2019లో భారత అభివృద్ధి రేటు 6.1% మాత్రమే
1.2% మేరకు తగ్గించిన ఐఎంఎఫ్
ప్రపంచబ్యాంకు బాటలోనే అంతర్జాతీయ ద్రవ్య నిధి
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కూడా మందగమనమే
వాషింగ్టన్: అంతర్జాతీయ సంస్థల దృష్టిలో భారత అభివృద్ధి రేటు రోజురోజుకీ తగ్గిపోతోంది. తాజాగా అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) భారత స్థూల జాతీయోత్పత్తి (జిడిపి) అంచనాను కుదించివేసింది. 2019లో భారత జిడిపి పురోగతి అంచనా 6.1 శాతం మించి వుండబోదని తేల్చిచెప్పింది. ప్రపంచ దేశాల్లో భారత పురోగతి రేటింగ్ కూడా పడిపోయింది. గడిచిన ఏప్రిల్‌లో వేసిన అంచనా కన్నా 1.2 శాతం మేరకు తగ్గించివేసింది. 2019లో భారత్ 7.3 శాతం మేరకు అభివృద్ధి సాధిస్తుందని ఏప్రిల్ నెలలో ఐఎంఎఫ్ అంచనా వేసింది. ఆ తర్వాత మూడు నెలలకు భారత పురోగతి రేటు తగ్గిపోతున్నదని పేర్కొంటూ దాంట్లో మరో 0.3 శాతం కోత విధించింది. తాజాగా ఇంకో 1.2 శాతం తగ్గించేసింది. 2018లో భారత వాస్తవ అభివృద్ధి రేటు 6.8 శాతంగా వుండగా, 2019లో భారత అభివృద్ధి రేటు 6.1 శాతం వుంటుందని ఐఎంఎఫ్ తన తాజా వరల్డ్ ఎకనామిక్ అవుట్‌లుక్‌లో వెల్లడించింది. వచ్చే ఏడాదికి అంటే 2020లో భారత ఆర్థిక వ్యవస్థ 7.0 శాతానికి సాధిస్తుందని ఐఎంఎఫ్ ఆశాభావం వ్యక్తంచేసింది. ప్రపంచ బ్యాంకు కూడా ఇదివరకే భారత అభివృద్ధి రేటును తగ్గించిన విషయం తెల్సిందే. 2018లో భారత అభివృద్ధి రేటు 6.9 శాతం వుండగా, 2019లో అది 6 శాతం మాత్రమే వుంటుందని సౌత్ ఏషియా ఎకనామిక్ ఫోకస్ తాజా ఎడిషన్‌లో ప్రపంచబ్యాంకు ఆదివారంనాడు ప్రకటించింది. ఉత్పాదక రంగంతోపాటు వివిధ రంగాల్లో స్వదేశీ గిరాకీ పెరిగితే, 2020లో భారత అభివృద్ధి రేటు పెరుగుతుందని, లేకుంటే కష్టమేనని ఐఎంఎఫ్ వెల్లడించింది. దేశ ద్రవ్య విధానాలు, కార్పొరేట్ ఆదాయపన్ను రేట్లలో తగ్గింపు, ఆర్థిక అనిశ్చితిని తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, గ్రామీణ వినిమయం తోడ్పాటుకు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు వంటి అంశాల ఆధారంగా ఐఎంఎఫ్ ఈ నివేదిక తయారు చేసింది. ముఖ్యంగా భారత ఆటోమొబైల్, రియల్ ఎస్టేట్ రంగాలు చాలా బలహీనంగా వున్నాయని తెలిపింది. కాగా, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పరిస్థితి కూడా అంత గొప్పగా ఏమీ లేదని ఐఎంఎఫ్ తన నివేదికలో పేర్కొంది. ప్రపంచ అభివృద్ధి రేటు 3 శాతం తగ్గిపోతుందని వెల్లడించింది. ప్రపంచ ఆర్థిక మందగమనం వచ్చే ఏడాది కొనసాగినా ఆశ్చర్యపోనవసరం లేదని హెచ్చరించింది.