ఈదురుగాలులకు అన్నదాతలు ఆగమాగం
ప్రజాపక్షం/మల్లాపూర్ / ఇబ్రహీంపట్నం / కామారెడ్డి /గాంధారి : రాష్ట్రంలో అకాల వర్షాలు ఇంకా రైతులను వెంటాడుతునే ఉన్నాయి. మరోసారి ఆదివారం రాత్రి, సోమవారం ఉదయం కురిసిన అకాల వర్షానికి రైతులు తీవ్రంగా నష్టపోయారు. పలు జిల్లాలలో ఆదివారం రాత్రి ఈదురు గాలులతో కురిసిన భారీ వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది. వరి, మామిడి తోటలకు నష్టం వాటిల్లింది. జగిత్యాల, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి తదితర జిల్లాలో వర్షం ప్రభావం తీవ్రంగా ఉంది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట అమ్ముకుని నాలుగు రాళ్లు వేనకేసుకుని ఉందామనుకున్నా అన్నదాతల ఆశలను అకాల వర్షాలు నీరుగారుస్తున్నాయి. ఈ అకాల వర్షంతో కల్లాలో ఉన్న ధాన్యం తడిసిముద్దకావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పంట చేతికి వస్తున్న సమయంలో అకాల వర్షం వల్ల అన్నదాతలు ఆందోళనకు గురవుతున్నారు. ఇది లా ఉండగా జగిత్యాల, కోరుట్ల, రాయికల్, మేడిపల్లిలో ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది. దీంతో జగిత్యాల -నిజామాబాద్ జాతీ య రహదారిపై చెట్లు విరిగిపడటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇక సిరిసిల్ల, వేములవాడలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో కూడా భారీ వర్షం కురవడంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలో భారీ వర్షం, ఈదురు గాలులకు పంటచేలు లోని వరి ధాన్యం మార్కెట్ యార్డుల్లో విక్రయానికి సిద్దంగా ఉన్న వరి ధాన్యం తడిసి ముద్దవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తడిసిన ధాన్యాన్ని నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కన్నీటి పర్యంతమౌతున్నారు. కాగా మండలంలో పలు చోట్ల తడిసిన ధాన్యాన్ని పలువురు రాజకీయ నాయకులు సందర్శించి ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసి నష్టపోయిన రైతులకు పరిహారాన్ని అందించాలని డిమాండ్ చేశారు. అలాగే అక్కడ వర్షాలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని తడిసిన ధాన్యాన్ని రైస్ మిల్లర్లతో మాట్లాడి కొనుగోలు చేయాలని తహసీల్దార్ రవీందర్‌కు వివిధ పార్టీల నాయకులు వేరువేరుగా వినతిపత్రాలను అందజేశారు. ఇబ్రహీంపట్నం మండలంలో కేంద్రంతో పాటు వర్షకొండ, డబ్బా, అమ్మక్కపేట్, గోధూర్, తిమ్మాపూర్, యామపూర్,ఫకీర్ కొండాపూర్, వేములకుర్తి, మూలరాంపూర్ ఎర్దండి, కేశాపూర్ తదితర గ్రామాలలో గల వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో వర్షానికి తడిసిన ధాన్యాన్ని ఎంపిపి జాజాల భీమేశ్వరి, మార్కెట్ కమిటీ చైర్మన్ జంగా ద్యావతి సరస్వతి, తహాసీల్దార్ మహేశ్వర్ పరిశీలించారు. ఇబ్రహీంపట్నం గోదూర్ తిమ్మాపూర్, డబ్బా అమ్మక్కపేట్ గ్రామాలలో కొన్ని వరిధాన్యం కుప్పలు, కొన్ని సంచులు ఎక్కువగా తడిసినట్లు గుర్తించారు. ఆయా గ్రామాల రైతులతో మాట్లాడి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అలాగే ధాన్యం కొనుగోలు కేంద్రాల ఇంచార్జ్‌లతో మాట్లాడి ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు ఎల్లాల దశరథ్‌రెడ్డి, మండల కోఅప్షన్ సభ్యులు ఏలేటి చిన్నారెడ్డి, మండల ఎంపిటిసిల ఫోరం అధ్యక్షులు పోనుకంటి వెంకట్, ఎపిఎం శంకర్ తదితరులు పాల్గొన్నారు.
