సంయుక్త కిసాన్‌మోర్చా ప్రకటన
ప్రజాపక్షం/హైదరాబాద్ కనీస మద్దతు ధరల చట్టం చేయాలని, విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించాలని, రైతుల రుణాలన్నీ ఏకకాలంలో మాఫీ చేయాలని, రైతులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని, రైతులకు అనుకూలంగా ఫసల్ బీమా పథకాన్ని సవరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా దశల వారీగా ఆందోళనలు నిర్వహిస్తామని సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్‌కెఎం)
రాష్ట్ర నాయకులు వెల్లడించారు. హైదరాబాద్, విద్యానగర్‌లోని మార్క్ భవన్‌లో ఆదివారం మీడియా సమావేశంలో సంయుక్త కిసాన్ మోర్చా రాష్ట్ర కన్వీనర్‌లు పశ్యపద్మ,టి సాగర్, వి.ప్రభాకర్,మండల వెంకన్న, మామిడాల బిక్షపతి, జక్కుల వెంకటయ్య,బి.ప్రసాద్ మాట్లాడుతూ ప్రధాని మోడీ రైతాంగానికి లిఖితపూర్వకంగా ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు ఉద్యమిస్తామని, రాబోయే 2024 ఎన్నికల్లో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు పూనుకుంటామని హెచ్చరించారు. ఎస్‌కెఎంను మరింత బలోపేతం చేసి,రైతాంగ సమస్యలపై పోరాటం చేస్తామని,కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడిపెంచి,రైతాంగ సమస్యలను పరిష్కరించేలా పోరాటం చేస్తామన్నారు.రాష్ట్రంలో అర్హులైన పోడు రైతులందరికీ పట్టాలు ఇవ్వాలని,కౌలు రైతులను గుర్తించి, వారికి రుణార్హత కార్డులను అందేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రధాని మోడి రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదని విమర్శించారు.రుణభారంతోనే రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని, అందుకే రుణ విమోచన చట్టాన్ని ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు.ధరణిని సవరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎస్ కె ఎం సదస్సులో రైతు, వ్యవసాయ, స్వచ్చంద సంస్థలు కూడా భాగస్వాములు కావాలన్నారు.రైతాంగ డిమాండ్ల సాధనకు ఐక్యంగా పోరాటం చేస్తామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.దేశ వ్యాప్తంగా ఎస్ కె ఎం ను విస్తరిస్తున్నామని, ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా తదితర రాష్ట్రాల్లో కమిటీల నిర్మాణం చేపడుతున్నామన్నారు. రైతు ఉద్యమ సందర్భంగా ప్రధాని మోడీ ఇచ్చిన హామీలన్నీ అమలయ్యే వరకు ఎస్ కె ఎం పెద్ద ఎత్తున పోరాడుతుందని తెలిపారు.
రైతులకిచ్చిన హామీల అమలుకుదశలవారీ ఉద్యమం
RELATED ARTICLES