HomeNewsBreaking Newsరైతులకు ఉచితంగా 24 గంటలు విద్యుత్‌

రైతులకు ఉచితంగా 24 గంటలు విద్యుత్‌

గృహజ్యోతి కింద 200 యూనిట్లకు ఏర్పాట్లు
త్వరలో కొత్త విద్యుత్‌ పాలసీ
అన్ని రకాల విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలపై సమగ్ర అధ్యయనం
విద్యుత్‌ శాఖపై సిఎం రేవంత్‌రెడ్డి సమీక్ష
ప్రజాపక్షం/ హైదరాబాద్‌  రాష్ర్ట ఆవిర్భావం తర్వాత 2014 నుంచి ఇప్పటి వరకు విద్యుదుత్పత్‌ కంపెనీలతో రాష్ర్ట విద్యుత్‌ పంపిణీ సంస్థ(డిస్కం)లు కుదుర్చుకున్న అన్ని రకాల విద్యుత్‌ కొనుగోలు ఒప్పందా (పిపిఎ)లపై సమగ్ర అధ్యయనం జరిపి నివేదిక సమర్పించాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌ రెడ్డి ఆదేశించారు. ఈ ఒప్పందాల్లోని నిబంధనలు, రాష్ర్ట విద్యుత్‌ నియంత్రణ మండలి(ఇఆర్సీ) నుంచి పొందిన అనుమతులు, ఒప్పందాల ద్వారా కొనుగోలు చేస్తున్న విద్యుత్‌ ధరలు వంటి అంశాలు నివేదికలో ఉండాలని అన్నారు. అధిక ధరతో విద్యుత్‌ కొనుగోలు చేసేందుకు జరిగిన ఒప్పందాలకు కారణాలను సైతం వివరించాలని కోరారు. ఇకపై బహిరంగ మార్కెట్లో ఎవరు తక్కువ ధరకు విద్యుత్‌ విక్రయిస్తున్నారో వారి వద్ద నుంచే విద్యుత్‌ కొనుగోలు చేయాలని స్పష్టం చేశారు. రాష్ర్ట విద్యుత్‌ శాఖపై బుధవా రం ఆయన సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు ఎన్‌.ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, డి.శ్రీధర్‌ బాబు ఈ సమీక్షలో పాల్గొన్నారు. రాష్ర్టంలో 24 గంటల నిరంతర విద్యుత్‌ సరఫరా, భవిష్యత్తులో పెరిగే రాష్ర్ట విద్యుత్‌ అవసరాలను తీర్చడానికి వీలుగా కొత్త విద్యుత్‌ కేంద్రాల ఏర్పాటుకు ఉన్న అవకాశాలు, రాష్ర్ట విద్యుదుత్పత్తి సంస్థ(జెన్‌కో) ఉత్పత్తి సామర్థ్యం పెంపుదల, ఎన్నికల హామీ మేరకు గృహజ్యోతి పథకం కింద గహ వినియోగదారులకు ప్రతి నెలా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ సరఫరాకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమీక్షలో సుదీర్ఘంగా చర్చించారు. జెన్‌కో ఆధ్వర్యంలో జరుగుతున్న విద్యుదుత్పత్తి, ఇతర విద్యుదుత్పత్తి కంపెనీల నుంచి చేస్తున్న విద్యుత్‌ కొనుగోళ్లు, రాష్ర్టంలో విద్యుత్‌ డిమాండ్‌, సరఫరా పరిస్థితులు, డిస్కంల ఆర్థిక పరిస్థితి, పనితీరును అధికారులు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి నివేదించారు.
రాష్ట్రానికి కొత్త విద్యుత్‌ విధానం..
రాష్ట్రానికి సమగ్ర విద్యుత్‌ విధానం లేక ఎన్నో రకాల సమస్యలు ఉత్పన్నమయ్యాయని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు. వివిధ రాష్ట్రాల విద్యుత్‌ విధానాలను సమగ్రంగా అధ్యయనం చేసి, శాసనసభలో అన్ని రాజకీయ పక్షాలతో విస్తృతంగా చర్చించిన తర్వాత సమగ్ర విద్యుత్‌ విధానాన్ని రూపొందిస్తామని ప్రకటించారు. విద్యుత్‌ రంగ నిపుణులతో సైతం విస్తతంగా సంప్రదింపులు నిర్వహిస్తామన్నారు. ఇతర అన్ని రాష్ట్రాల కంటే మెరుగైన విద్యుత్‌ విధానం రూపకల్పన చేస్తామన్నారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం రాష్ర్టంలో రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్‌ ఇచ్చి తీరాలని స్పష్టం చేశారు. ఆరు గ్యారంటీలలో ఒకటైన గహజ్యోతి పథకం ద్వారా ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సిఎం రేవంత్‌ రెడ్డి ఆదేశించారు. రాష్ర్టంలో ప్రభుత్వ రంగ కొత్త విద్యుత్‌ కేంద్రాల ఏర్పాటుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని, నిర్మాణంలోని విద్యుత్‌ కేంద్రాలను సత్వరంగా పూర్తి చేయాలని ఆదేశించారు. విద్యుత్‌ దుర్వినియోగాన్ని అరికట్టాలని, నాణ్యతను పెంచాలని సూచించారు. విద్యుత్‌ నిరంతర సరఫరాలో ఎలాంటి అవాంతరాలు రాకుండా ముందస్తుగా పటిష్ట చర్యలను చేపట్టాలని ఆదేశించారు

 

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments