సురవరం సుధాకర్‌రెడ్డి విమర్శ
ప్రజపక్షం / హైదరాబాద్ రైతులను సర్వ నాశనం చేసే కార్పోరేట్ వ్యవసాయ విధానం దేశ ప్రజలకు ఆమోదయోగ్యం కాదని సిపిఐ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి స్పష్టం చేశారు. ఎన్నికల్లో ప్రజలు ఓట్లు వేసి గెలిపించినందున తాము తెచ్చిన చట్టాలను చచ్చినట్లు ఒప్పు కోవాల్సిందేనని, నిరసనలను లెక్కపెట్టబోమనే విధంగా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం వ్యవహరిస్తుందని సుధాకర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలకులు ఎన్ని అడ్డంకులు కల్పించినా ఆగ్రహించిన రైతులు ఢిల్లీ సరిహద్దులకు చేరారని ఆయన గుర్తు చేశారు. సమస్యల పరిష్కారం కోసం రైతులు సహా సమాజంలోని వివిధ వర్గాలు చేస్తున్న ఉద్యమాలకు మద్దతు ఇస్తూనే భవిష్యత్‌లో మరింత బలమైన ఉద్యమాలను నిర్మించడం ద్వారానే కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను కట్టడి చేయగలమని ఆయన అన్నారు. హైదరాబాద్ మఖ్ధూంభవన్‌లో బుధవారం రంగారెడ్డి జిల్లా కార్యదర్శి జంగయ్య అధ్యక్షతన సిపిఐ రాష్ట్ర విస్త్రత స్థాయి కార్యవర్గ సమావేశం జరిగింది. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి సమావేశానికి స్వాగతం పలికారు. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన సురవరం సుధాకర్‌రెడ్డి జాతీయ , అంతర్జాతీయ రాజకీయ పరిణామాలను కార్యవర్గ సమావేశంలో వివరించారు. కోవిడ్‌ను అడ్డం పెట్టుకుని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం విద్యుత్ సవరణ చట్టాన్ని, వ్యవసాయ కార్పోరేటీకరణ, మార్కెటింగ్ తదితర ప్రమాదకరమైన చట్టాలను తీసుకువచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు మాతృ భాషలో విద్యా బోధన పేరుతో ఆర్‌ఎస్‌ఎస్ అనుబంధ సంస్థలు సంస్కృతాన్ని బలవంతంగా దేశంపై రుద్దడానికి ప్రయత్నాలు చేస్తున్నారని, చరిత్రను వక్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ప్రస్తుతం దేశంలో రైతులు చేస్తున్నది వీరోచిత శాంతియుత పోరాటమని, రైతుల పోరాటానికి దేశవ్యాప్త మద్దతు రావడం హర్షనీయ పరిణామమని పేర్కొన్నారు. ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఒక ప్రత్యేకమైన నగరాన్ని ఏర్పాటు చేసుకుని పోరాటం చేస్తున్నారని, దానిని ఎలా విధ్వంసం చేయాలని బిజెపి ప్రభుత్వం ఆలోచిస్తున్నదన్నారు. రైతుల పట్టుదలను చూసి దేశ ప్రజలంతా నేర్చుకోవాలన్నారు. రైతుల పోరాటంపై సోషల్ మీడియాలో బిజెపి దుష్ప్రచారం చేయడం గర్హనీయమన్నారు. ప్రస్తుతం కోవిడ్ వాక్సిన్‌పై బిజెపి రాజకీయాలు చేస్తున్నదని, కోవిడ్ వ్యాక్సిన్‌ను ఉచితంగా అందిస్తామని హామీ ఇచ్చిన కేరళ ప్రభుత్వాన్ని తప్పుబడుతున్న బిజెపి బీహార్‌లో బిజెపి ప్రభుత్వం ఎలా ఉచితంగా అందిస్తుందో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కోవిడ్‌కు వ్యాక్సిన్ విషయంలో కేంద్రం చేస్తున్నదేమీ లేదని, రాష్ట్రాలు చేస్తున్న కృషిని తాము చేస్తున్నట్లుగా బిజెపి వ్యవహరిస్తున్నదని, ఈ విషయంలో బిజెపి ప్రభుత్వ వైఖరి “బరువైన బండి కింద నడిచే కుక్క వ్యవహారం’ మాదిరిగా ఉందని ఎద్దేవా చేశారు.బీహార్‌లో కాంగ్రెస్‌తో నష్టం:ఎన్నికల్లో కాంగ్రెస్ సహకరించకపోవడం వల్లనే సిపిఐ నష్టం జరిగిందని సురవరం తెలియజేశారు. రానున్న రోజుల్లో పశ్చిమ బెంగాల్, కేరళ, అస్సోం, త్రిపుర ఎన్నికలు కీలకంగా మారనున్నాయని, బెంగాల్‌లో ఘటన ఆధారంగా అక్కడి ప్రభుత్వాన్ని డిస్మిస్ చేసి ఎన్నికలు జరిపించాలని బిజెపి భావిస్తున్నదన్నారు. బెంగాల్‌లో కాంగ్రెస్‌తో కలిసి వామపక్షాల ఫ్రంట్‌ను ఏర్పాటు చేసే అవకాశముందన్నారు. ప్రతిపక్ష రాజకీయ పార్టీలు బిజెపిని సమర్ధవంతంగా ఎదుర్కొనగలిగితే మంచి ఫలితాల వస్తాయన్నారు. అబద్ధాలు చెప్పడంలో బిజెపి దిట్ట అని ఆయన అన్నారు. దుబ్బాకలో ఘర్షణ ద్వారా తటస్థులను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నించాయని, బెంగాల్‌లో కూడా ఇదే విధమైన వైఖరిని అవలంభిస్తున్నాయన్నారు. అమెరికా అధ్యక్షులు డోనాల్డ్ ట్రంప్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, ఆయన ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. డబ్ల్యుహెచ్‌ఓ నుంచి వైదొలగడం, వియత్నాం, క్యూబాతో అంతర్జాతీయ సంబంధాలను తెగగొట్టుకోవడం, అంతర్జాతీయ పర్యావరణ తదితర ఒప్పందాల నుంచి అమెరికా బయటకు రావడం తదితర అంశాలలో ట్రంప్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్నారు. మరోవైపు తెల్లజాతి దురంహాకారాన్ని ట్రంప్ రెచ్చగొట్టారన్నారు. తొలుత సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి ఇటీవల మరణించిన పార్టీ నాయకులు, ఇతర పార్టీల ప్రముఖులకు సంతాపం తెలియజేస్తూ ప్రవేశపెట్టిన సంతాప తీర్మానాన్ని సమావేశం ఆమోదిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించి వారికి నివాళులు అర్పించింది.
రైతుల పట్ల కేంద్రం మొండివైఖరి
RELATED ARTICLES