వ్యవసాయ బిల్లు చర్చలో కేంద్రంపై ధ్వజమెత్తిన ప్రతిపక్షాలు
బిల్లులపై తాము సంతకం చేయబోమని స్పష్టీకరణ
ఆమోదానికి ముందు సెలెక్ట్ కమిటీకి పంపాలని డిమాండ్
న్యూఢిల్లీ : కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఆదివారం రాజ్యసభలో వ్యవసా య బిల్లులను ప్రవేశపెట్టారు. ఈ బిల్లులు ఎంతో చారిత్రాత్మకమైనవని, రైతు జీవన శైలిలో చాలా మార్పులు తెస్తాయని ఆయన ప్రకటించారు. ఈ విషయాన్ని రైతులందరూ అర్థం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే ఫార్మర్స్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్ (ప్రమోషన్ అండ్ ఫెసిలిటేషన్), ఫార్మర్స్ (ఎంపవర్‌మెంట్ అండ్ ప్రొటెక్షన్) అగ్రిమెంట్ ఆన్ ప్రైస్ అష్యూరెన్స్ అండ్ ఫామ్ సర్వీసెస్ బిల్లులను లోక్‌సభ ఆమోదించింది. కాగా, వ్యవసాయ బిల్లులు ఆమోదింపజేసుకునే ముందు కేంద్రం వాటిని పరిశీలన కోసం రాజ్యసభ సెలెక్ట్ కమిటీకి పంపాలని కెకె రాగేష్ (సిపిఐ(ఎం), డెరెక్ ఓబ్రయిన్ (టిఎంసి), త్రిచి శివ (డిఎంకె), కెసి వేణుగోపాల్ (కాంగ్రెస్)లు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఇదిలా ఉండగా, బిల్లుపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షాలు కేంద్రంపై విమర్శలతో విరుచుకుపడ్డాయి. రైతుల పాలిట డెత్ వారెంట్ అయిన బిల్లులపై తాము సంతకం చేయబోమని పేర్కొన్నాయి. భద్రత కోసం ఈ బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపాలని డిమాండ్ చేశాయి. పెద్ద కార్పొరేట్ శక్తులకు మేలు చేకుర్చేడమే లక్ష్యంగా ఈ బిల్లులను తీసుకువచ్చారని ధ్వజమెత్తాయి. రెండు వ్యవసాయ బిల్లులపై చర్చను ప్రారంభించిన కాంగ్రెస్ సభ్యుడు ప్రతాప్ సింగ్ బజ్వా మాట్లాడుతూ వ్యవసాయ బిల్లులు అన్నదాతలకు డెత్‌వారెంట్ లాంటివని వ్యాఖ్యానించారు. రైతుల ప్రాణాలను హరించే ఈ బిల్లులకు కాంగ్రెస్ మద్దతివ్వబోదని స్పష్టం చేశారు. “కాంగ్రెస్ పార్టీ ఈ బిల్లులను వ్యతిరేకిస్తోంది. రైతుల డెత్‌వారెంట్లపై సంతకం చేయబోం. రైతులకు మీరు చేయాలనుకుంటున్న ప్రయోజనాలను కోరుకోవడం లేదు. అలాంటప్పుడు వారిని ఎందుకు బలవంతపెడతారు” అని ప్రతాప్‌సింగ్ రాజ్యసభలో ఆందోళన వ్యక్తం చేశారు. ‘రైతులు అమాయకులు కాదు. ఇది కనీస మద్దతు ధరను తొలగించే మార్గమని వారు తెలుసుకున్నారు. ఒకసారి ఈ బిల్లు పాసైన తర్వాత వ్యవసాయమంతా కార్పొరేట్ల చేతిలోకి వెళ్లిపోతుంది” అని అన్నారు. తమ జీవితాలపై దాడి చేయడానికే కేంద్రం ఈ బిల్లులను తెచ్చిందని పంజాబ్, హర్యానా రైతులు అభిప్రాయపడుతున్నారని చెప్పారు.గతంలో ఈస్టిండియా కంపెనీ, పోర్చుగీసువారు భారత్‌పై ఎలా దాడి చేశారో ఇప్పుడు కూడా అదే జరుగుతోందని అభిప్రాయపడ్డారు. టిఎంసి సభ్యుడు డెరెక్ ఓబ్రయిన్ మాట్లాడతూ బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపాలని డిమాండ్ చేశారు. “రైతులను విపక్షాలు తప్పుదోవ పట్టిస్తున్నాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. మీరేమో 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు అవుతుందని అంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో 2028 నాటికి గానీ రైతుల ఆదాయం రెట్టింపు కాదు. ఇలాంటి వాగ్దానాలపై ప్రజల్లో విశ్వసనీయత లేదు. మీ ప్రకటించిన రెండు కోట్ల ఉద్యోగాలేవీ? నాలుగు నిబంధనల్లో కనీస మద్దతు ధర అనేది ఓ అంశం మాత్రమే. మేము ఆ నాలుగు అంశాలనూ వ్యతిరేకిస్తున్నాం. కేవలం కనీస మద్దతు ధరను మాత్రమే వ్యతిరేకిస్తున్నామన్న ప్రచారాన్ని చేయకండి” అని అన్నారు. సమజావాది పార్టీ సభ్యుడు రాం గోపాల్ యాదవ్ మాట్లాడతూ “కేంద్రం వైఖరి చూస్తుంటే ఈ బిల్లులపై ఎలాంటి చర్చ చేపట్టకూడదన్నట్లుంది. కేవలం పరుగో పరుగు అన్నట్లుంది. ఈ బిల్లు ప్రవేశపెట్టే సమయంలో కనీసం రైతు నేతలతో, ప్రతిపక్షాలతో చర్చించలేదు. కనీసంలో కనీసం ఆర్‌ఎస్‌ఎస్ అనుబంధ రైతు సంఘంతోనూ సంప్రదించలేదు. గత ఆరు సంవత్సరాలలో జిడిపిలో వ్యవసాయ సహకారం 6 శాతం ఎందుకు తగ్గిపోయింది? ఆలోచించారా?” అని మండిపడ్డారు. డిఎంకె సభ్యుడు టికెఎస్ ఇళంగోవన్ మాట్లాడతూ ‘ఈ బిల్లులు రైతులను బానిసలుగా మారుస్తాయి. కార్పొరేట్ శక్తులకు రైతులు బానిసలవుతారు. జిడిపిలో రైతుల భాగస్వామ్యం 20 శాతం. ఈ బిల్లులు రైతుల ఉసురు తీసుస్తాయని, రైతులను ఆట వస్తువులుగా మార్చేస్తాయి’ అని విమర్శించారు. శిరోమనీ అకాలీదళ్ నరేశ్ కుమార్ గుజ్రాల్ మాట్లాడుతూ “ఈ బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపాలి. దీంతో అన్ని పక్షాల వారూ దీన్ని వినవచ్చు. పంజాబ్ రైతులు బలహీనులని భావించకండి’ అని పేర్కొన్నారు. బిల్లుల ద్వారా రైతుల ఆదాయం రెట్టింపవుతుందని ప్రభుత్వం హామీ ఇస్తుందా? అని శివసేన ఎంపి సంజయ్ రౌత్ ప్రశ్నించారు. రైతులు ఇకపై ఆత్మహత్యలు చేసుకోరని హామీ ఇస్తారా? కేంద్రాన్ని అడిగారు. బిల్లుపై చర్చకు ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలన్నారు. వ్యవసాయ బిల్లులను ఆమోదింప జేసుకోవడంలో మోడీ ప్రభుత్వానికి ఎందుకింత తొందర? అని రాజ్యసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజే దేవెగౌడ కేంద్రంపై తీవ్రంగా మండిపడ్డారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో మోడీ ప్రభుత్వం ఎందుకింత తొందర పెడుతోందంటూ నిలదీశారు. ప్రస్తుత కాలంతో పాటు రాబోయే కాలాల్లో ఈ బిల్లులు రైతులకు ఎలా ఉపయోగపడతాయో స్వయంగా ప్రధాని మోజీ వివరించాలని ఆయన డిమాండ్ చేశారు. అంతేకాకుండా రైతుల ఆదాయం రెట్టింపు కావడానికి ఈ బిల్లులు ఎలా ఉపయోగపడతాయో చెప్పాలని దేవెగౌడ మోడీని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా, బిల్లులపై కాంగ్రెస్ తప్పుడు ప్రాచారం చేస్తోందని బిజెపి నేత భూపేంద్ర యాదవ్ ఆరోపించారు. వారి 70 ఏళ్ల పాలనలో రైతుల ఆదాయం పెరిగిన దాఖలాలు లేవన్నారు. కేంద్రం తీసుకొచ్చే సంస్కరణలతో రైతులు మేలు జరుగుతుందని ఉద్ఘాటించారు. కనీస మద్దతు ధరపై ప్రభావం ఉండదని చెప్పారు.
బిల్లుతో రైతులకు తీరని నష్టం: కెకె
కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ బిల్లుతో రైతులకు తీరని నష్టం వాటిల్లే ప్రమాదముందని టిఆర్‌ఎస్ ఎంపి కె.కేశవరావు ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యసభలో వ్యవసాయ అనుబంధ బిల్లులపై చర్చ సందర్భంగా కేశవరావు మాట్లాడుతూ… మార్కెటింగ్ ఏజెంట్లకు కూడా నష్టం చేసేలా కొత్త చట్టం ఉందన్నారు. వ్యవసాయంలో కూడా కార్పొరేట్లను పెంచి పోషించేలా ఉందని పేర్కొన్నారు. ‘ఒక్కో క్లస్టర్‌లో 1.65 లక్షల మంది రైతులు ఉన్నారు. కేంద్ర ఏ పథకానికీ సరిగా నిధులు ఇవ్వడం లేదు. వ్యవసాయం, సంబంధిత అంశాలు ఎప్పుడూ రాష్ట్ర పరిధిలోనే ఉండాలి. ఈ కొత్త చట్టం రైతులకు అండగా నిలిచేలా లేదు” అని కేశవరావు స్పష్టం చేశారు.
రైతుల పాలిట ‘డెత్‌వారెంట్’
RELATED ARTICLES