భారీ వర్షాలతో నష్టపోయిన పంటలకు పరిహారం చెల్లించండి
తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ డిమాండ్
ప్రజాపక్షం/హైదరాబాద్ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల చేతికి వచ్చే సమయంలో పంటలు దెబ్బతిన్నాయని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ అన్నారు. పంటల నష్టాలపై సర్వే చేయించి, పరిహారం ఇచ్చి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వానకాలం పంటల సాగు మొదటి దశలోనే వర్షాలు దెబ్బతీశాయని శనివారం విడుదల చేసిన ఒక ప్రటనలో తెలిపారు. దాదాపు 13 జిల్లాల్లో భారీ నష్టం ఏర్పడిందన్నారు. సోయాబీన్, పత్తి, మొక్కజొన్న దిగుబడులపై తీవ్రమైన ప్రభావం పడిందన్నారు. 35 వేల ఎకరాల్లో తెగుళ్లు, చీడపీడలతో పత్తి, మిర్చి, వరి, సోయాబీన్, కంది, మొక్కజొన్న పంటలు బాగా దెబ్బతిన్నాయన్నారు. జులై, ఆగస్టు నెలల్లో కురిసిన భారీ వర్షాలకు రాష్ట్రంలో దాదాపు 15 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని చెప్పారు. పత్తి విత్తనాలను రెండు మూడు సార్లు నాటుకోవాల్సి వచ్చిందన్నారు. వరి నార్లు కొట్టుకు పోయాయన్నారు. మండల స్థాయి వ్యవసాయ అధికారులు సేకరించిన సమాచారం ప్రకారం అప్పట్లో 3,750 కోట్ల మేర పంటల నష్టం జరిగినట్లు వ్యవసాయ నిపుణులు అంచనా వేశారన్నారు. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో పత్తి,మిర్చి పంటకు తెలియని వైరస్ ఏర్పడి ఎకరాల పంటను తొలగిస్తున్నారని చెప్పారు. కొందరు రైతులు తెగుళ్లు, చీడపీడల నుండి పంటలను కాపాడుకోవడానికి అనేక రకాల అవస్థలకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. చీడ పీడల ప్రభావంతో దిగుబడి 15-20 శాతం తగ్గుతుందనే ఆందోళనలో రైతాంగం ఉందన్నారు.
నష్టాలతో పెట్టుబడి రాని పరిస్థితులు…
ఆదిలాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, వికారాబాద్, నారాయణపేట, కొమ్రంభీం ఆసిఫాబాద్, సూర్యాపేట జిల్లాల్లో వేలాది ఎకారల్లో పంటలు నష్టపోయాయన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో కోతకు వచ్చిన సోయా పంటను మొత్తం వదిలివేయాల్సిన దుస్థితి నెలకొందన్నారు. వర్షాలతో చేలల్లో విపరీతంగా నీరు చేరడం, భారీ వర్షాల వల్ల పత్తిపంట, మహబూబ్‌నగర్ జిల్లాలో వేల ఎకరాల్లో వరి పంట నేలకొరిగిందన్నారు. 14,300 ఎకరాల్లో పత్తి, 200 ఎకరాల్లో మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయన్నారు. పంటల నష్టాన్ని అంచనా వేయడానికి సర్వే చేసి పరిహారం ఇవ్వాల్సిన పాలకులు తమకేమి పట్టనట్లుగా ఉండటం క్షమించరాని నేరమని విమర్శించారు. పంటల నష్టాలతో పెట్టుబడి కూడా తిరిగిరాని విషమ పరిస్థితుల్లో రైతులు కొట్టుమిట్టాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పంటల బీమా అమలు చేసే బాధ్యతల నుండి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైదొలగడంతోనే పంట నష్టాలను అంచనా వేయడానికి సర్వే నిర్వహించడం లేదన్నారు. రాష్ట్రస్థాయి పంటల బీమా పథకాన్ని ఏర్పాటు చేసి అమలు చేయడం ద్వారా నష్టపోయిన పంటలకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయాల వద్ద ధర్నాలు నిర్వహించి, వినతి పత్రాలు ఇవ్వడం జరిగిందన్నారు. అయినా స్పందన లేకపోవడం అత్యంత విచారణకరమన్నారు.
రైతులను ఆదుకోండి
RELATED ARTICLES