనం రాశారని దుయ్యబట్టారు. ప్రజా తీర్పును గౌరవించాలని, ఆ ఒక్కరి కోసం మిగతా వారిని బలిపశువు చేయవద్దని హితువుపలికారు. గతంలో ఉన్న ఆనవాళ్లను సంపూర్ణంగా మారుస్తామని, గత ఆనవాళ్లు లేకుండా చేసే బాధ్యత తనదన్నారు. తెలంగాణ తల్లి అంటే కిరీటం పెట్టుకుని గడీల ఉండలేదని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ తల్లి అనగానే ప్రతి ఒక్కరికీ మన తల్లి, చెల్లి గుర్తుకు రావాలని, శ్రమజీవికి ప్రతీకగా ఉండాలన్నారు. స్వరాష్ట్రంలో తమకు రక్షణ ఉంటుందని, కలలు నెరవేరతాయని ప్రజలు భావించారని, కానీ ప్రజలలాకాంక్షలు గత తొమ్మిదిన్నరేళ్లలో నెరవేరలేదని, అందుకే నిరంకుశ ప్రభుత్వం వద్దని, ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అవకాశం కల్పించారన్నారు. సెంటిమెంట్‌ను రగిలించి, ఆయింట్‌మెంట్ పూసి, ఓట్లు దండుకునేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ప్రగతి భవన్‌ను ఆగమేఘాలపై నిర్మించుకున్నారని, చక్కగా ఉన్న సచివాలయాన్ని వాస్తు కోసం కూలగొట్టి ఏడాదిలో భారీగా నిర్మించారని, కానీ తొమ్మిదేళ్ల కాలంలో వరంగల్‌లో చేపట్టిన కాళోజీ కళాక్షేత్రాన్ని ఎందుకు పూర్తి చేయలేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తే బిఆర్‌ఎస్ నేతలు స్వాగతించడం లేదని, పైగా ఒక నాయకుడు ఆటోరాముడు ఆటోలో వెళ్లారని, ఆ ఆటో లోపల కెమెరాను కూడా ఏర్పాటు చేశారని, ఈడ్రామాలు ఏమిటని సిఎం రేవంత్ ప్రశ్నించారు. అక్కడ(బిఆర్‌ఎస్) నటులకు కొదవలేదని, జూనియర్ ఆర్టిస్టులుగా వ్యవహారిస్తున్నారని మండిపడ్డారు.
ప్రతిపక్షనేత రాకపోవడం విచారకరం
గవర్నర్ ప్రసంగానికి కూడా ప్రతిపక్ష నేత రాకపోవటం విచారకరమని, విపక్ష నేతలు ఇప్పటికైనా సరైన ప్రతిపక్ష పాత్ర పోషించాలని సిఎం రేవంత్ సూచించారు. ప్రధాన ప్రతిపక్ష నేత సభకు రాకుండా సభను అగౌరవపర్చారని, విపక్షనేత సీటు ఖాళీగా ఉండటం సభకు శోభనీయం కాదని,ప్రజలు ఇబ్బందులకు గురవుతే బాగుండని విపక్షం కోరుకుంటుందని ఆరోపించారు. డిసెంబర్ 9న కొన్ని కీలక హామీలను మంత్రివర్గంలో ఆమోదించామని, తెలంగాణ ఉద్యమ సమయంలో అందరూ టిజి అని రాసుకునేవాళ్లని, కొందరు యువకులు తమ గుండెలపైన టిజి పచ్చబొట్టు వేయించుకున్నారని, ఉద్యమ సమయంలో వాహనాలపై, బోర్డులపైన అందరం టిజి అని రాసుకున్నారని, కేంద్రం కూడా తమ నోటిఫికేషన్‌లో టిజి అని రాసిన విషయాన్ని రేవంత్ గుర్తు చేశారు. అందరి ఆకాంక్షలకు విరుద్ధంగా గత ప్రభుత్వం తమ పార్టీ పేరు స్ఫురించేలా టిఎస్ అని పెట్టిందని విమర్శించారు. రాష్ట్రం వచ్చాక జయ..జయహే తెలంగాణ పాట రాష్ట్ర గీతం అవుతుందని ఆశించినప్పటికీ ఆ పాటను నిషేధించినంత పని చేశారని ఆరోపించారు.
వారి పులుసు తిని&అలుసిచ్చారు..
తెలంగాణ రాష్ట్ర రైతులకు కెసిఆర్ ప్రభుత్వం మరణ శాసనం రాసిందని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు.ఆంధ్రప్రదేశ్ మంత్రి ఇంటికి వెళ్లి రాయలసీమను రత్నాల సీమ చేస్తానని చెప్పి, ఆ మంత్రి పెట్టిన పులసు, వారికి అలుసు ఇవ్వడంతోనే ఇవాళ్ల ఇటువంటిపరిస్థితి వచ్చిందని ఆరోపించారు. బేసిన్లు లేవు, భేషజాలు లేవేని, నీళ్లు తీసకోమ్మని చెప్పిందెవరని సిఎం బిఆర్‌ఎస్ నేతలను ప్రశ్నించారు. రోజుకు 8 టిఎంసిలు తరలించేలా రాయలసీమ లిఫ్టు నిర్మిస్తుంటే ఎందుకు అడ్డుకోలేదని నిలదీశారు. తెలంగాణ భూభాగంలో ఉన్న నాగార్జున సాగర్‌కు ఎపి పోలీసులు వస్తే చేతకాకుండా కూర్చున్నారని మండిపడ్డారు. పదేళ్ల కాలంలో కేవలం ఒక కిలోమీటర్ టన్నెల్ మాత్రమే తవ్వారని, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాన్ని పదేళ్లలో ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇంత అన్యాయం జరగలేదని, రాజకీయ స్వార్థం కోసం రైతుల జీవితాలతో ఆటలాడుతున్నారని విమర్శించారు. కృష్ణా ప్రాజెక్టుల అప్పగింతపై 2015లోనే సంతకాలు చేశారని, నదీ పరివాహకం ప్రకారం కృష్ణా జలాల్లో 68 శాతం నీరు అడగకుండా సంతకం పెట్టారని, కేవలం 298 టిఎంసీలు ఇస్తామని కేంద్రం అంటే సంతకాలు పెట్టిందన్నారు.
రైతుల హక్కులపై మరణ శాసనం
RELATED ARTICLES