చర్చలే పరిష్కార మార్గం : సుప్రీం
వ్యవసాయ నిపుణులు, రైతు సంఘాలతో స్వతంత్ర ప్యానెల్ ఏర్పాటుకు అత్యున్నత న్యాయస్థానం ప్రతిపాదన
న్యూఢిల్లీ : శాంతియుతంగా నిరసనలు చేపట్టేందుకు రైతులకు హక్కు ఉందని సుప్రీంకోర్టు గురువారం అంగీకరిచింది. ఇంకా రైతులు చర్చలకు రావడం లేదన్న కేంద్రం జవాబుకు, సాగు చట్టాల అమలును నిలిపివేస్తే చర్చలకు వస్తారేమోనని అభిప్రాయపడింది. రైతు నిరసనలు, ఇతరులు ఏ ఆటంకం లేకుండా వెళ్లే హక్కు అంశాలే ఇప్పుడు ప్రధానమని, చట్టాల అమలు కాదని సుప్రీం స్పష్టం చేసింది. ఇక సమస్య పరిష్కారానికి వ్యవసాయ నిపుణులు, రైతు సంఘాలతో కలిపి ఒక నిష్పాక్షిక, స్వతంత్ర ప్యానెల్‌ను నియమించే ఆలోచనలో ఉన్నట్లు వెల్లడించింది. రైతులు నిరసన తెలపవచ్చు. అయితే అది ఆటంకాలు లేకుండా వెళ్లడం, ఆహారం, ఇతర అత్యవసర వస్తువులను తెచ్చుకోవడం లాంటి ఇతరుల ప్రాథమిక హక్కులను అతిక్రమించ కూడదని చెప్పింది. నిరసన చేసే హక్కు అంటే మొత్తం నగరాన్ని దిగ్బంధం చేయడం కాదు కదా అని వ్యాఖ్యానించింది. ప్రస్తుతం ఎలాంటి చర్చలూ జరగడం లేదని ప్రభుత్వం, ఒక రైతు సంఘం చెప్పిన విషయంతో పరిస్థితుల పట్ల సుప్రీం ఆందోళన వ్యక్తం చేసింది. ఇంకా ప్రభుత్వంతో చర్చలు జరపకుండా నిరసన కొనసాగించవద్దని రైతులకు సూచించింది. “మీరు నిరసన కొనసాగించవచ్చు. మీకా హక్కు ఉంది. కానీ మీకో ప్రయోజనం కూడా ఉంది. మీరు మాట్లాడి, చర్చించి, ఒక పరిష్కారానికి వచ్చినప్పుడే ఆ ప్రయోజనం నెరవేరుతుంది” అని ప్రధాన న్యాయమూర్తి ఎస్.ఎ.బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇంకా, ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇతరుల హక్కులను హరించకుండా నిరసనలను అడ్డుకునే అధికారాన్ని పోలీసులు, అధికారులకు కట్టబెట్టారని చెప్పింది. నిరసన చేస్తున్న రైతు సంఘాలతో కలుపుకొని అందరు కక్షిదారుల వాదనలు విన్నాకే ఒక కమిటీని నియమిస్తామని ధర్మాసనం తెలిపింది. రైతులతో చర్చల కోసం ప్రభుత్వం చట్టాల అమలును నిలిపి ఉంచాలని సూచించింది. ఈ సూచనను అటార్నీ జనరల్ కె.కె.వేణుగోపాల్ వ్యతిరేకించారు. చట్టాల అమలును నిలిపివేస్తే రైతులు చర్చలకు రాకపోవచ్చని ఆయన అన్నారు. అయితే చట్టాలను నిలిపివేయాలని కేంద్రానికి సూచించడం లేదని, రైతులతో చర్చలు జరిపేందుకు వాటి అమలును మాత్రమే నిలిపివేయాలని అడుగుతున్నట్లు సుప్రీం తెలిపింది. రైతుల దుస్థితిని చూసి మేం ఆందోళన చెందుతున్నాం. మేము కూడా భారతీయులమే, కానీ జరుగుతున్న పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయని, నిరసనకారులు అల్లరి మూక కాదని ధర్మాసనం పేర్కొంది. నిరసన చేస్తున్న రైతు సంఘాలకు నోటీసులు జారీచేస్తున్నట్లు, శీతాకాల విరామం కనుక వారికి వెకేషన్ ధర్మాసనాన్ని సంప్రదించే స్వేచ్ఛ ఇస్తున్నట్లు తెలిపింది ధర్మాసనం. నిరసనకారులను భారీ సంఖ్యలో నగరంలోకి ప్రవేశించేందుకు అనుమతిస్తే, వారు హింసకు దిగరన్న హామీని ఎవరు ఇస్తారని ధర్మాసనం ప్రశ్నించింది. “కోర్టు మాత్రం దీనికి హామీ ఇవ్వలేదు. హింసను అడ్డుకునేందుకు కోర్టు దగ్గర వనరులు ఏవీ లేవు. ఇతరుల హక్కులను కాపాడాల్సింది పోలీసులు, ఇతర అధికారులే” అని ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యానించింది.
కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో కొనసాగుతున్న నిరనసల మీద ఏర్పడిన ప్రతిష్టంభన తొలగించేందుకు ప్రభుత్వం, దేశవ్యాప్తంగా ఉన్న రైతు సంఘాల ప్రతినిధులతో ఒక కమిటీని వేయాలనుకుంటున్నట్లు సుప్రీంకోర్టు బుధవారం తెలిపింది. నిరసనల కారణంగా రోజువారీ ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వేలాదిగా పోగవడం వల్ల కొవిడ్ కేసులు పెరిగే అవకాశం ఉందని, ఈ విషయంలో అధికారులకు మార్గదర్శకాలు జారీచేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి.
రైతుల పోరు రాజ్యాంగ హక్కే!
RELATED ARTICLES