బాష్పవాయువు, నీటి ఫిరంగులు ప్రయోగించిన పోలీసులు
హర్యానా సిఎంకు చుక్కెదురు
సమావేశం రద్దు
న్యూఢిల్లీ : కేంద్ర సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరసన చేస్తున్న రైతులు వేదికను ధ్వంసం చేయడంతో కర్నాల్ దగ్గర్లోని కైమ్లాలో హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ రైతులతో నిర్వహించాల్సిన “కిసాన్ మహాపంచాయత్” రద్దయింది. నిరసనకారులు కైమ్లా గ్రామంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించడంతో వారిమీద హర్యానా పోలీసులు బాష్పవాయు గోళాలు, నీటి ఫిరంగులు ప్రయోగించారు. అయినప్పటికీ రైతులు గ్రామంలోకి ప్రవేశించి సమావేశ వేదిక దగ్గరికి చేరుకున్నారు. వారిలో చాలామంది వేదిక మీదికి ఎక్కి, అరుస్తూ, కుర్చీలు కిందపడేస్తూ, పోస్టర్లను చింపేసినట్లు సెల్ ఫోన్ ఫుటేజి ద్వారా తెలుస్తోంది. సెప్టెంబర్‌లో కేంద్రం అమలులోకి తెచ్చిన సాగు చట్టాల ప్రయోజనాలను రైతులకు వివరించేందుకు ముఖ్యమంత్రి సమావేశం ఏర్పాటుచేశారు. సమస్యను ముందే గుర్తించి సమావేశానికి ముందే గ్రామంలో భారీ బందోబస్తును ఏర్పాటుచేశారు. అయితే చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్న రైతులు “కిసాన్ మహాపంచాయత్”ను వ్యతిరేకించాలని ఇంతకుముందే ప్రకటించారు. నల్లజెండాలను పట్టుకున్న రైతులు బిజెపి నేతృత్వంలోని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు ఇస్తూ కైమ్లాలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసులు నిరసనకారులు గ్రామంలోకి రాకుండా బారికేడ్లను అడ్డంగా ఉంచారు. కేవలం హర్యానా రైతులే కాకుండా, పంజాబ్ నుంచి వచ్చేవారిని కూడా ఢిల్లీ సరిహద్దుల్లోనే నిలువరించాలని నిర్ణయించడం ద్వారా నవంబర్‌లో బిజెపి పాలిత హర్యానా వార్తల్లోకి ఎక్కింది. ఈ క్రమంలో పోలీసులు రైతులతో తలపడుతున్నట్లు, లాఠీలకు పనిచెప్పినట్లు, బారికేడ్లు, బాష్పవాయు గోళాలు, నీటి ఫిరంగులు ప్రయోగించినట్లు వీడియో ఫుటేజీల నుంచి తెలుస్తోంది. వ్యవసాయ చట్టాల మీద భారీ విమర్శలు రావడంతో, కేంద్రం చట్టాల గురించి “అపోహల”ను తొలగించేందుకు ఒక భారీ ప్రదర్శన నిర్వహించాలని నిర్ణయించుకుంది. అయితే ఢిల్లీలో రైతులు తమ డిమాండ్లకు అంటిపెట్టుకుని ఉండటంతో ఈ ప్రాంతంలో నిర్వహించ తలపెట్టిన ముఖ్యమంత్రి సమావేశం ఇబ్బందుల్లో కూరుకుపోయింది. శుక్రవారం నాడు స్థానిక నిరసనకారులు గ్రామస్థులతో, బిజెపి కార్యకర్తలతో ఘర్షణపడ్డారు. నిరసన తెలిపేందుకు నిరసనకారులకు గ్రామంలోకి గ్రామస్థులు అనుమతి నిరాకరించడంతో ఒకరికొకరు ఘర్షణ పడాల్సిన పరిస్థితి తలెత్తింది. ఇదిలా ఉంటే “మీరు ఏదైనా చెప్పదలుచుకుంటే, 46 రోజులుగా ఆందోళన చేస్తున్నవారితో చెప్పండి” అని కాంగ్రెస్ నాయకుడు రణ్‌దీప్ సూర్జేవాలా ఖట్టర్‌కు సూచించారు.
రద్దుతోనే రైతుకు ఉపశమనం వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవడం ఒక్కటే నిరసన చేస్తున్న రైతులకు ఉపశమనం కలిగిస్తుందని ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ నాయకుడు సునీల్ రాయ్ పేర్కొన్నారు. కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసిన ఆయన నరేంద్ర మోడీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు పెరగకుండా చూడటంలో విఫలమై, దేశంలోని మధ్యతరగతి గురించి పట్టించుకోవడం లేదని ఆరోపించారు. శాంతియుతంగా నిరసన చేస్తున్న రైతులకు కాంగ్రెస్ అండగా ఉంటుందని రాయ్ విలేకర్లతో అన్నారు. ప్రతికూల ప్రభావాలను గ్రహించకుండానే పారిశ్రామికవేత్తలకు మేలు చేసేందుకు ప్రభుత్వం రైతుల మీద సాగు చట్టాలను రుద్దిందన్నారు. ఆందోళనపై ప్రభుత్వ వ్యవహార శైలి పచ్చ కామెర్లు ఉన్నవాళ్లకు లోకమంతా పచ్చగా కనపడిన విధంగా ఉందని విమర్శించారు సునీల్ రాయ్.
రైతుల నిరసన ఉద్రిక్తం
RELATED ARTICLES