కొన్ని ప్రాంతాలకు సన్నాలు… మరికొన్నింటికి దొడ్డు రకాలు
అధికారుల తీరుతో ఇబ్బందుల్లో డీలర్లు, వినియోగదారులు
ప్రజాపక్షం/ సూర్యాపేట రేషన్ సరఫరాలో ప్రాంతీయ వివక్ష కొనసాగుతుంది. కొన్ని ప్రాంతాలకు సన్నాలు… మరికొన్నింటికి దొడ్డు రకం బియ్యం సరఫరా చేస్తున్నారు. పౌరసరఫరాల అధికారుల తీరుతో రేషన్ డీలర్లు, వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. సూర్యాపేట జిల్లాలో మొత్తం 23 మండలాల్లో 610 రేషన్ దుకాణాలు ఉన్నాయి. 3,05,875 ఆహార భద్రత కార్డులున్నాయి. వీటి తో పాటు మరో 19,874 అంత్యోదయ ఆహారభద్రత కార్డులు, 42 అన్నపూర్ణకార్డులతో కలిపి మొత్తం 3,25,791 కార్డులకు గాను 9,49,634 యూనిట్లకు ప్రతి నెల యూనిట్‌కు 6 కిలోల చొప్పున ప్రభుత్వ బియ్యాన్ని పంపిణీ చేస్తుంది. కరోనా కాలం కావడంతో ప్రభుత్వ ఇటీవల కాలంలో ఉచితంగానే బియ్యాన్ని సరఫరా చేయడంతో పాటు యూనిట్‌కు మరో 4కిలోలు అదనంగా అందజేస్తుంది. జిల్లాలో మొత్తం ప్రతి నెల 9,917, 650 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సరఫరా అవుతున్నాయి. రేషన్ దుకాణాల ద్వారా ప్రభుత్వం పంపిణీ చేస్తున్న బియ్యం ఏ రకం ఏమిటని అనగా ప్రతి ఒక్కరు టక్కుమని చెప్పేది దొడ్డు రకమని చెబుతారు. గత రెండు సంవత్సరాలుగా కరోనాతో విద్యా సంస్థలు సక్రమంగా నడవకపోవడంతో విద్యార్థులకు వండిపెట్టేందుకు సరఫరా చేస్తున్న సన్న రకం బియ్యం నిల్వలు పెరుకుపోగా ప్రభుత్వం వాటిన్ని రేషన్ దుకాణాల సరఫరా చేస్తుంది. ప్రతి నెల రేషన్ దుకాణాలకు సరఫరా చేస్తున్న బియ్యంలో దొడ్డు రకంతో పాటు కొంత సన్న రకాలను కూడా ఉండటంతో డీలర్లు దొడ్డు, సన్నాలను లబ్ధిదారులకు సమపాలలో ఇస్తున్నారు. గత కొంతకాలంగా సన్న బియ్యాన్ని సరఫరా చేస్తుండటంతో అడపదడపా రేషన్‌ను తీసుకుంటున్న లబ్ధిదారులందరూ క్రమ తప్పకుండా బియ్యాన్ని వదిలిపెట్టకుండా తీసుకుంటున్నారు. జిల్లాలో ఆయా రేషన్ దుకాణాలకు సూర్యాపేట(చివ్వెంల), తుంగతుర్తి, కోదాడ, హుజూర్నగర్ గోదాముల నుండి రేషన్ దుకాణాలకు కేటాయించిన కోటాను నెలనెలా అధికారులు బియ్యాన్ని సరఫరా చేస్తున్నారు.
కొన్ని ప్రాంతాలకు సన్నాలు…
మరికొన్నింటికి దొడ్డు రకాల బియ్యం సరఫరా
ప్రభుత్వం సరఫరా చేస్తున్న దొడ్డు, సన్న రకాల బియ్యాన్ని సమపాలలో లెక్కలు కట్టి జిల్లాలోని అన్ని రేషన్ దుకాణాలకు సరఫరా చేయాల్సిన అధికారులు కొన్ని ప్రాంతాలకు సన్నాలు… మన్నికొన్ని ప్రాంతాలకు దొడ్డు రకం బియ్యాన్ని సరఫరా చేస్తున్నారు. జిల్లాలోని సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాలలోని రేషన్ దుకాణాలకు మొత్తం దొడ్డు రకం బియ్యాన్ని అధికారులు సరఫరా చేయగా కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాల పరిధిలోని రేషన్ దుకాణాలకు అధిక మొత్తంలో సన్న రకం బియ్యాన్ని సరఫరా చేయడం గమనార్హం. కోదాడ నియోజకవర్గ పరిధిలోని మోతె మండల పరిధిలో మొత్తం 28 రేషన్ దుకాణాలు ఉండగా ఇందులో ఆహారభద్రత కార్డులు 5,037, అంత్యోదయ కార్డులు 915 ఉండగా, 18,963 యూనిట్లకు గాను మొత్తం సన్న రకం బియ్యాన్ని ఈ నెల అధికారులు సరఫరా చేశారు. అలాగే కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాలో కూడా అధిక మొత్తంలో సన్న బియ్యానే సరఫరా చేయడంతో జిల్లాలో పెద్ద ఎత్తున చర్చ సాగుతుంది. సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గ లబ్ధిదారులు సన్న బియ్యం రాకపోవడంతో మేము ఏమి పాపం చేశామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇబ్బందులు పడుతున్న డీలర్లు,వినియోగదారులు..!!
రేషన్ బియ్యం సరఫరాలో సివిల్ సప్లు అధికారులు కొన్ని ప్రాంతాలపై వివక్ష చూపుతూ మరికొన్ని ప్రాంతాలపై ప్రేమ చూపుతున్నారని రేషన్ డీలర్లు ఆరోపిస్తున్నారు. సివిల్ సప్లు అధికారుల తీరుతో తాము ఇబ్బందులు పడుతున్నామని పలువురు డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లబ్ధిదారులు తమ వద్దకు వచ్చి పక్కన నియోజకవర్గ ప్రాంతాల్లో ఉన్న రేషన్ దుకాణాల్లో సన్న బియ్యం ఇస్తుంటే మీరేటి దొడ్డు రకం బియ్యం ఇస్తున్నారని నిలదీస్తున్నారని డీలర్లు చెబుతున్నారు. దీనికి తాము ఏమి సమాధానం చెప్పాలో తెలియక సతమతమవుతున్నామని వాపోతున్నారు. వీరి పరిస్థితి ఇలా ఉంటే సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాల లబ్ధిదారులు ఒకే జిల్లాలో బియ్యం సరఫరాల్లో వివక్ష ఏమిటని కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాల వారు చేసిన పుణ్యం ఏమిటి మేము చేసిన పాపం ఏమిటని ఆవేదన చెందుతున్నారు. ఇదే విషయమై జిల్లాలోని పలు రేషన్ గోదాముల ఇంచార్జీలను ప్రజాపక్షం ప్రశ్నించగా ఇందులో తమ తప్పు ఏమి లేదని ఉన్నతాధికారుల ఆదేశాలతోనే ఏ ప్రాంతాలకు ఏ బియ్యం సరఫరా చేయాల్లో చేస్తున్నామని చెప్పుకొచ్చారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు రేషన్ సరఫరాలో వివక్ష చూపకుండా అన్ని ప్రాంతాలకు సమానంగా దొడ్డు, సన్న రకాలను సరఫరా చేయాలని రేషన్ డీలర్లు, లబ్ధిదారులు కోరుతున్నారు.
రేషన్ సరఫరాలో ప్రాంతీయ వివక్ష?
RELATED ARTICLES