సుప్రీం కోర్టు సూచన ప్రభుత్వం నుంచి పనయ్యేలా లేదని వ్యాఖ్య
న్యూఢిల్లీ: కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో కొనసాగుతున్న నిరనసల మీద ఏర్పడిన ప్రతిష్టంభన తొలగించేందుకు ప్రభుత్వం, దేశవ్యాప్తంగా ఉన్న రైతు సంఘాల ప్రతినిధులతో ఒక కమిటీని వేయాలనుకుంటున్నట్లు సుప్రీంకోర్టు బుధవారం నాడు సూచించింది. లేకపోతే ఇది “జాతీయ అంశంగా మారే” అవకాశం ఉందని తెలిపింది. “మీ చర్చలు ఫలవంతంగా సాగలేదు. అవి విఫలమయ్యాయి. ఇంకా చర్చలు జరుపుతామని అంటున్నారు” అని ప్రధాన న్యాయమూర్తి ఎస్.ఎ.బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం ప్రభుత్వం తరఫున వాదిస్తున్న సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాతో పేర్కొంది. “అవును, మేం రైతులతో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నాం” అని మెహతా బదులిచ్చారు. ఢిల్లీ రోడ్లను దిగ్బంధం చేస్తున్న రైతు సంఘాల పేర్లను తమకు తెలపాలని ధర్మాసనం మెహతాను కోరింది. దానికి ఆయన ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్న రైతు సంఘాల పేర్లను సుప్రీంకోర్టుకు విన్నవించారు. ఇంకా మరింత మంది నిరసనల్లో పాల్గొనేలా ఉన్నారని, ప్రభుత్వం మాత్రం చర్చలకు సిద్ధంగా ఉందని మెహతా స్పష్టం చేశారు. అయితే చట్టాలను రద్దు చేస్తేనే చర్చలు జరుపుతాం, లేకపోతే లేదు అంటున్నారు రైతులు. మంత్రులు చర్చలు జరుపుతుండగానే “అవును” లేదా “కాదు” అన్న ప్లకార్డులను చూపించారని మెహతా కోర్టుకు తెలిపారు. వాదనలన్నీ విన్న తర్వాత “వివాద పరిష్కారానికి మేం ఒక కమిటీని నియమించాలని అనుకుంటున్నాం. అందులో ప్రభుత్వ ప్రతినిధులు, రైతు సంఘాల ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. లేకపోతే ఇది త్వరలోనే జాతీయ అంశం అయ్యేట్లు ఉంది. దేశంలోని ఇతర రైతు సంఘాల ప్రతినిధుల సభ్యులను కూడా కలుపుకొందాం. కమిటీ సభ్యుల పేర్లను మీరు ప్రతిపాదించండి” అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. రైతుల నిరసనల కారణంగా రోజువారీ ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వేలాది మంది పోగవడం వల్ల కొవిడ్ కేసులు పెరిగే అవకాశం ఉందని, ఈ విషయంలో అధికారులకు మార్గదర్శకాలు జారీచేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఢిల్లీ సరిహద్దుల నుంచి రైతులను ఖాళీ చేయించేందుకు, వివాదానికి పరిష్కారం కనుక్కునేందుకు సుప్రీంకోర్టు ప్రభుత్వానికి, ఇతరులకు నోటీసులు జారీచేసింది. వీడియో కాన్ఫరెన్సు ద్వారా కేసును విచారణ చేస్తున్నారు. అయితే పిటిషన్లలో రైతు సంఘాలనూ కక్షిదారులుగా చేర్చాలని సుప్రీంకోర్టు పిటిషనర్లకు సూచించింది. కేసు విచారణను గురువారం (ఈరోజుకు) నాటికి వాయిదా వేసింది.
రైతుల ఆందోళనలపై కమిటీ
RELATED ARTICLES