బ్రిజ్ భూషణ్‌పై ఆరోపణల విచారణ 15వ తేదీలోగా పూర్తిచేస్తాం: మంత్రి అనురాగ్ ఠాకూర్ హామీ
న్యూఢిల్లీ: ఏడుగురు మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యుఎఫ్‌ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ను వెంటనే అరెస్టు చేసి, విచారణ జరిపించాలని కోరుతూ ఏప్రిల్ 23 నుంచి నిర్వహిస్తున్న ఆందోళనకు రెజ్లర్లు వారం రోజులపాటు బ్రేక్ ఇచ్చారు. రెజ్లర్ల ఆరోపణలు, తదనంతరం నమోదైన ఎఫ్‌ఐఆర్‌పై విచారణను ఈనెల 15లోగా పోలీసులు విచారణ పూర్తి చేస్తారని కేంద్ర క్రీడా మంత్రి అనురాగ్ హామీ ఇవ్వడంతో, ఈనెల 15వ తేదీ వరకూ ఆందోళనకు విరా మం ప్రకటిస్తున్నామని రెజ్లర్లు ప్రకటించారు. తమ డిమాండ్లలోగానీ, పోరాటంలోగానీ ఎలాంటి మార్పు లేదని వారు స్పష్టం చేశారు. రెజ్లర్ల ఆందోళనను పట్టించుకోవడం లేదంటూ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తడం, అన్ని రకాలుగా ఒత్తిడి పెరగడంతో, క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్ రంగంలోకి దిగారు. రెజ్లర్లను చర్చలకు పిలిచారు. బుధవారం దాదాపు ఐదు గంటలపాటు సమావేశమైన రెజ్లర్లు, ఆతర్వాత మీడియాతో మాట్లాడుతూ మే 28న పోలీసులు తమపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లను ఉపసంహరించుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని చెప్పారు. ’మహిళా సమ్మాన్ మహాపచాయత్’ నిర్వహించేందుకు అనుమతి లేకుండా కొత్త పార్లమెంట్ భవనం వైపు వెళ్లేందుకు రెజ్లర్లు ప్రయత్నించగా, శాంతిభద్రతలను ఉల్లంఘించినందుకు వారిపై కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఆ సమావేశానికి ఒలింపిక్ పతక విజేతలు బజరంగ్ పునియా, సాక్షి మాలిక్, ఆమె భర్త, ప్రముఖ రెజ్లర్ సత్యవర్త్ కడియాన్, జితేందర్ కిన్హా తదితరులు హాజరయ్యారు. అయితే వరల్డ్ చాంపియన్‌షిప్స్‌లో రెండు పర్యాయాలు పతాకాన్ని సాధించిన వినేష్ ఫోగత్ ఆ సమావేశానికి దూరంగా ఉన్నారు. దీనితో, రెజ్లర్లు ఆందోళన విరమిస్తున్నారన్న వార్త ప్రచారమైంది. అయితే, రెజ్లర్లు ఆ వార్తలను ఖండిచారు. ఈ నేపథ్యంలోనే అనురాగ్ ఠాకూర్ రెజ్లర్లతో చర్చలు జరిపారు. బ్రిజ్ భూషణ్‌పై పోలీస్ విచారణ ఈనెల 15 నాటికి పూర్తవుతుందని ఆయన రెజ్లర్లకు హామీ ఇచ్చారు. అప్పటి వరకూ వేచి ఉండాలని కోరారు. మంత్రి ప్రతిపాదనపై రెజ్లర్లు సానుకూలంగా స్పందించి, ప్రస్తుతానికి నిరసనను నిలిపివేశారు. తమపై పోలీసులు నమోదు చేసిన కేసులను ఉపంసహరించుకుంటామని మంత్రి తమకు హామీ ఇచ్చారని మీడియాతో మాట్లాడిన స్టార్ రెజ్లర్ సాక్షి మాలిక్ తెలిపింది. తాము ఆందోళనకు విరామం మాత్రమే ఇచ్చామని స్పష్టం చేసింది. ఆందోళన ఇంకా ముగియలేదని చెప్పింది. ఈ విలేకరుల సమావేశంలో అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ జూన్ 30లోగా ఐడబ్ల్యుఎఫ్ ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు.
రెజ్లర్ల ఆందోళనకువారం బ్రేక్
RELATED ARTICLES