HomeNewsBreaking Newsరైతుకుభరోసా ఊసేది!

రైతుకుభరోసా ఊసేది!

విమర్శలతోనే సరిపెట్టిన అమిత్‌ షా
‘బిజెపి గోస’గా మారిన ‘రైతు భరోసా సభ’
ప్రజాపక్షం/ ఖమ్మం
ఖమ్మంలో ‘రైతు గోస బిజెపి భరోసా’ పేరిట ఆదివారం బిజెపి సభను నిర్వహించింది. ఖమ్మం సభ నుంచే రైతు డిక్లరేషన్‌ అంటూ వారం రోజులుగా కాషాయపార్టీ నేతలు ఊదరగొట్టారు. చాలా మంది రైతాంగం రైతు సంఘాలు తెలంగాణ రైతాంగానికి సంబంధించి బిజెపి పార్టీ ఎటువంటి హామీలను ఇవ్వబోతుంది, ఆపార్టీ ఇచ్చే భరోసా ఏమిటన్న దానిపై ఆలోచన చేశా రు. కానీ చివరకు అమిత్‌షా ఉపన్యాసం కొండం త రాగం తీసి పిచ్చగుంట పాట పాడిందన్న సామెతను గుర్తుకు తెచ్చింది. భారత్‌ మాతాకి జై నినాదాలతో సభను హోరెత్తించారు తప్ప… ఒక్క రైతు నినాదాన్ని షా అందుకోలేదంటే అతిశయోక్తి కాదు. కనీసం బిఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో రైతులుపడుతున్న ఇబ్బందులను కూడా అమిత్‌షా ఎక్కడా వివరించ లేదు. రైతులకు సంబంధించి బిజెపి ప్రభుత్వం గతంలో ఖర్చు చేసింది, ధాన్యం కొనగోళ్లు, కిసాన్‌ సమృద్ధియోజనకు సంబంధించి లెక్కలు అప్పగించారు తప్ప… తాము అధికారంలోకి వస్తే రైతులకు ఏమి చేస్తామన్నది వివరించ లేదు. బిజెపి నేతలంతా వారం రోజులుగా ఖమ్మం సభలో అమిత్‌షా రైతు డిక్లరేషన్‌ను ప్రకటిస్తారని ప్రజలను నమ్మిస్తూ వచ్చారు. కానీ రైతులకు సంబంధించిన ఎటువంటి డిక్లరేషన్‌ను అమిత్‌షా ప్రకటించక పోగా కనీసం రాష్ట్ర నాయకులైన బిజెపి అధికారంలోకి వస్తే రైతులకు ఏమి చేస్తామో వివరించ లేదు. ఒక్క ఈటల రాజేందర్‌ మాత్రమే వ్యవసాయ పనిముట్లకు సబ్సిడీ ట్రాక్టర్లను, డ్రిప్‌ ఇరిగేషన్‌కు ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు తప్ప ఏ బిజెపి నాయకుడు రైతుల గురించి మాట్లాడలేదు. బిజెపి, బిఆర్‌ఎస్‌ ఒకటి కాదు అని చెప్పేందుకు అమిత్‌షా తాపత్రయ పడ్డారు. తమకు, బిఆర్‌ఎస్‌ మధ్య ఓవైసి ఉంటే మా కలయిక ఎలా సాధ్యమని ఆయన ప్రశ్నించారు. బిజెపి, బిఆర్‌ఎస్‌ ఒక్కటేనని కాంగ్రెస్‌ చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని, అది అబద్ధమని చెప్పేందుకు అమిత్‌షా అధిక ప్రాధాన్యతనిచ్చారు. ఈ రాష్ట్రంలో అత్యధిక శాతంలో ఉన్న కౌలు రైతులకు బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏమి చేస్తుందో ఎక్కడ పేర్కొన లేదు. ఇప్పుడున్నటువంటి రైతాంగ విధానాలను మార్చి అదనంగా రైతులకు ఎటువంటి ఆర్థిక, సహకారం అందించేందుకు బిజెపి సిద్ధమైందో ఆయన తెలపలేదు. వ్యవసాయ రంగ సబ్సిడీలను దేశ వ్యాప్తంగా క్రమేపీ తగ్గిస్తూ చివరకు ఎత్తివేసే స్థితికి వచ్చిన బిజెపి ఇప్పుడు వాటిని కొనసాగించేందుకు మనస్సు మార్చుకున్నదా లేదా అన్న విషయం కూడా ఎక్కడ ప్రస్తావించ లేదు. ఇక విద్యుత్‌ సంస్కరణలు, నూతన సాగు చట్టాలకు సంబంధించి కనీస ప్రకటన చేసిన దాఖలాలు లేవు. నూతన వ్యవసాయ చట్టాలు, విద్యత్‌ సంస్కరణల వల్ల ఇబ్బంది కలుగుతుందని రైతులు చెప్పడం వల్లనే కనీసం సాగు చట్టాలను నిలుపుదల చేశామని కూడా అమిత్‌షా ప్రజలకు హామీ ఇవ్వలేదు. ఇది కేవలం రైతు గోసలా కాకుండా ఖమ్మం సభ బిజెపి గోసలా మారింది. దేవుళ్లను పదే పదే ప్రస్తావించడం, మోడీ భజన చేయడం మినహా అమిత్‌షా ఉపన్యాసంలో ఎక్కడ రైతు భరోసా కనిపించ లేదు. ఈ దఫా అమిత్‌షా ఉపన్యాసంలో మరో పెద్ద మార్పు ఏమిటంటే కెసిఆర్‌ ప్రభుత్వ అవినీతిని ఎక్కడా ప్రస్తావించ లేదు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రాజెక్టులకు సంబంధించి అవినీతి జరిగిందన్నారు తప్ప ఎక్కడ ఏ రకమైన అవినీతి జరిగిందో మాట మాత్రంగానైనా ప్రస్తావించ లేదు. అసలు ఖమ్మంలో రైతు భరోసా పేరిట సభ ఎందుకు నిర్వహించారో బిజెపి నేతలకే అర్థం కానీ పరిస్థితి. మొత్తంగా బిజెపి రైతు గోస బిజెపి భరోసా సభ భరోసా లేని బిజెపి గోసగా సాగింది. బిజెపికి కనీస బలం లేని ఖమ్మం జిల్లాలో సభను ఏర్పాటు చేసి జనాన్ని తరలించేందుకు బిజెపి నేతలు నానా ఇబ్బందులు పడ్డారు. ఉమ్మడి నల్గొండ, వరంగల్‌ జిల్లాల నుంచి బస్సుల ద్వారా జనాన్ని తరలించి సభా స్థలాన్ని నింపేందుకు నానా ఆగచాట్లు పడ్డారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments