బ్లాక్ డేలో పాల్గొనేందుకు కదిలిన అన్నదాతలు
కేంద్రంతో చర్చలకు సిద్ధమని ఎస్‌కెఎం ప్రకటన
చండీగఢ్/ లక్నో : కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన మూడు సాగు చట్టాలను రద్దు చేయాల్సిందేనని పట్టుబడుతూ తాము చేస్తు న్న ఆందోళన ఆరు నెలలు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో, భారీ ప్రదర్శనకు రైతులు సిద్ధమవుతున్నారు. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి అన్నదాతలు ఢిల్లీ బాట పట్టారు. ఇప్పటికే ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులతో కలిసి వీరంతా ఈనెల 26వ తేదీన ‘బ్లాక్‌డే’ను విజయవంతం చేసేందుకు నడుం బిగించారు. కాగా, చర్చలకు తాము సిద్ధమని, కేంద్ర ప్రభుత్వమే చొరవ చూపాలని 40 రైతు సంఘాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంయుక్త్ కిసాన్ మోర్చా (ఎస్‌కెఎం) స్పష్టం చేసింది. ప్రధాని నరేంద్ర మోడీకి తమ సంసిద్ధతను తెలుపుతూ లేఖ కూడా రాసినట్టు పేర్కొంది. మూడు వ్యవసాయ చట్టాల రద్దు కోసం రైతులు వివిధ రూపాల్లో నిరసనలు వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. సుమారు ఆరు నెలల కాలంలో ‘ట్రాక్టర్ పరేడ్’ నుంచి ‘చక్కా జామ్’ వరకూ ఎన్నో రీతుల్లో ఆందోళనలు చేపట్టారు. ఢిల్లీ సరిహద్దుల్లో గుడారాలు వేసుకొని, ఎండకు ఎండుతూ, చలికి వణుకుతూ, వర్షానికి నానుతూ తమ దీక్షను కొనసాగిస్తున్నారు. ఈ నిరసన దీక్ష ప్రారంభమై ఆరు నెలలు పూర్తి అవుతున్న నేపథ్యంలో, మరోసారి రైతులు నిరసన గళం విప్పారు. మంగళవారం బ్లాక్‌డేను నిర్వహించాలని ఎస్‌కెఎం ఇచ్చిన పిలుపు మేరకు ఢిల్లీకి క్యూ కట్టారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు హర్యానాలోని కర్నల్ జిల్లా నుంచి పెద్దఎత్తున రైతులు దిల్లీకి తరలివెళ్లారు. పంజాబ్ నుంచి కూడా భారీగా అన్నదాతలు బయలుదేరారు. ’బ్లాక్ డే’ నిరసనలో భాగంగా వారంపాటు ఢిల్లీ సరిహద్దుల్లో సామూహిక భోజన కార్యక్రమం నిర్వహించనున్నారు. దేశ వ్యాప్తంగా కొవిడ్ ఉధృతి కొనసాగుతున్నప్పటికీ, రైతులు మొక్కవోని దీక్షతో తమ ఆందోళన కొనసాగించడం విశేషం. ఇలావుంటే, కేంద్రంతో చర్చలకు రైతులు ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నారని ఎస్‌కెఎం వ్యాఖ్యానించింది. కొవిడ్ వ్యాప్తికి ఢిల్లీ సరిహద్దులో నిరసనను కొనసాగిస్తున్న రైతులు కూడా కారణమవుతున్నారని వచ్చిన విమర్శలను ఖండించింది. రైతు శిబిరాల్లో ఎక్కడా కొవిడ్ లేదని తన ప్రకటనలో పేర్కొంది. రైతు సంఘాలు, కేంద్ర ప్రభుత్వం మద్య ఇప్పటి వరకూ 11 పర్యాయాలు చర్చలు జరిగిన విషయం తెలిసిందే. మూడు సాగు చట్టాలను రద్దు చేసి తీరాలన్నది రైతుల డిమాండ్. అయితే, ఈ చట్టాల అమలును ఏడాదిన్నర పాటు వాయిదా వేసి, ఈలోగా ఏవైనా సూచనలు, సలహాలు ఇస్తే వాటిని పరిగణలోకి తీసుకుంటామని కేంద్రం స్పష్టం చేస్తున్నది. ఇందుకు సిద్ధమైతేనే చర్చలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. అప్పటి నుంచి ఈ విషయంలో ప్రతిష్టంభన నెలకొంది. ఈ పరిస్థితుల్లో కేంద్రం మళ్లీ చర్చలు ప్రారంభించడం అనుమానంగానే కనిపిస్తున్నది.
వామపక్షాలు సహా 12 ప్రతిపక్షాల సంఘీభావం
కేంద్ర సాగుచట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో కొనసాగుతున్న రైతుల పోరాటం ఈ నెల 26తో ఆరు నెలలు పూర్తి చేసుకుంటుది. దీనిని పురస్కరించుకొని రైతు సంఘాల ఉమ్మడి వేదిక సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కెఎం) 26న దేశవ్యాప్త నిరసనకు పిలుపునిచ్చింది. ఈ నిర్ణయానికి సిపిఐ, సిపిఐ (ఎం) సహా 12 ప్రధాన ప్రతిపక్షాలు సంఘీభావం ప్రకటించాయి. కాగా కొవిడ్ కారణంగా బాధపడుతున్న లక్షలాది అన్నదాతల్ని కాపాడేందుకు సాగుచట్టాల్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 12న ప్రతిపక్షాలు ఉమ్మడిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాశాయి. చట్టాల్ని రద్దుచేస్తేనే రైతులు భారత ప్రజలకు అన్నం పెడతారని ఆ లేఖలో ప్రతిపక్షాలు పేర్కొన్నాయి.
అంతేకాకుండా స్వామినాథన్ కమిటీ సిఫారసులకు అనుగుణంగా ఉత్పత్తి ఖర్చుకు అదనంగా 50% కలిపి కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ తాజాగా ఓ పత్రికా ప్రకటన విడుదల చేశాయి. ఈ విషయంలో కేంద్రం పట్టుదలకు పోకుండా ఎస్‌కెఎంతో వెంటనే చర్చలు జరపాలని కోరాయి. ఈ ప్రకటనపై సిపిఐ ప్రధాన కార్యదర్శి డి. రాజా, సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సహా సోనియా గాంధీ (కాంగ్రెస్), హెచ్‌డి దేవెగౌడ (జెడి ఎస్), శరద్ పవార్ (ఎన్‌సిపి), మమతా బెనర్జీ (టిఎంసి), ఉద్ధవ్ ఠాక్రే (శివసేన), ఎంకె స్టాలిన్ (డిఎంకె), హేమంత్ సోరేన్ (జెఎంఎం), ఫారూఖ్ అబ్దుల్లా (జెకెపిఎ), అఖిలేశ్ యాదవ్ (ఎస్‌పి), తేజస్వి యాదవ్ (ఆర్‌జెడి) సంతకాలు చేశారు.
రైతుల ఢిల్లీ బాట
RELATED ARTICLES