నెగెటివ్ వచ్చిన వారికి సైతం మళ్లీ టెస్టులు
నిర్మల్‌లో తాజాగా ఒకరికి కరోనా పాజిటివ్
బెల్లంపల్లి క్వారంటైన్ నుంచి 65 మందిని గాంధీకి తరలింపు
గుబులు పట్టిస్తున్నవి నాలుగు జిల్లాలే
కొత్తగా వస్తున్న వాటిలో మర్కజ్‌వే 40శాతం
ప్రజాపక్షం/హైదరాబాద్
రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుతున్నట్లే కనిపిస్తున్నా రోజుకో తీరు కేసులతో ఐదు జిల్లాలు మాత్రం ఇప్పటికీ ఆందోళన కలిగిస్తున్నాయి. వికారాబాద్, సూర్యాపేట, నిజామాబాద్, గద్వాల జిల్లాల్లో కరోనా వ్యాప్తి ఎక్కువ చెందుతోంది. వీటితో పాటు హైదరాబాద్ మొదటి నుంచి ఆందోళకరంగానే ఉంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి రోజు వెలుగుచూస్తున్న కేసు లు, ఘటనలను బట్టి కొత్త చర్యలు చేపడుతూ నిబంధనలు పెంచుతూ ఆంక్షలను కఠినతరం చేస్తోంది. సూర్యాపేటలో కేవలం అష్టాచమ్మా ఆట ఆడిన ఒక వృద్ధ్దురాలి ద్వారా 31 మందికి కరోనా రావడంతో అక్కడ హైఅలర్ట్ ప్రకటించి సిఎస్, డిజిపిలు స్వయంగా గురువారం పర్యటించగా శుక్రవారం నుంచి ఐజి స్టీఫెన్ రవీంద్ర అక్కడే ఉండి చర్యలు తీసుకుంటూ పరిస్థితులను ఎప్పకికప్పుడు అదుపులోకి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకసారి నెగెటివ్ వచ్చిన వారికి కూడా తాజాగా పాజిటివ్ వస్తుండడంతో రాష్ట్రంలో అలాంటి వారందరికి మరోసారి రక్త పరీక్షలు చేయాలని నిర్ణయించారు. వీరితో పాటు రెడ్ జోన్లలో ఇంటింటికే వెళ్లి అందరి రక్త నమూనాలు సేకరించి పరీక్షలు చేయాలని నిర్ణయించారు. శుక్రవారం నిర్మల్‌లో ఒకరికి కరోనా పాజిటివ్ తేలినట్లు డిఎంహెచ్‌ఓ తెలిపారు. ఆయా జిల్లాల నుంచి వస్తున్న సమాచారం మేరకు శుక్రవారం సాయంత్రం వరకు శనివారం రాష్ట్రంలో కొత్తగా 14 పాజిటివ్ కేసులు నమోదయినట్లు సమాచారం. నస్పూర్ మున్సిపాల్టీ ముత్తరావు పల్లిలో కరోనాతో చనిపోయిన వృద్ధురాలి అంత్యక్రియలకు వెల్లిన వారిని బెల్లంపల్లి, మందమర్రి క్వారంటైన్‌కు తరలించారు. వీరిలో 65 మంది పరిస్థితి అనుమానకరంగా ఉండడంతో శుక్రవారం గాంధీ ఆసుపత్రికి తరలించారు. వీరిలో మంచిర్యాల జిల్లా మంచిర్యాల, జన్నారం, నస్పూర్, జన్నారం, కాసిపేట మండలాలకు చెందిన వారున్నారు. మొదట్లో రాష్ట్రంలో నమోదవుతున్న కరోనా కేసుల్లో దాదాపు 80శాతానికిపైగా మర్కజ్ ప్రార్థనలకు వెల్లివచ్చిన వారివి, వారితో కంటాక్ట్ అయిన వారివి ఉండగా గత వారం రోజులుగా వస్తున్న వాటిలో మర్కజ్ కేసులు దాదాపు 40శాతం ఉన్నట్లు వైద్యవర్గాలు తెలిపాయి. ఇప్పటి వరకు కరోనా చికిత్సలో మెరుగైన ఫలితాలు ఇస్తుందని భావించిన యాంటి వైరల్ డ్రగ్ ‘ రెమ్ డెసివిర్’ ప్రయోగదశలోనే విఫలమైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తన అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచింది. అయితే దీనిని తయారు చేసిన ఫార్మాకంపెనీ దీనిని తోసిపుచ్చింది.
రెడ్‌జోన్లలో మళ్లీ రక్త పరీక్షలు
RELATED ARTICLES