HomeNewsTelanganaరైతులు, కార్మిక సమస్యల పరిష్కారానికి పోరాటాలు తీవ్రతరం

రైతులు, కార్మిక సమస్యల పరిష్కారానికి పోరాటాలు తీవ్రతరం

సంయుక్త కిసాన్‌మోర్చా కార్మిక సంఘాల వేదిక పిలుపు

ప్రజాపక్షం/హైదరాబాద్‌ రైతు కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేస్తున్న బిజెపి కేంద్ర పాలకులను ఓడించాలని రైతు, కార్మిక సంఘాల రౌండ్‌ టేండ్‌ సమావేశం డిమాండ్‌ చేసింది. సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కెఎం) కార్మిక సంఘాల వేదిక పిలుపులో భాగంగా బిజెపి కేంద్ర పాలకులు అమలు చేస్తున్న రైతు, కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 26న హైదరాబాద్‌లోని సుందరయ్య పార్క్‌ బాగ్‌లింగంపల్లి నుండి ఇందిరాపార్క్‌ వరకు జరిగే వాహనాల ర్యాలీని విజయవంతం చేయాలని కోరారు. ఫిబ్రవరి 16న చేపట్టనున్న ‘గ్రామీణ బంద్‌’ను విజయవంతం చేసేందుకు వాల్‌ పోస్టర్లను, కరపత్రాలను విస్తృతంగా ఇంటింటికీ పంపిణీ చేసి, కేంద్ర బిజెపి పాలకుల అసలు నైజాన్ని ప్రజలకు వివరించాలని సూచించింది.హైదరాబాద్‌ నారాయణగూడలోని ఎఐటియుసి రాష్ట్ర కార్యాలయంలో సంయుక్త కిసాన్‌ మోర్చా తెలంగాణ రాష్ట్ర కమిటీ కన్వీనర్‌ పశ్యపద్మ అధ్యక్షతన సోమవారం రౌండ్‌ టేండ్‌ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సంయుక్త కిసాన్‌ మోర్చా కన్వీనర్లు టి.సాగర్‌, ఎన్‌.బాలమల్లేష్‌, రాయల చంద్రశేఖర్‌, బిక్షపతి, జక్కుల వెంకటయ్య, ఎఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్‌.బాల్‌రాజ్‌, సిఐటియు రాష్ట్ర నాయకులు భూపాల్‌, ఐఎఫ్‌టియు
రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఎస్‌.ఎల్‌.పద్మ, ఎస్‌కెఎం నాయకుడు శంకర్‌, పల్లవి తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షుడు కె.కాంతయ్య, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ప్రసాద్‌ బొప్పెన, పద్మ, తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఉపాధ్యక్షులు ప్రభులింగం, రాష్ట్ర రైతు సంఘం నాయకురాలు నీతూ శర్మ, మేడ్చల్‌ జిల్లా రైతు సంఘం కార్యదర్శి సామల వెంకటరెడ్డి, కనకయ్య, చంద్రయ్య, వికారాబాద్‌ జిల్లా రైతు నాయకుడు సురేష్‌, సంగారెడ్డి జిల్లా రైతు సంఘం నాయకుడు శివుడు తదితరులు పాల్గొన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులతో పాటు రైతాంగ, కార్మిక సమస్యలను పరిష్కరించేందుకు పోరాటాలను తీవ్రతరం చేయాలని రైతులను, కార్మికులను ప్రజలను సమావేశంలో ప్రసంగించిన వక్తలు విజ్ఞప్తి చేశారు. అనేక సంవత్సరాల పాటు పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను నాలుగు కోడ్‌లుగా మార్చి, వాటిని అమలు చేసేందుకు పూనుకుంటున్న కేంద్రంలోని బిజెపి ప్రభుత్వాన్ని ఓడించేందుకు ప్రజా వ్యతిరేక ఆర్థిక విధానాలను తిప్పికొట్టడంలో అగ్రగామి పాత్ర పోషించాలన్నారు. కార్పొరేట్‌ శక్తులకు కొమ్ముకాస్తూ ప్రజా సంక్షేమాన్ని విస్మరిస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని ఓడించటంలో భాగంగా ప్రజలను చైతన్యవంతం చేసేందుకు ఈనెల 26న ట్రాక్టర్ల వాహనాల ర్యాలీని జిల్లా కేంద్రాలలో విజయవంతం చేయాలని, ఫిబ్రవరి 16 గ్రామీణ బంద్‌ను విజయవంతం చేసేందుకు సర్వసన్నద్ధం కావాలని వారు పిలుపునిచ్చారు.
ఆర్థికపోరాటాన్ని రాజకీయంగా మలిచి బిజెపిని ఓడించాలి: పశ్మపద్మ
ఆర్థిక పోరాటాన్ని రాజకీయ పోరాటంగా మలిచి బిజెపిని ఓడించాలని పశ్యపద్మ పిలుపునిచ్చారు. చారిత్రాత్మక రైతు ఉద్యమ నేపథ్యంలో పంటలకు మద్దతు ధరల గ్యారంటీల చట్టం, రుణమాఫీ చట్టం, విద్యుత్‌ సవరణ బిల్లును ఉపసంహరించే అంశంపైన ప్రధాని మోడీ లిఖితపూర్వకంగా ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటి అమలు చేయలేదని విమర్శించారు. హామీల అమలుకు ఎటువంటి చర్యలూ తీసుకోకపోవడం క్షమించరాని నిర్లక్ష్యమని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత దశాబ్ద కాలంలో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా దేశంలో పేదరికం పెరిగిందని, నిరుద్యోగ సమస్య, అధిక ధరలు అధికమయ్యామని విమర్శించారు. వ్యవసాయాన్ని ప్రైవేట్‌ కార్పొరేట్‌ శక్తులకు దారాదత్తం చేయడానికి ప్రధాని మోడీ కంకణం కట్టుకున్నారని విమర్శించారు. రైతులు, కార్మికులు, ప్రజలు ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలను పరిష్కరించకుండా దారి మళ్లించే క్రమంలో భాగంగా బాల రాముడు ప్రతిష్టాపన పేరుతో మభ్యపెడుతున్నారన్నారు. మతం, రాముడు, నమ్మకం, భక్తి వ్యక్తిగతమని, బిజెపి పాలకులు మతాన్ని రాజకీయాలకు జోడించి హిందుత్వ నినాదాన్ని ముందుకు తీసుకెళ్ళటం ద్వారా మెజారిటీ హిందువుల ఓట్లు పొందేందుకు కుతంత్రం చేస్తున్నారన్నారు. ఎన్‌.బాలమల్లేష్‌ మాట్లాడుతూ కార్పొరేట్‌ శక్తులకు కొమ్ముకాస్తూ ప్రజా సంక్షేమాన్ని విస్మరిస్తున్న బిజెపి ప్రభుత్వాన్ని ఓడించాలన్నారు. టి.సాగర్‌ మాట్లాడుతూ పంటల కొనుగోలు బాధ్యత నుండి బిజెపి ప్రభుత్వం తప్పుకుంటున్నదని, సహకార సంస్థలను నిర్వీర్యం చేస్తోందని విమర్శించారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments