నేటి నుంచి ప్రక్రియ పునఃప్రారంభించాలని సిఎం కెసిఆర్ నిర్ణయం
సెప్టెంబర్ రెండో వారంలోగా పూర్తిచేయాలని ఆర్థిక శాఖకు ఆదేశం
మరో రూ.19వేల కోట్ల రుణాలు మాఫీచేయాల్సి ఉందని వెల్లడి
ప్రజాపక్షం/హైదరాబాద్ రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని గురువారం నుంచి పున: ప్రారంభించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఇప్పటికే అందించిన రుణమాఫీ పోగా, మరో రూ.19 వేల కోట్ల రుణమాఫీని రైతులకు అందించాల్సి ఉన్నదని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఆగస్టు 3 వ తేదీనుంచి పున: ప్రారంభించి, రైతుబంధు తరహాలో విడతల వారీగా కొనసాగిస్తూ నెల పదిహేనురోజుల్లో, సెప్టెంబర్ రెండో వారం వరకు, రైతు రుణ మాఫీ కార్యక్రమాన్ని సంపూర్ణంగా పూర్తిచేయాలని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావును కార్యదర్శి రామకృష్ణారావును సిఎం ఆదేశించారు. తెలంగాణ రైతాంగ సంక్షేమం వ్యవసాయాభివృద్ధే రాష్ర్ట ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పునరుద్ఘాటించారు. ఎన్ని కష్టాలు వచ్చినా రైతుల సంక్షేమం కోసం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు.కేంద్రం తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం వల్ల ఏర్పడిన మందగమనం, కరోనా వల్ల సంభవించిన ఆర్థిక సమస్యలు, ఎఫ్‌ఆర్‌బిఎం నిధులను విడుదల చేయకుండా కేంద్రం, తెలంగాణ పట్ల అనుసరించిన కక్షపూరిత చర్యలు… తదితర కారణాల వల్ల ఆర్థికలోటుతో ఇంత కాలం కొంత ఆలస్యమైందని సిఎం కెసిఆర్ తెలిపారు.తిరిగి రాష్ర్ట ఆర్థిక పరిస్థితి చక్కదిద్దుకున్ననేపథ్యంలో, రాష్ర్టంలో రైతు రుణ మాఫీ కార్యక్రమాన్ని పున: ప్రారంభించేందుకు తీసుకోవాల్సిన చర్యల పై ప్రగతి భవన్ లో బుధవారం నాడు సిఎం కెసిఆర్ ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు, సిఎం ముఖ్య సలహాదారు సోమేశ్ కుమార్, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకష్ణారావు, హెచ్‌ఎండిఎ ప్రిన్సిపల్ సెక్రటరీ అర్వింద్ కుమార్, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్ రావు లు పాల్గొన్నారు. సమావేశ వివరాలను ముఖ్యమంత్రి కార్యాలయం ఒక పత్రికా ప్రకటన ద్వారా విడుదల చేసింది.
సమావేశంలో సిఎం కెసిఆర్ మాట్లాడుతూ “ ఇచ్చిన మాట ప్రకారం, రైతు రుణమాఫీ కార్యక్రమం కొనసాగించినం. కరోనా వంటి అనుకోని ఉపద్రవాల వల్ల., కేంద్రం ప్రభుత్వం ఎఫ్‌ఆర్‌బిఎం నిధుల్లో ఏకపక్షంగా కోత విధించడం, తెలంగాణ కు విడుదల చేయాల్సిన నిధుల విషయంలో కక్షపూరితంగా వ్యవహరించడం వల్ల రైతు రుణమాఫీ కార్యక్రమంలో కొంతకాలం పాటు జాప్యం జరిగింది. రైతులకు అందిచాల్సిన రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్ సాగునీరు వంటి పథకాలను రాష్ర్ట ప్రభుత్వం చిత్తశుద్ది తో నిరాఘటంగా కొనసాగిస్తూనే వస్తున్నది. ఇప్పటికే చెప్పినట్టు ఎన్ని కష్టాలు నష్టాలు వచ్చినా ఆరునూరయినా రైతుల సంక్షేమాన్ని వ్యవసాయాభివృద్ధి కార్యాచరణను విస్మరించే ప్రసక్తేలేదు. పైగా వ్యవసాయాభివృద్ధి కోసం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఏర్పాటు వంటి ఆదర్శవంతమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నాం. తద్వారా రైతు సాధికారత సాధించే వరకు వారిని ఆర్థికంగా ఉన్నతంగా తీర్చిదిద్దే వరకు విశ్రమించే ప్రసక్తేలేదు” అని స్పష్టం చేశారు.
ఆర్థిక ఇబ్బందుల వల్లే ఆలస్యం : మంత్రి సింగిరెడ్డి
ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలోనే రుణమాపీ ఆలస్యమైందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. కేంద్రం ఎఫ్‌ఆర్‌బిఎం నిధులను విడుదల చేయకుండా తెలంగాణ రాష్ట్రం పట్ల అనుసరించిన విధానం, నోట్ల రద్దుతో ఏర్పడిన మందగమనం మూలంగానే రుణమాఫి ఆలస్యమైందని మంత్రి నిరంజన్ రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నిరంతరాయంగా కొనసాగుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలకు ఆటంకం కలుగకూడదన్నదే ప్రభుత్వ లక్ష్యమని, అందుకే రుణమాఫీ ప్రక్రియ ఆలస్యమైందని చెప్పారు. కరోనా విపత్తులోకూడా రైతులకు ఇబ్బంది కలగకుండా రైతు బంధునిధులను రైతుల ఖాతాల్లో జమ చేసినట్టు వివరించారు. రుణమాఫీ విషయంలో రైతులను మభ్యపెట్టేందుకు విపక్షాలు ప్రయత్నించినా రైతులు వారి మాటలను విశ్వసించలేదన్నారు. రైతు రుణమాఫీ చేయాలని సిఎం కెసిఆర్ ఆదేశాలు జారీ చేయడం పట్ల నిరంజన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.
రైతులకు రుణాలు మాఫీ
RELATED ARTICLES