రైతుబంధు పేరుతో రాజకీయ ఒత్తిళ్లు
పంటల విధానంపై సర్కారు ఏకపక్ష నిర్ణయాలు సరికాదు
తక్షణమే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలి
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి డిమాండ్
ప్రజాపక్షం/హైదరాబాద్ : రైతుబంధు పేరుతో రైతులను బెదిరింపులకు గురిచేయడం రాజకీయ జోక్యం చేసుకోవడమేనని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. రైతులకు విత్తనాలు, ఎరువులు సరఫరా చేసి పం డించిన పంటలను కొనుగోలు చేస్తామనే నిర్ణ యం మంచిదేనని, అయితే ఏ పంటలు వేయాలనే విషయాలపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. పంటల విధానంపై ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం సరైంది కాదని, వెం టనే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి వ్యవసాయ రంగ నిపుణులతో చర్చించి ఒక సమగ్ర విధానాన్ని రూపొందించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లోని సిపిఐ రాష్ట్ర కార్యాలయం మఖ్దూంభవన్‌లో ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదదర్శి పల్లా వెంకట్‌రెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యులు సయ్యద్ అజీజ్‌పాషాతో కలిసి చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడారు. రైతుబంధు పథకం అమలులో రైతులను బెదిరింపులకు గురిచేసే ధోరణి సరైంది కాదని, ప్రభుత్వం వెంటనే తన వైఖరిని మానుకోవాలని డిమాండ్ చేశారు. రైతుబంధు ఇవ్వాలంటే ప్రభుత్వం చెప్పిన పంటలు వేయాలని బెదిరించడం సమంజసం కాదన్నారు. రైతుబంధు సమితులు టిఆర్‌ఎస్ కార్యకర్తలతో కూడుకున్నవేనని, ఆ కమిటీలను రైతులు ఎన్నుకోలేదన్నారు. లాక్‌డౌన్ వల్ల వలస కార్మికుల కష్టాలు, కడగండ్లకు అంతులేకుండా పోయాయన్నారు. దేశంలో ప్రధానమంత్రి, రాష్ట్రంలో ముఖ్యమంత్రి పేదలకు చేపట్టిన ప్రత్యేక సహాయ కార్యక్రమాలు నామమాత్రమేనన్నారు. పేదలకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు. అసంఘటిత రంగ కార్మికులు, చేతివృత్తిదారులు, దినసరి కార్మికులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. సుమారు 12 ఏళ్ల అమ్మాయి తన తండ్రిని సైకిల్‌పై కూర్చోబెట్టుకుని 1200 కిలోమీటర్లు ప్రయాణించి బీహార్‌కు వెళ్ళాల్సి రావడం బాధాకరమన్నారు. మహిళలు బజార్లలో ప్రసవించాల్సిన దుస్థితి రావడం విచారకరమన్నారు. పోడుసాగుదారుల సమస్యలను పరిష్కరిస్తామని అసెంబ్లీలో సిఎం కెసిఆర్ హామీ ఇచ్చారని, అది నేటి వరకు నెరవేరలేదని చాడ వెంకట్‌రెడ్డి విమర్శించారు. పోడు సాగుదారులకు పట్టాలిచ్చే ఊసే లేదన్నారు. సాగుదారులపై అటవీ, పోలీసు అధికారులు కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. పోడు సాగుదారులకు పట్టాలివ్వకుండా తాత్సారం చేస్తున్నారని, వివాదాల సాకుతో ప్రభుత్వం తప్పించుకుంటున్నదని విమర్శించారు. పోడుసాగుదారులు చేసే పోరాటాలకు సిపిఐ అండగా ఉంటుందని, ఇందు కోసం వామపక్ష పార్టీలతో కలిసి ఉద్యమిస్తామన్నారు. అజీజ్‌పాషా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీలో దేశంలో ఉన్న దాదాపు 6.30 కోట్ల మధ్య, చిన్న తరహా పరిశ్రమలకు రూ.3 లక్షల కోట్ల ప్యాకేజీ మాత్రమే ఇవ్వడం అన్యాయమన్నారు. ఈ ప్యాకేజీతో కేవలం 8 శాతం పరిశ్రమలకు మాత్రమే లబ్ధి జరుగుతుందని, మిగిలిన పరిశ్రమల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. అసంఘటిత రంగ కార్మికులకు బ్రెజిల్‌లో 120 డాలర్లు, జపాన్‌లో 990 డాలర్ల నగదును ఆర్థిక సహాయంగా అందిస్తుండగా, భారతదేశంలో అసంఘటిత రంగ కార్మికులకు అలాంటి నగదు, ఆర్థిక సహాయం ఏమీ చేయకపోవడం విచారకరమన్నారు. కేంద్ర ప్రభుత్వానికి దూరదృష్టి లేకపోవడం వల్ల భవిష్యత్‌లో దేశంలో మరింత గడ్డు రోజులు రానున్నాయని ఆయన పేర్కొన్నారు. కేవలం నాలుగు గంటలు మాత్రమే సమయం ఇచ్చి లాక్‌డౌన్ విధించిడం వల్ల వలస కార్మికులు ఎక్కడికక్కడ చిక్కుకుని ఇప్పటికీ లక్షలాది మంది ఇబ్బందులకు గురవుతున్నారన్నారు.