HomeNewsBreaking Newsరైతుకో పోలీస్‌ …

రైతుకో పోలీస్‌ …

నిర్బంధం మధ్య భూ సర్వే
కొదుమూరు గ్రామాన్ని ముట్టడించి బ్యారికేడ్లు ఏర్పాటు
నాగపూర్‌ – అమరావతి హైవే భూ సేకరణలో ఉద్రిక్తత
ఇండ్లలోనే రైతులను నిర్బంధించిన పోలీసులు

ప్రజాపక్షం/ ఖమ్మం ఖమ్మంజిల్లా రైతుల జీవితాలను జాతీయ రహదారుల నిర్మాణం అస్తవ్యస్తం చేస్తుంది. భూముల విలువలకు తగిన పరిహారం ఇవ్వడంలో ఘోరంగా విఫలం కావడమే కాకుండా రైతులను నిర్బంధించి భూ సర్వే చేయాల్సిన పరిస్థితికి తీసుకు వచ్చింది. ఇప్పటికే సూర్యాపేట, దేవరపల్లి హైవే నిర్మాణంలో భూములు కోల్పోగా ఇప్పుడు అమరావతి, నాగపూర్‌ హైవే నిర్మాణంలో భూములు కోల్పోతున్నారు. ఖమ్మం నగరానికి అత్యంత దగ్గరగా హైవేలు వెళ్తుండడం ఇక్కడ వ్యవసాయ భూములు సైతం కోట్లలో ధర పలుకుతుండడంతో రైతులు కారుచౌకగా భూములు ఇచ్చేందుకు ససేమీరా అంటున్నారు. ప్రస్తుతం మార్కెట్‌ ధర ఎకరం మూడు నుంచి నాలుగు కోట్లు పలుకుతుండగా ప్రభుత్వం మాత్రం ఎకరానికి కేవలం రూ.19 లక్షల పరిహారం ఇస్తామని చెబుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో కొదుమూరు, వందనం తదితర గ్రామాల్లో భూ సర్వేను అడ్డుకుంటున్నారు. రెండు, మూడు రోజులుగా అటు రైతులకు, ఇటు అధికారులకు మధ్య సర్వే విషయంలో వాదోపవాదాలు జరుగుతున్నాయి. ఆదివారం కలెక్టర్‌ కార్యాలయంలో రెవెన్యూ, పోలీస్‌ అధికారులు రైతులు, రైతు సంఘాల నాయకులతో చర్చించారు. దానికి సంబంధించి ఎటువంటి నిర్ణయాన్ని వెల్లడించకుండానే మంగళవారం ఒక యుద్ధ వాతావరణాన్ని తలపించే రీతిలో పోలీసులు ఏకంగా చింతకాని మండలం కొదుమూరు గ్రామాన్ని చుట్టు ముట్టారు. తెల్లవారుజామున నాలుగున్నర గంటలకే గ్రామానికి వందలాది మంది పోలీసులు చేరుకున్నారు. ఇండ్లలో నుంచి రైతులు బయటకు రాకుండా ఇంటికో పోలీసు ఉండి అడ్డుకున్నారు. గ్రామంలో నుంచి బయటకు వచ్చే రహదారులకు బారీకేడ్లు ఏర్పాటు చేసి రాకపోకలను అడ్డుకున్నారు. గ్రామంలోకి ఎవరిని అనుమతించ లేదు. భారీ బందోబస్తు నడుమ నాగపూర్‌ – అమరావతి హైవే సర్వే నిర్వహించారు.
విలువైన భూములు – పట్టించుకోని ప్రభుత్వం :
హైవే నిర్మాణంలో భూములు కోల్పోతున్న కొదుమూరు, వందనం, పెద్దగోపతి తదితర గ్రామాల్లో భూములు చాలా విలువైనవి. ఖమ్మం నగరానికి 20 కిలో మీటర్ల దూరంలో ఉండడంతో 15 ఏళ్లుగా ఈ ప్రాంతంలో భూముల ధరలకు రెక్కలొచ్చాయని చెప్పవచ్చు. ఇంత ఖరీదైన భూములను రూ. 19 లక్షలకు ఇచ్చేందుకు రైతులు ససేమీరా అంటున్నారు. దాదాపు 20 మంది రైతులు ఈ హైవే నిర్మాణం ద్వారా పూర్తిగా భూమిని కోల్పోతున్నారు. ఇదిలా ఉండగా ఆడపిల్లలకు ఈ భూమిని చూపించి కోట్ల విలువలు లెక్కలేసి పెళ్లిళ్లు చేశామని ఇప్పుడు రూ. 19 లక్షలకు భూమిని కోల్పోతే మేము ఏమి సమాధానం చెప్పాలని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది భవిష్యత్తులో తీవ్ర పరిణామాలకు దారి తీస్తుందని రైతులు అంటున్నారు.
రైతు సంఘాల నేతలను అడ్డుకున్న పోలీసులు :
కొదుమూరు గ్రామంలో జరుగుతున్న బలవంతపు సర్వేను పరిశీలించడంతో పాటు రైతుల పక్షాన నిలిచేందుకు గ్రామానికి వెళ్లే ప్రయత్నం చేసినా పోలీసులు వెళ్లకుండా అడ్డుకున్నారు. తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షులు బాగం హేమంతరావు , సిపిఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్‌, రైతు సంఘం జిల్లా కార్యదర్శి కొండపర్తి గోవిందరావు, సిపిఎం అనుబంధ రైతు సంఘం నాయకులు బొంతు రాంబాబు, హైవే నిర్మాణ రైతు బాధిత సంఘం నాయకులు తక్కెళ్లపాటి భద్రయ్య, వేములపల్లి సుధీర్‌ తదితరులను సైతం అడ్డుకున్నారు. ఆయా గ్రామాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments