HomeNewsTelangana‘రైతుబంధు’ అడిగితే చెప్పుతో కొడతారా?

‘రైతుబంధు’ అడిగితే చెప్పుతో కొడతారా?

మోసపోయి కాంగ్రెస్‌ను గెలిపించారు
ముఖ్యమంత్రి మాట్లాడే మాటలేనా? ఆలోచించాలి
మాకన్నా మంచిపేరు తెచ్చుకో.. పోటీపడేలా చూసుకో
420 హామీలన్నీ అమలు చేయాలి : మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్‌
ప్రజాపక్షం/కరీంనగర్‌ ప్రతినిధి ప్రజలు మోసపోయి కాంగ్రెస్‌ పార్టీని గెలిపించారని మాజీ ముఖ్యమంత్రి, బిఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌ అన్నారు. కరీంనగర్‌లోని ఎస్‌ఆర్‌ఆర్‌ గ్రౌండ్‌లో కదనభేరి సభలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఆశలు, ఆడియాశలై దిక్కుతోచని స్థితిలో కరీంనగర్‌ మట్టిని నుదిటిన పెట్టుకుని ఉద్యమానికి బయలుదేరానన్నారు. దిశదశ లేకుండా జలదృశ్యంతో సత్తాచాటామని, అప్పుడు ఎవరికీ విశ్వాసం లేదన్నారు. తెలంగాణ మాట అసెంబ్లీలో మాట్లాడొద్దని ఆంక్షలు విధించారని, నా పదవులన్నీ వాళ్ల మొఖాన విసిరి పడేశానన్నారు. ఇదే ఎస్‌ఆర్‌ఆర్‌ కళాశాల వేదికగా పోరాటం ప్రారంభించామని గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమం కోసం ఊపిరిలూదాలని ఆకాంక్షను ఆకాశానికి ఎత్తిన గడ్డ కరీంనగర్‌ అని పేర్కొన్నారు. ఇక్కడే కార్యచరణ చెప్పి ఉద్యమానికి బయలుదేరానన్నారు. నాటి ఎంపి పదవిని నేలకు కొట్టానని, రారా నా కొడకా మళ్లీ కరీంనగర్‌కు అని వస్తే కాంగ్రెస్‌ పార్టీ ఎన్ని గింగిరాలు కొట్టినా మెజార్టీతో గెలిపించి చైతన్యాన్ని చాటిన గడ్డ కరీంనగర్‌ అడ్డా అని కొనియాడారు. కొన్ని సందర్బాలలో అత్యాశకు, దురాశకు పోయి ప్రజలు మోసపోతారని, ఇటీవలేమోసపోయి కాంగ్రెస్‌ పార్టీని గెలిపించారన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఆరు చందమామలు పెడుతాం.. ఏడు సూర్యులు పెడుతామని మాట్లాడి 420 హామీలిచ్చినా ఏమయ్యిందని ప్రశ్నించారు. రైతుబంధు అడిగితే ఓమంత్రి చెప్పుతో కొడతమాంటున్నారని, రైతుల చెప్పులు బంధవస్తు ఉంటాయని, వాళ్లు కొడితే మీ గతి ఏంటని ప్రశ్నించారు. ఆరుగ్యారంటీలపై అడిగితే ఓ సన్యాసి పండవెట్టి తొక్కుతా.. పేగులు మెడల వేసుకుంటా.. చీరుతా, మానవబాంబునైతా..మట్టిబాండు నైతా అని ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడుతున్నాడన్నారు. ఇంత అసహనమా? తెలంగాణ ముఖ్యమంత్రి ఇలా మా ట్లాడవచ్చునా? అని ప్రశ్నించారు. పదేళ్లలో ముఖ్యమంత్రిగా ఇలా మాట్లాడానా? అని ప్రశ్నించారు. భయంకరమై పరిస్థితుల్లో తెలంగాణ ముఖ్యమంత్రిగా తనను గెలిపించారని, అభివృద్ది ఏంటో చూపించానన్నారు. మీకు అధికారం ఇచ్చినప్పుడు కాంగ్రెస్‌ పార్టీ మంచి పేరు తెచ్చుకోవాలని, మాతో పోటీ పడేలాగా చూసుకోవాలని హితవు పలికారున. అహోరాత్రులు కష్టపడి తెలంగాణ రాష్ట్రం దేశానికి తలమానికం కావాలనుకున్నామన్నారు. భగీరథ నీళ్ల పథకం నడిపే దమ్ము ఈ ప్రభుత్వానికి లేదా అని ప్రశ్నించారు. రైతులకు ఉచిత కరెంటు, రైతు బంధు లాంటి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశామన్నారు. ఎప్పుడూ రైతుబంధు ఆపలేదని, కరువచ్చినా రైతులగురించి ఆలోచించినా.. అప్పో సొప్పో చేసి ఇచ్చానన్నారు.
రైతుబంధు ఇయ్యకున్నా, కరెంటు ఇయ్యకున్నా, మోటార్లు కాలవెట్టినా కాంగ్రెస్‌ను నమ్మి మోసపోయారన్నారు. గులాబీ జెండాను ఎగురవేస్తేనే కాపలాదారుగా ఉంటామన్నారు. కరీంనగర్‌లో ఒక్క మెడికల్‌ కాలేజీ, నవోదయ పాఠశాల మంజూరు కాలేదని, అందుకు ఎంపి బండి సంజయ్‌ ఎలాంటి కృషి చేయలేదని, ఒక్క 5 రూపాయల పనిచేయలేదని మండిపడ్డారు. వినోద్‌కుమార్‌ హయాంలోనే ఎన్నో పోరాటాలు, అభివృద్ది సాధించారని, బండికి, వినోద్‌కు పోలిక ఉందా? అని ప్రశ్నించారు. పచ్చని పొలాలు, కరెంటు, రైతాంగం సంతోషంగా ఉన్న గత పదేళ్ల కాలంలో కాంగ్రెస్‌ వచ్చాక ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందని దుయ్యబట్టారు. కెసిఆర్‌ మీదనే ఏడుస్తున్నారని, మేడిగడ్డ బ్యారేజీ చిన్న కాంపోనెంట్‌ అని, దేశమే కొట్టుకుపోయినట్లు చెబుతున్నారన్నారు. రెండు మూడు రోజుల్లో టీవీలో కూర్చుంటున్న, కాళేశ్వరం ప్రాముఖ్యతను చెబుతున్నా.. మిడ్‌ మానేరు, ఎల్‌ఎండి నిండి ఉండేవి.. నా కళ్ల ముందే ఈ కరెంటు మాయం కావడం.. రైతు కళ్లలో నీళ్లు పెటుకోవడం, గొర్లను మేపడం, చూడలేకపోతున్నమని ఆవేదన వ్యక్తం చేశారు. మేడిగడ్డలో 300 పిల్లర్లలో మూడు పిల్లర్లు మాత్రమే డ్యామేజీ అయ్యాయని, వాటికి మరమ్మత్తు చేయకుండా కాలయాపన చేస్తున్నారన్నారు. మార్చిలోనే ఈ పరిస్థితి ఉంటే మేలో ఏం జరగబోతుందో అర్దం చేసుకోవాలన్నారు. బిఆర్‌ఎస్‌ తెలంగాణ దళమని, తెలంగాణ గళమని, బలంగా ఉండాలని సూచించారు. ఓటు తమాషాకు వేయొద్దని కోరారు. తీర్థం పోదాం తిమ్మక్క అంటే వాడు గుడిలో.. మనం చలిలో.. డబ్బులు గుంజుతున్నరు.. ఢిల్లీకి సూటుకేసులు పంపుతున్నరు.. 3 నెలల్లో 9 సార్లు ఢిల్లీకి పోయారు.. మళ్లీ తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీ పెద్దల దగ్గర తాకట్టు పెట్టి తెలంగాణ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారన్నారు. కులం, మతం లేకుండా అన్ని స్కీములు తెచ్చిన, కరీంనగర్‌ లక్ష్మి గడ్డ, కాంగ్రెస్‌ గవర్నమెంట్‌లో భయపడాల్సిన అవసరం లేదన్నారు. బిఆర్‌ఎస్‌ కార్యకర్తలపై పోలీసులు వేధించడం సరికాదన్నారు. పోలీసులకు రాజకీయం ఎందుకని ప్రశ్నించారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని పేర్కొన్నారు. ఎలాంటి దౌర్జన్యాలు చేయలేదని, తాము అలా చేస్తే కాంగ్రెసోడు ఒక్కడయినా రాష్ట్రంలో మిగులునా? ప్రశ్నించారు. కరీంనగర్‌ గడ్డపై గులాబీ జెండా ఎగరాల్సిందేన్నారు. మాజీ ఎంపి వినోద్‌ కుమార్‌, ఎమ్మెల్యే వినోద్‌ కుమార్‌ , బిఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు జివి రామకృష్ణారావు, హుజురాబాద్‌ ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు సుంకె రవిశంకర్‌, రసమయి బాలకిషన్‌ తదితరులున్నారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments