HomeNewsBreaking Newsరేషన్‌ బియ్యం రీసైక్లింగ్‌

రేషన్‌ బియ్యం రీసైక్లింగ్‌

ప్రజల నుంచి కొనుగోలు చేసి రైస్‌ మిల్లర్ల ద్వారా తిరిగి ఎఫ్‌సిఐకే అమ్మకం
రూ.6కు క్రయం రూ.32కు విక్రయం
లారీ లోడుకు రూ.9 లక్షలకు పైగా లాభం
దందాలో రేషన్‌ డీలర్ల ప్రమేయం
నిద్ర నటిస్తున్న పౌరసరఫరాల అధికారులు !
ప్రజాపక్షం/వరంగల్‌/సూర్యాపేట ప్రతినిధులు/ చొప్పదండి / పరకాల / గోదావరిఖని
రేషన్‌ బియ్యాన్ని లబ్ధిదారుల నుంచి సేకరించి అక్రమంగా ఇతర రాష్ట్రాలకు తరలించడం, సన్నగా చేసి అమ్ముకోవడం తదితర దందాలు ఇప్పటి వరకు జరు గుతున్నాయి. ఇదంతా తలనొప్పిగా మారడంతో ఈ వ్యాపారులు మరో కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా నిరుపేదలకు అందించే రేషన్‌ బియ్యాన్ని కొందరు రేషన్‌ బియ్యం వ్యాపారులు, మిల్లుల యజమానులు జనం నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసి రైస్‌ మిల్లర్ల ద్వారా ఎఫ్‌సిఐకి సరఫరా చేసే బియ్యంలో కలిపేసి తిరిగి ఎఫ్‌సిఐకే విక్రయించే కొత్త దందాకు తెరలేపారు. పేదలకు ప్రభుత్వం పంపిణీ చేస్తున్న బియ్యం పక్కదారి పడుతున్నాయి. రేషన్‌ డీలర్ల సహకారంతో, పౌరసరఫరాల శాఖ నిర్లక్ష్యంతో పేదల బియ్యంతో అక్రమార్కులు కోట్లు గడిస్తున్నారు. రాష్ట్రంలోని వరంగల్‌, హనుమకొండ, సూర్యాపేట, భూపాల్‌పల్లి, సిద్దిపేట, కరీంనగర్‌, పెద్దపల్లి తదితర జిల్లాల్లో, చొప్పదండి, పరకాల, గోదావరిఖని తదితర ప్రాంతాల్లో ఈ వ్యాపారం జోరుగా కొసానగుతున్నది. ఇలా ఒక లారీ లోడు ద్వారా రూ.9 లక్షలకు పైగా అక్రమార్జన చేస్తున్నారు. ఈ వ్యవహారంలో కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, రేషన్‌ డీలర్లు, పౌరసరఫరాల శాఖ అధికారుల ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. గతంలో రేషన్‌ బియ్యాన్ని కొనుగోలు చేసి సన్నగా చేసి అమ్మడం లేదా ఇతర ప్రాంతాలకు తరలించి ఎక్కువ ధరకు అమ్ముకునేవారు. ప్రజల నుంచి రేషన్‌ బియ్యాన్ని కిలో రూ.6లకు కొనుగోలు చేసి ఎఫ్‌సిఐకి అందించే బియ్యంలో ఈ రేషన్‌ బియ్యాన్ని కలిపి కిలో రూ.32లకు అమ్ముకుంటున్నారు. లారీలో దాదాపు 580 బస్తాలతో 290 క్వింటాళ్ల బియాన్ని విక్రయిస్తున్నారు. ఈ బియ్యాన్ని దాదాపు రూ.2.50 లక్షలతో కొనుగోలు చేసి ఎఫ్‌సిఐకి అమ్మితే రూ.9లక్షలకు పైగా లాభం పొందుతున్నారు. ఎఫ్‌సిఐ అధికారులకు అనుమానం రాకుండా ఒక్కో లారీకి 50 నుంచి -100 క్వింటాళ్ల వరకు రేషన్‌ బియ్యాన్ని కలిపి పంపిస్తున్నారని, వాటిని కూడా పూర్తిగా రీసైక్లింగ్‌ చేసి పాలిష్‌ అద్ది పంపించి సొమ్ము చేసుకుంటున్నారని విమర్శలు ఉన్నాయి. ఇదిలా ఉండగా, గోదావరిఖని పట్టణంతో పాటు చూట్టు పక్కల గ్రామాల నుండి సేకరించిన రేషన్‌ బియ్యాన్ని 7ఎల్‌ఈపి సమీపంలోని ఓ చోట డంప్‌గా ఏర్పాటు చెసుకుని రాత్రి వేళల్లో గుంజపడుగు, సుందిళ్ల, కాళేశ్వరం బ్యారేజ్‌ మీదుగా ఇతర రా్రష్ట్రాలకు తరలిస్తున్నట్లు సమాచారం.
