వాటిని రద్దు చేయాలన్నదే ఏకైక డిమాండ్
కొనసాగుతున్న అన్నదాతల ఆందోళన
కేంద్రంతో చర్చలపై నేడు రైతుల నిర్ణయం
భారత్‌కు బోరిస్ రావద్దంటూ లేఖ రాయనున్న రైతులు
న్యూఢిల్లీ : కేంద్రం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలను తక్షణమే రద్దు చేయాలని ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న నిరసనలు మంగళవారంనాటికి 27వ రోజుకు చేరుకున్నాయి. ఢిల్లీలో ఉష్ణోగ్రతలు తీవ్ర స్థాయిలో పడిపోయినప్పటికీ.. అన్నదాతలు తమ ఆందోళన కొనసాగిస్తున్నారు. మంటను ఏర్పాటు చేసుకొని చలి కాచుకుంటున్నారు. ముఖ్యంగా సింఘు సరిహద్దు వద్ద రైతులు ఏ మాత్రం సంకల్పం వీడకుండా స్ఫూర్తిదాయకమైన నిరసనలు తెలియజేస్తున్నారు. రైతుల పట్ల కఠిన వైఖరి అవలంబించడంతోపాటు చట్టాలు గొప్పవంటూ రైతులను తప్పుదారి పట్టించే విధంగా ప్రసంగాలు చేస్తున్న ప్రధానమంత్రి మోడీపై రైతులు విరుచుకుపడ్డారు. రైతు గోస పట్ల కేంద్రం సానుకూలంగా స్పందించే వరకు పోరాడుతామని వారు ప్రకటించారు. మరోవైపు, చర్చలకు కేంద్ర ప్రభుత్వం ఇంకోసారి ఆహ్వానించింది. దీనిపై నిర్ణయాన్ని రైతు సంఘాలు బుధవారం నాటికి వాయిదా వేశాయి. చర్చలపై బుధవారం మధ్యాహ్నం రైతు సంఘాల కీలక భేటీ కానున్నాయి. “సాగు చట్టాలపై చర్చించేందుకు రావాలని కేంద్రం రాసిన లేఖపై రైతు సంఘాలన్నీ సానుకూలంగా స్పందించాయి. ఈ విషయంపై నిర్ణయం తీసుకునేందుకు బుధవారం అన్ని రైతు సంఘాలు భేటీ అవుతాయి” అని రైతు సంఘం నాయకుడు కుల్వంత్ సింగ్ సంధు తెలిపారు. నూతన వ్యవసాయ చట్టాలపై మరో దఫా చర్చలకు రావాలని కేంద్రం రాసిన లేఖపై బుధవారం(డిసెంబర్23) నిర్ణయం తీసుకుంటామని సంధు తెలిపారు. తదుపరి కార్యాచరణపై పంజాబ్‌కు చెందిన 32 రైతు సంఘాలతో సమావేశం నిర్వహించినట్లు వెల్లడించారు. అయితే కొత్త వ్యవసాయ చట్టాల రద్దే తాము కోరుతున్నట్లు ఆయన మరో మారు స్పష్టం చేశారు. జనవరి 26 గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా రానున్న బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ భారత్‌కు రాకుండా చూడాలని ఆ దేశ ఎంపీలకు లేఖ రాయనున్నట్లు ఆయన తెలిపారు. సింఘు సరిహద్దు వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ, కేంద్రం మొత్తం 40 యూనియన్లను ఉద్దేశించి ఒక లేఖ రాసిందని, కేంద్ర వ్యవసాయ శాఖ సంయుక్త కార్యదర్శి వివేక్ అగర్వాల్ పేరుమీద ఈ లేఖ అందిందని చెప్పారు. చట్టాల్లో సవరణలు వంటి ప్రతిపాదనలు సైతం తమకు ఇష్టం లేదని, చట్టాల రద్దు ఒక్కటే తమ అంతిమ డిమాండ్ అని స్పష్టం చేశారు. డిసెంబరు 9వ తేదీన ఆరోరౌండు చర్చలు రద్దయిన తర్వాత ప్రతిష్టంభన ఇంకా కొనసాగుతూనే వుంది. ఇదిలావుండగా, రైతులతో సమస్యను పరిష్కరించుకునేందుకు మరోమారు చర్చలకు కేంద్రం సిద్ధంగా వుందని వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ మంగళవారంనాడు ప్రకటించారు. త్వరలోనే అంతర్గత సంప్రదింపులను ముగించి, రైతులతో చర్చలకు వెళ్తామని తెలిపారు. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌లకు చెందిన రెండు రైతుసంఘాలతో చర్చలు జరిపామని, వారు తమ చట్టాలకు మద్దతు తెలిపారని పేర్కొన్నారు. ఆ సంఘాల పేర్లు కెఎస్‌ఎస్, ఐకెయులుగా ప్రకటించారు. అసలీ సంఘాలు ఎక్కడివని ప్రస్తుతం సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులు ప్రశ్నిస్తున్నారు. దాదాపు 40 రైతు సంఘాలు ఈ చట్టాలను వ్యతిరేకిస్తున్నాయని, దేశవ్యాప్తంగా రైతులు, ప్రజలు మోడీ విధానాలను తూర్పారబడుతున్నారని, అయినా బుద్ధిలేక కేంద్ర మంత్రి ఏదేదో మాట్లాడుతున్నారని రైతులు విమర్శించారు. ఇదిలావుండగా, రైతులకు హర్యానా, పంజాబ్‌లకు చెందిన కవులు, రచయితలు, గాయకులు, సంగీతకళాకారులు తమ మద్దతును ప్రకటించారు. రైతులకు సంఘీభావంగా హర్యానాకు చెందిన సంగీత కళాకారులు టిక్రీ సరిహద్దుల్లో పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ రైతులను ఉత్సాహపరుస్తూ, వారి ఉద్యమాన్ని మరింత రగిలిస్తున్నారు. ‘గధ్వా’, ‘పట్టా’ వంటి స్థానిక వాయిద్యాలతో శబ్ధాలు చేస్తూ, వాయిస్తూ ఆహ్లాదపరుస్తున్నారు. జాట్ మెహర్‌సింగ్, రామ్‌దియా కోట్, పర్దీప్ దలాల్, మహేంద్ర పండిట్, జోగీందర్ కౌశిక్, అమిత్, దలాల్‌ఖాప్ వంటి కళాకారులెందరో ప్రతి రోజూ టిక్రీ సరిహద్దులో రైతులను ఉత్తేజపరుస్తూ పాటలు, డ్యాన్సులతో అలరిస్తున్నారు.