తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ
ప్రజాపక్షం/హైదరాబాద్ : మెదక్ జిల్లా తుప్రాన్ మండలం నర్సంపల్లి గ్రామంలో దళితులైన రాజశేఖర్, సంధ్య రాణి దంపతుల భూములను రెవెన్యూ అధికారుల అండదండలతో కబ్జా చేశారని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ ఆరోపించారు. మంత్రి హరీష్‌రావు అనుచరుడైన గ్రంథాలయ శాఖ చైర్మన్ చంద్ర గౌడ్ కబ్జాకు పాల్పడ్డారని అన్నారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో బాధితులు రాజశేఖర్, సంధ్యలతో పశ్య పద్మ మాట్లాడారు. భూమిని కబ్జా చేసిన వారికి అధికారులు వత్తాసు పలుకుతున్నారని తెలిపారు. ఆక్రమణ దారులను నిలువరించడంలో అధికారులు ఒక్క చర్య కూడా తీసుకోలేదన్నారు. తహసీల్దార్, ఆర్‌డిఒ, కలెక్టర్‌లను కలిసినా వారికి న్యాయం జరగలేదన్నారు. భూమికి సంబంధించిన రికార్డులు లేవని అధికారులు చెబుతున్నారని, రికార్డులు లేకుంటే పేదల భూములను ఎలా రక్షిస్తారని ప్రశ్నించారు. ఎడి సర్వే చేయమంటే చేయడం లేదని విమర్శించారు. చంద్ర గౌడ్ వెనక మంత్రి హరీష్‌రావు ఉన్నారని ఆరోపించారు. దీనిపై హరీష్ రావు స్పందించాలన్నారు. 80 ఎకరాలు 40 మంది పేదలకు చెందిన భూమిని కబ్జా చేసి, కంపెనీ పెడుతున్నారని అన్నారు. భూములు కబ్జా చేయడంతో చాలామంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. మెదక్, రంగారెడ్డి, సూర్యాపేట జిల్లాల్లో దళితులు, గిరిజనుల భూములను కబ్జా చేశారని తెలిపారు. ఈ విషయంపై సిఎం కెసిఆర్ స్పందించాలన్నారు. సంధ్య రాణి మాట్లాడుతూ 2004లో 15 ఎకరాల భూమిని కొనుగోలు చేశామన్నారు. 2016 డిజిటల్ పాసు పుస్తకాలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిందన్నారు. అప్పటి నుంచి తాము తహసీల్దార్ కార్యాలయానికి పాసు పుస్తకాల కోసం వెళ్లితే రాలేదని సమాధానం ఇచ్చేవారన్నారు. 2020 జూలై మాసంలో తమ భూమిలో జెసిబిలతో పనులు చేపట్టారని, తమకు తెలిసిన వెంటనే అక్కడి వెళ్లామని, భూమని తాము కొన్నామని కబ్జాదారులు అన్నారని అన్నారు. తహసీల్దార్, ఆర్‌డిఒ, జాయింట్ కలెక్టర్, కలెక్టర్లకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. తమకు పాసు పుస్తకాలు ఇవ్వలేదని, కానీ కబ్జాదారులకు మాత్రం ఇచ్చారని తెలిపారు. నాలా అనుమతులు కూడా వారికి ఇచ్చారన్నారు. తేదీ పొందుపర్చకుండానే నాలా అనుమతులు ఇచ్చారని తెలిపారు. దీనితో తాము కోర్టుకు వెళ్లామని, కోర్టు సర్వే చేసి, హద్దులు చేసి, భూమిని ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసిందన్నారు. రికార్డులు లేవని, సర్వేయర్‌లు లేరని సాకులు చెబుతున్నారని అన్నారు. ఈ విషయంపై తాము మంత్రి హరీష్ రావును కలిశామని, తమకు న్యాయం చేయాలని కలెక్టర్‌కు లేఖరాశారని తెలిపారు. అయినా అధికారులు స్పందించలేదన్నారు. పాసు పుస్తకాలు, భూమి తమకు ఇప్పించాలని సిఎం కెసిఆర్‌కు సంధ్య రాణి లేఖ రాశారు. తమ భూమిపై తమకు హక్కులు కల్పించాలని కోరారు.
రెవెన్యూ అధికారుల అండదండలతో భూ కబ్జా
RELATED ARTICLES