హైవేల దిగ్బంధం
లాఠీచార్జికి నిరసనగా అన్నదాతల ఆందోళన
‘నల్ల’ చట్టాలపై పోరాటం ఆగదని స్పష్టీకరణ
చండీగఢ్: కార్పొరేట్ రంగానికి ఉపయోగపడే విధంగా ఉన్న మూడు సాగు చట్టాలను రద్దు చేసే వరకూ తమ ఆందోళన కొనసాగుతుంద ని రైతులు స్పష్టం చేశారు. హర్యానాలోని కర్నల్ ప్రాంతంలో బిజెపి రాష్ట్ర విభాగ అధ్యక్షుడు ఒపి ధన్‌కర్ కారును అడ్డుకున్నారన్న ఆరోపణలపై రైతులపై శుక్రవారం జరిగిన లాఠీచార్జికి నిరసనగా సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కెఎం) నేతృత్వంలో శనివారం రైతులు ఆందోళన చేపట్టారు. సాయంత్రం 5 గంటల సమయంలో హైవేలను దిగ్బంధించారు. దీనితో ఢిల్లీ నుంచి అంబాలాకు వెళ్లే హైవేలోని కురుక్షేత్రతోపాటు శంభూ టోల్ ప్లాజా వద్ద కూడా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రైతులు రోడ్లపై మంచాలు వేసుకొని కూర్చోవడంతో పలుచోట్ల ఎక్కడి వాహనాలు అక్టకడే నిలిచిపోయాయి. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా సుమారు తొమ్మిది నెలల నుంచి ఢిల్లీ సరిహద్దుల్లోని టిక్రీ, ఘజియాబాద్, సింఘు కేంద్రాలుగా రైతులు నిరసనలు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. వివిధ రకాలుగా వారు నిరసనలు వ్యక్తం చేస్తున్నప్పటికీ కేంద్రం నుంచి ఎలాంటి స్పందన రావడం లేదు. సాగు చట్టాల రద్దు కుదరదని, అవసరమైతే వాటిలో మార్పులుచేర్పులు చేస్తామని మోడీ సర్కారు ప్రకటించడంతో, ఈ ఏడాది జనవరి 22 తర్వాత చర్చలు జరగలేదు. అంతకు ముందు రైతులు, కేంద్ర ప్రతినిధి బృందం మధ్య జరిగిన 11 విడతల చర్చలు విఫలంకాగా, తాజాగా మళ్లీ చర్చలకు సిద్ధంగా ఉన్నామని ఎస్‌కెఎం ప్రకటించింది. కానీ, చట్టాల రద్దు మినహా మిగతా డిమాండ్లను పేర్కోవాల్సిందిగా ప్రభుత్వం తేల్చిచెప్పడంతో ప్రతిష్టంభన కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలో, రైతులు ఆందోళనలను కొనసాగిస్తూనే, బిజెపి ప్రజాప్రతినిధులు, ఇతర నేతల ఇళ్లు, కార్యాలయాల వద్ద నిరసన ప్రదర్శనలు జరుగుపుతున్నారు. ఈ క్రమంలోనే కర్నల్ ప్రాంతంలో బిజెపి నేత ఒపి ధన్‌కర్ కారును రైతులు ఆడ్డుకోవడంతో, పోలీసులు లాఠీ చార్జి చేశారు. అందుకు నిరసనగా శనివారం ఎస్‌కెఎం చేపట్టిన హర్యానా హైవేల దిగ్బంధనం కార్యక్రమం విజవంతమైంది. కాగా, శనివారం కూడా పలువురు ర,తులను పోలీసులు అరెస్టు చేశారని ఎస్‌కెఎం నాయుకుడు దర్శన్‌పాల్ ఒక ప్రకటనలో ఆలోపించారు. వారిని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.