చెప్పిన పంట వేయకుంటే రైతుబంధు ఇవ్వబోమని చెప్పడం దారుణం
జిఒ 3 రద్దుపై సుప్రీంలో రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలి
పోతిరెడ్డిపాడు ఎపి జిఒపై స్పందించకుంటే ఉద్యమాలు
ప్రభుత్వాన్ని హెచ్చరించిన అఖిలపక్ష సమావేశం
ప్రజాపక్షం / హైదరాబాద్ : చెప్పిన పంట వేయకుంటే ‘రైతుబంధు’ ఇవ్వం అనడాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా ఖండించాయి. ఇది బెదిరింపు ధోరణి ప్రకటన అని, తక్షణమే దీనిని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశా యి. ఏజెన్సీ ప్రాంత ఉపాధ్యాయ ఉద్యోగాలు గిరిజనులకే కల్పించే జిఒ 3ను రద్దు చేస్తూ సుప్రీంకోర్డు ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని, ఈలోగా దానిని కొనసాగిస్తూ తక్షణమే ఆర్డినెన్స్ తీసుకురావాలని కోరాయి. పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచుతూ ఎపి ప్రభుత్వం తీసుకువచ్చిన జిఒతో రాష్ట్రానికి తీవ్ర నష్టం కలుగుతుందని, రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించకపోతే ఉద్యమిస్తామని హెచ్చరించాయి. హైదరాబాద్‌లోని మగ్దూంభవన్‌లో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అధ్యక్షతన సోమవారం అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్, ఎఐసిసి కార్యదర్శి ఎస్.ఎ.సంపత్‌కుమార్, టిజెఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ ఎం.కోదండరామ్, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్‌గౌడ్, టిడిపి సీనియర్ నాయకుడు పి.సాయిబాబా, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డాక్టర్ డి.సుధాకర్, హైకోర్టు న్యాయవాది వసుధ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిఒ 3 రద్దు, రైతుబంధు, పోతిరెడ్డిపాడు, కరోనాపై రాష్ట్ర ప్రభుత్వ చర్యలు తదితర అంశాలపై చర్చించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు వివరాలను వెల్లడించారు.
పోతిరెడ్డిపాడు పెంపుపై నిమ్మకు నీరెత్తినట్లున్న ప్రభుత్వం : చాడ
పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని పెంచుకొని, రెట్టింపు నీటిని తరలించుకుపోయేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకువచ్చిన జిఒపై టిఆర్‌ఎస్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నదని చాడ వెంకట్‌రెడ్డి విమర్శించారు. గతంలో పోతిరెడ్డిపాడు నుండి 40 వేల క్యూసెక్కులు తరలిస్తామంటేనే అసెంబ్లీలో తాము, టిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు తీవ్రంగా వ్యతిరేకించామని, ఇప్పుడు రెట్టింపు తీసుకుపోయేందుకు సిద్ధమవుతున్నా నోరు ఎందుకు మెదపడం లేదని ప్రశ్నించారు. దీనిపై ప్రభుత్వం స్పందించి అఖిలపక్ష సమావేశం పెట్టాలని, లేదంటే తాము వివిధ పార్టీలు, రిటైర్డ్ ఇంజినీర్లతో సంప్రదించి ఉద్యమిస్తామన్నారు. ఏజెన్సీల్లో ప్రభుత్వ టీచర్ ఉద్యోగాల్లో స్థానిక గిరిజనులకే అవకాశం కల్పిస్తూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1986లో తీసుకువచ్చిన జిఒ నెంబర్ 3తో ఏజెన్సీల్లో అక్షరాసత్య పెరిగిందని చాడ వెంకట్‌రెడ్డి తెలిపారు.1986కు ముందు ఆ ప్రాంతాల్లో మూడు శాతమే అక్షరాస్యత ఉండగా, 2011 జనాభా లెక్కల ప్రకారం 35 శాతానికి పెరిగిందన్నారు. ఇదే విషయాన్ని హైకోర్టు ధృవీకరించినప్పటికీ, సుప్రీంకోర్టు జిఒను కొట్టేసిందని, తక్షణమే తెలంగాణ, ఆంధప్రదేశ్ ప్రభుత్వాలు జిఒ స్థానంలో ఆర్డినెన్స్‌ను తీసుకురావాలని, సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ నడిబొడ్డులో ఉన్న నానక్‌రామ్ గూడలో జెఎంజి, ఎంసిసిఎంలో కన్‌స్ట్రక్షన్ కంపెనీల్లో పని చేసే వలస కార్మికులకు కనీస వసతులు లేవని, ప్రభుత్వం నుండి బియ్యం, రూ.500 అందలేదన్నారు. వలస కూలీలు ఎవ్వరికీ ఇబ్బంది రాలేదంటున్న ప్రభుత్వ పెద్దలకు తనతో వస్తే నానక్‌రామ్ గూడలో వారు పడుతున్న ఇబ్బందులను చూపిస్తానని సవాలు విసిరారు.