దందాలో రేషన్‌ డీలర్ల ప్రమేయం
ఈ మొత్తం తతంగంలో రేషన్‌ డీలర్లు ప్రధాన పాత్ర పోషిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. చౌకడిపోలలో అందించే బియ్యం కోసం వెళ్లే ప్రజలలో ఎక్కువగా మూడుసార్లు బియ్యం తీసుకోకుంటే రేషన్‌ కార్డు రద్దవుతుందనే భయంతో కార్డును కాపాడుకోవడానికి మాత్రమే వెళ్తున్నారు. బియ్యం దొడ్డుగా ఉండడంతో ప్రస్తుతం పేదవారు సైతం తినడం లేదు. దీన్ని ఆసరాగా చేసుకుంటున్న రేషన్‌ డీలర్లు రేషన్‌ కార్డుదారుల నుంచే రూ.6కు కిలో బియ్యం కొనుగోలు మిల్లు యజమానులకు రూ.12వరకు అమ్ముకుంటున్నారు. కొందరు లబ్ధిదారులు బియ్యంను తీసుకోకుండానే డీలర్లకు విక్రయిస్తున్నారు. మండలాలలో పలు గ్రామాల్లోని మిల్లులతో పాటు పట్టణంలోని పలు మిల్లుల్లో రోజువారీగా బియ్యాన్ని రాత్రికి రాత్రి డంపు చేస్తున్నారు. తెచ్చిన బియ్యాన్ని రాత్రి వేళల్లోనే రీసైక్లింగ్‌ చేసి, మిల్లు పేరుపై ఉన్న బస్తాల్లో వేసి వారి లేబుల్‌తో స్టాక్‌ను చూపిస్తూ ఎఫ్‌సిఐకి పంపిస్తున్నారు. నెలలో మూడు నుంచి నాలుగు ట్రిప్పుల లారీలను పంపించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇలా ట్రిప్పుకు రూ.6లక్షల చొప్పున లాభం వస్తే ఒక నెలలో దాదాపు రూ.20లక్షల వరకు డబ్బులు మిగులుతున్నాయి.
సిఎంఆర్‌ పేరుతో ఎఫ్‌సిఐకి అప్పగింత
ప్రజాపంపిణీ బియ్యాన్ని కొనుగోలు చేసిన మిల్లర్లు ఆ బియ్యాన్ని యధేచ్చగా రీసైక్లింగ్‌ చేసి ఆ బియ్యాన్ని సిఎంఆర్‌ అనుమతి పొందిన మిల్లర్లు లేబుల్‌ ఉన్న గన్ని బ్యాగ్‌లో నింపి సిఎంఆర్‌ పేరుతో ఎఫ్‌సిఐకి అప్పగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వం సిఎంఆర్‌ కోసం ఇచ్చిన ధాన్యాన్ని బహిరంగ మార్కెట్‌లో అధిక ధరలకు అమ్ముకుని లక్షలు ఆర్జిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
చోద్యం చూస్తున్న అధికారులు
పిడిఎస్‌ బియ్యం అక్రమ దందా వివిధ రకాలుగా ఏళ్ల తరబడి యథేచ్ఛగా సాగుతున్నప్పటికీ అటు పౌరసరఫరాల శాఖ, ఇటు పోలీసులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని ప్రజలు అంటున్నారు. ఈ దందాతో దళారులు పెద్దఎత్తున కూడబెట్టుకోవడంతో పాటు ఎవరి వాటాలు వారికి అందిస్తుంటారనే విమర్శలున్నాయి. సోషల్‌ మీడియా, ప్రతికల్లో వార్తలు వచ్చినప్పుడు అధికారులు హడాహుడి చేస్తున్నారని అంటున్నారు. ఆరోపణలు వచ్చినప్పుడు మిల్లులను తనిఖీలు చేస్తున్న అధికారులకు మిల్లర్లు చేతులు తడపడంతో అంత మంచిగానే ఉందంటూ వారికి సర్టిఫికేట్‌ ఇస్తున్నారని కూడా ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ప్రజా పంపిణీ బియ్యం అక్రమ వ్యాపారాన్ని కట్టడి చేయాలని ప్రజలు కోరుతున్నారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments