లండన్: బ్రిటన్ ప్రధాన మంత్రి బొరిస్ జాన్సన్ రాజీనామా సమర్పించడంతో, కన్జర్వేటివ్ పార్లమెంటరీ పార్టీ కొత్త నేత అనివార్యమైంది. ఈ రేసులోభారత సంతతికి చెందిన రిషి సునాక్ కూడా ఉన్నట్టు సమాచారం. జాన్సన్ రాజీనామాతో కొత్త ప్రధాని ఎంపిక కోసం ముందుగా కన్జర్వేటివ్ పార్టీ నాయకుడి ఎన్నిక జరగాల్సి ఉంది. ఇటీవల రాజీనామా చేసిన ఆర్థిక మంత్రి సునాక్‌తోపాటు సాజిద్ జావిద్ పేరు కూడా బలంగా వినిపిస్తున్నది. స్థానిక మీడియా కథనాల ప్రకారం 42 ఏళ్ల సునాక్‌ను కొత్త నేతగా ఎన్నుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అదే జరిగితే, అతను అక్టోబర్ మాసంలో బ్రిటన్ కొత్త ప్రధానిగా బాధ్యతలు స్వీకరిస్తారని మీడియా వర్గాలు వెల్లడించాయి. అంతేగాక, బిటన్ ప్రధానిగా బాధ్యతలు తీసుకునే తొలి భారత సంతతి వ్యక్తిగా చరిత్రలో నిలుస్తారు. కాగా, సునాగ్ పూర్వీకులు పంజాబ్ ప్రాంతానికి చెందిన వారు. ఆయన తాత, తల్లి ఇక్కడి వారే. కాలిఫోర్నియాలో చదువుతుండగా ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణ మూర్తి కుమార్తె అక్షతా మూర్తితో సునాక్‌కు పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత వివాహం చేసుకున్న ఈ జంటకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.