ప్రజాపక్షం / హైదరాబాద్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను ఈ నెల 20వ తేదీ వరకు నిర్వహించాలని శాసనసభ నిర్వహణ సలహా మండలి(బిఎసి) నిర్ణయించింది. మొత్తం 12 రోజుల పాటు సమావేశాలు జరుగుతాయి. 8వ తేదీన బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. అనంతరం రెండు రోజుల సెలవు ఇవ్వాలని బిఎసి నిర్ణయించింది. అలాగే సిఎఎ, ఎన్‌పిఆర్, ఎన్‌ఆర్‌సికి వ్యతిరేకంగా ఉభయ సభల్లో తీర్మానం చేయాలని బిఎసి నిర్ణయించింది. గవర్నర్ ప్రసంగం అనంత రం సభ వాయిదా పడిన తరువాత స్పీకర్ చాంబర్‌లో సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన బిఎసి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సిఎం కె.చంద్రశేఖర్‌రావు, డిప్యూటీ స్పీకర్ పద్మాకర్ గౌడ్, ఎంఐఎం పక్షనేత అక్బరుద్దీన్ ఓవైసి, మంత్రులు వేము ల ప్రశాంత్‌రెడ్డి, టి.హరీశ్‌రావు, ఈటల రాజేందర్, గంగుల కమలాకర్, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, విప్ గొంగిడి సునీతారెడ్డి, శాసనసభ కార్యదర్శి డాక్టర్ వేదాంతం నరసింహాచార్యులు తదితరులు హాజరయ్యారు. పస్తుత బడ్జెట్ సమావేశాలు మార్చి 20వ తేదీ వరకు జరపాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు శానసభాపక్ష వ్యవహారల మంత్రి ప్రశాంత్‌రెడ్డి మీడియాకు తెలిపారు. ఈనెల 9, 10, 15 తేదీలలో సెలవులు మినహాయిస్తే మొత్తం శాసనసభ బడ్జెట్ సమావేశాలు 12 రోజులు, మండలి సమావేశాలు 8 రోజులు జరుగుతాయన్నారు. శనివారం గవర్నర్ ప్రసంగం ధన్యవాద తీర్మానంపై చర్చ అనంతరం జవాబు ఉంటుందన్నారు. ఈనెల 8వ తేదీన ఉభయ సభల్లో బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నట్లు తెలిపారు. శాసనసభలో ఈ నెల 11,12 తేదీలలో బడ్జెట్ పై సాధారణ చర్చ జరుగుతుందని,12వ తేదీన ఆర్థిక శాఖ మంత్రి సమాధానం ఉంటుందని చెప్పారు. అనంతరం 13 నుండి 19వ తేదీ వరకు వరుసగా ఆరు రోజులు పద్దులపై చర్చ ఉంటుందన్నారు. 20వ తేదీన ద్రవ్య వినిమయ బిల్లుపై ముఖ్యమంత్రి సమాధానమిస్తారని వివరించారు. సిఎఎ, ఎన్‌ఆర్‌సి, ఎన్‌పిఆర్‌పై సభలో ముఖ్యమంత్రి కెసిఆర్ తీర్మానం ప్రవేశ పెడుతారని, సుదీర్ఘ చర్చ అనంతరం సభ్యుల అభిప్రాయాన్ని తీర్మానం చేస్తామని స్వయంగా ముఖ్యమంత్రి ముందుకొచ్చి బిఎసిలో తెలిపారన్నారు.