అకాల వర్షాలు- అతివృష్టి- అనావృష్టి
ఏటా ఇదే తంతు
చేతికందే దశలో నేలపాలవుతున్న పంట
ప్రజాపక్షం/ ఖమ్మం మానవుడు శాస్త్ర సాంకేతిక రంగాలలో ఎంతగా పురోగమించినా ప్రకృతి సహకరించని పక్షంలో ఏ పనిలోనూ ముందుకు సాగలేమన్నది జగమెరిగిన సత్యం. వ్యవసాయ రంగానికి పాలకుల నిర్లక్ష్యం, గిట్టుబాటు కాని ధరలు, కట్టడి చేయలేని తెగుళ్లు, అన్నింటికి మించి ప్రకృతి విపత్తులు శాపంగా మారాయి. మొత్తంగా ఏ పంటైనా విక్రయించి డబ్బు చేతికి వచ్చే వరకు నమ్మకం లేని పరిస్థితి నెలకొంది. అతివృష్టి, అనావృష్టి, అకాల వర్షాలు, ప్రకృతి పరంగా సంభవించే వైరస్‌లు వ్యవసాయ ఉత్పత్తులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ఇది ఒక ఏడాదికో, రెండేళ్లకో పరిమితం కాలేదు. ప్రతి యేటా ఏదో ఒక రూపంలో ప్రకృతి దెబ్బతీస్తూనే ఉంది. ఈ ఏడాది జూన్ మాసం నుంచి సెప్టెంబరు మాసం వరకు ఎడ తెరిపి లేని వర్షాలు మెట్ట పంటలను దెబ్బతీశాయి. పత్తి, మిర్చి, అపరాలు సహా మెట్ట పంటలు దెబ్బ తిన్నాయి. వరి ఒక్కటి కాస్త ఫర్వాలేదనిపించినా మిగతా పంటలు రైతులకు నష్టాలనే మిగిల్చాయి. ప్రాజెక్టులలో
సమృద్దిగా నీరు ఉండడం, భూగర్బ జలాలు సైతం అందుబాటులో ఉండడంతో యాసంగిలో మొక్కజొన్న, వరి పంటలను సాగు చేశారు. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలు మొక్కజొన్న రైతులను మరో రెండేళ్ల పాటు కోలుకోలేనివిధంగా దెబ్బతీశాయి. ఎకరాకు రూ. 30 వేల నుంచి రూ. 40 వేల వరకు పెట్టుబడులు పెట్టిన తర్వాత తలవేను వేసి కంకి వేస్తున్న దశలో ఈదురు గాలులతో కూడిన వర్షం రావడంతో పంట మొత్తం నేలవాలింది. చాప చుట్టినట్లు చుట్టడంతో పంట కనీస దిగుబడి కూడా రాదని రైతులు ఆందోళన చెందుతున్నారు. మొక్కజొన్న కింద పడిన తర్వాత విత్తు పోసుకున్న సందర్భాలు చాలా తక్కువని ఇప్పటికే విత్తు పోసుకుంటే సగం దిగుబడి వచ్చే అవకాశం ఉంది కానీ పాల ఉబ్బల దశలో ఉన్న మొక్కజొన్న దిగుబడి రాదని రైతులు తెలియజేస్తున్నారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 80 వేల పై చిలుకు ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేయగా మూడొంతుల మంది మొక్కజొన్న రైతుల పరిస్థితిని దయనీయంగా మార్చివేశాయి అకాల వర్షాలు. ఇక ఉద్యానవన పంటలు దెబ్బతిన్నాయి. బలమైన ఈదురు గాలులకు మామిడి నేలరాలింది. రెండేళ్లుగా మామిడి రైతులు కోలుకోలేనివిధంగా దెబ్బతింటున్నారు. గతేడాది కాపు తక్కువగా ఉండడం, మంగు వ్యాధి రావడంతో మామిడి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ ఏడాది పూత, కాత ఫర్వాలేదనుకుంటే అకాల వర్షాలు, ఈదురు గాలులు మామిడి రైతులను దెబ్బతీశాయి. ఇక బొప్పాయి, ఇతర ఉద్యాన పంటలను సాగుచేసిన రైతులు సైతం ఈ అకాల వర్షాలకు తీవ్రంగా నష్టపోయారు. ఇక మిర్చి రైతులు ధర ఉంది ఈ ఏడాది లాభాలు వస్తాయని ఆశించిన తరుణంలో వారి ఆనందంపై ప్రకృతి నీళ్లు చల్లింది. ఇప్పుడు మిర్చిని కోసిన, కోయకున్నా రంగు మారుతుందని కోనే వారు కూడా ఉండరని మిర్చి రైతులు ఆందోళన చెందుతున్నారు. మొత్తంగా ప్రకృతి తన ప్రకోపాన్ని ఏదో ఒక రూపంలో రైతన్నపై చూపిస్తూనే ఉంది. అసలే పంట పండదు, పండిన పంటకు గిట్టుబాటు ధర దక్కకపోవడంతో ఇబ్బందులు పడుతున్న రైతులకు ప్రకృతి విపత్తులకు గతంలో పరిహారం అందించి ప్రభుత్వాలు కాస్తో కూస్తో ఉపశమనం కలిగించేవి. కానీ ఇప్పుడు పాలకులు పరిహారం అనే పదాన్నే మరచిపోయారు. అంచనాలను రూపొందించడం తప్ప పరిహారం అందించిన దాఖలాలు లేవు. ఈ సారైనా పంట నష్టాన్ని అంచనా వేసి నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని కోరుతున్నారు.
రైతుపై ప్రకృతి కన్నెర్ర
RELATED ARTICLES