ప్రజాపక్షం/హైదరాబాద్: త్వరలో పాలనా సంస్కరణలను రాష్ట్ర ప్రభు త్వం తీసుకురానున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మంగళవారం నాడు జిల్లా కలెక్టర్ల సమావేశం నిర్వహించనున్నారు. ప్రగతిభవన్‌లోని సిఎం క్యాంపు కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్న కలెక్టర్ల కాన్ఫరెన్స్‌కు 33 జిల్లాల నుండి కలెక్టర్లు హాజరు కానున్నారు. ఈసారి కలెక్టర్ల సమావేశం మంగళవారం ఒక్క రోజుకే పరిమితం చేస్తున్నారని సమాచారం. గతంలో రెండు రోజుల పాటు కూడా ఈ సదస్సు కొనసాగిన సందర్భాలు ఉన్నాయి. ఈసారి సమావేశంలో కొత్త పంచాయతీరాజ్ చట్టం, కొత్త మున్సిపల్ చట్టాల అమలు, అలాగే వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదించే అవకాశమున్నట్లు భావిస్తున్న కొత్త రెవెన్యూబిల్లుపై చర్చించనున్నట్లు తెలిసింది. పట్టణ ప్రగతి అలాగే పల్లె ప్రగతి అంశాలతో పాటు వేసవి నేపథ్యంలో తెలంగాణకు హరితహారం కింద నాటిన మొక్కల పరిరక్షణ తదితర అంశాలను ఈ సమావేశంలో సిఎం కెసిఆర్ చర్చిస్తారని సిఎంఒ వర్గాల సమాచారం. కరోనా వైరస్ ప్రభలుతున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడా కలెక్టర్ల సమావేశంలో వివరించే అవకాశముంది.
21 జిల్లాలకు కొత్త కలెక్టర్లు
రాష్ట్రంలోని 33 జిల్లాలకుగాను 21 జిల్లాలకు ఇటీవలే కొత్త కలెక్టర్ల నియామకం జరిగింది. కలెక్టర్ల సమావేశానికి ముందు ఆదివారం రాత్రి జాయింట్ కలెక్టర్ పోస్టును రద్దు చేసి ఆ స్థానంలో అదనపు కలెక్టర్ పోస్టులను సృష్టించింది. ఐఎఎస్ అధికారులే కాకుండా నాన్ కేడర్ అధికారులను అదనపు కలెక్టర్లుగా నియమించడంతో ప్రస్తుతం ఐఎఎస్ వర్గాల్లో ఈ పోస్టుల (అదనపు కలెక్టర్ ) ప్రాధాన్యత పెరిగినట్టా? లేదా తగ్గిందా? అన్న సందేహా లు వెల్లువెత్తుతున్నాయి. ఇక కొత్త రెవెన్యూ చట్టంలో కలెక్టర్ల పాత్ర ఏంటీ వం టి విషయాలపై ముఖ్యమంత్రి కెసిఆర్ ఈ సమావేశంలో దిశానిర్ధేశం చేస్తారని భావిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సోమేష్ కుమార్ ని యామకం తర్వాత ఏర్పాటు అవుతున్న తొలి కలెక్టర్ల సమావేశం ఇదే కా వడం, 21 జిల్లాలకు కొత్త కలెక్టర్లు రావడం వంటి అంశాల నేపథ్యంలో నేటి కలెక్టర్ల సమావేశానికి అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది.
రెవెన్యూ శాఖ ప్రక్షాళన, కొత్త చట్టం నేపథ్యంలో కీలకమైన కలెక్టర్ల సమావేశం
RELATED ARTICLES