కారం బువ్వ తిని కట్టుకున్న ఆదుకోండి బాంచన్
కూలి నాలి చేసుకుని రూపాయి పోగేసి కారం బువ్వ తిని కట్టుకున్న తన ఇల్లు ఆదివారం రాత్రి కురిసిన అకాల వర్షానికి భారీ ఈదురు గాలులకు ధ్వంసం కావడంతో మండల కేంద్రానికి చెందిన సురా రామవ్వ అనే బాధితురాలు ఏడ్చిన హృదయ విదారక సంఘటన పలువురిని కలచివేసింది. రాత్రి కురిసిన అకాల వర్షానికి భారీ గాలులకు రామవ్వ నిర్మించుకున్న రేకుల షెడ్డు పైకప్పు పూర్తిగా ధ్వంసమై సుమారు రూ.2 లక్షల నష్టం వాటిల్లిందని ప్రభుత్వపరంగా ఆదుకోవాలని కన్నీటి పర్యంతమైంది. అలాగే మండల కేంద్రాలతో పాటు చాలా గ్రామాలలో ఈదరు గాలులకు ఇండ్ల పైకప్పులు లేచిపోయి చాలా వరకు నష్టం వాటిల్లింది. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుని నిలువ నీడ చూపాలని ప్రజాప్రతినిధులు కోరుతున్నారు.
అన్నదాత కంట కన్నీళ్ళు
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఈ యాసంగి సీజన్‌లో 6 లక్షల ఎకరాలకు పైగా వరి సాగు చేశారు. ఇప్పటికే బాన్సువాడ, బోధన్ నియోజకవర్గాల్లో 70 శాతం ధాన్యం కొనుగోలు కేంద్రాలకు, మరికొంత బయట వ్యాపారస్థులకు విక్రయించుకోగా మిగతా 30 శాతం ధాన్యం రహదారులపై, పొలం గట్లలో ఉండగా గత వారం రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలు ధాన్యాన్ని తడిసి ముద్ద చేస్తున్నాయి. ధాన్యం కొనుగోలుకేంద్రాల్లో కొనుగోలు వేగవంతం కాకపోవడం వలన కుప్పలు తెప్పలుగా ధాన్యం రాసులు పడి ఉన్నాయి. సోమవారం తెల్లవారుజామున కురిసిన అకాల వర్షం రైతులను కన్నీళ్ళు పెట్టిస్తుంది. బిక్కనూర్, ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట్, సదాశివనగర్, ఆర్మూర్, నవిపేట్, నందిపేట్, ఎడపల్లి, రెంజల్, కమ్మర్‌పల్లి, వేల్పూర్, కోటగిరి, రుద్రూర్, చందూర్, నిజామాబాద్, కామారెడ్డి ప్రాంతాల్లో కోసిన వరి ధాన్యం కుప్పలు కుప్పలుగా పేరుకుపోయాయి. ఈ ప్రాంతంలో ధాన్యం కొనుగోళ్ళు విజయవంతం కాకపోవడంతో వర్షాలు రైతులను నట్టేట ముంచుతున్నాయి. వర్షాలకు బీర్కూర్ మార్కెట్ కమిటీ ఆవరణలో ఉంచిన ధాన్యంతో పాటు ధాన్యం బస్తాలు తడిచి ముద్దయ్యాయి.
వర్షం నీటిలో కొట్టుకుపోయిన వరి ధాన్యం
గాంధారి మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో వరి ధాన్యం ఆదివారం అర్దరాత్రి కురిసిన వర్షం నీటిలో కొట్టుకుపోయింది. ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు చేయకపోవడం వల్లనే ఈ పరిస్థితి తలెత్తిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం తెలిసిన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తూర్పురాజులు రైతుల వద్దకు వెళ్ళి వారిని పలకరించారు. ఆయన మాట్లాడుతూ మార్కెట్‌యార్డులోనే కాకుండా ప్రతీ గ్రామంలో ఈ రకంగానే ఉందన్నారు. రైతులకు నష్టం జరుగుతుంటే స్థానిక ప్రజా ప్రతినిధులు కళ్ళప్పగించి చూస్తున్నారే తప్పా వారిని ఆదుకునేందుకు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని విమర్శించారు. వెంటనే రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు రమేష్‌రావు, బాబా, గోపాల్, పరమేష్, ప్రవీణ్‌గౌడ్, హరిసింగ్, బాలు, బొమ్మని బాలు తదితరులు పాల్గొన్నారు.
విలవిలలాడుతున్న రైతులు
రామలక్ష్మణ్‌పల్లిలో ఆదివారం రాత్రి కురిసిన వర్షంతో ధాన్యం తడిచిపోయి రైతులు విలవిలలాడుతున్నారు. ఒక్కసారిగా జోరుగా వర్షం కురియడంతో కోతకు వచ్చిన వరిధాన్యం నీటిపాలైందని రైతులు సత్యనారాయణ, రవి, లక్ష్మణ్ రోధించారు. వర్షానికి సుమారు 10 క్వింటాళ్ళ ధాన్యం నీటిపాలైందని గ్రామసర్పంచ్, డైరెక్టర్ అంచనా వేశారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని, మార్కెట్ యార్డులో కనీస వసతులు కల్పించాలని రైతులు కోరుతున్నారు.