అడ్డగింతలు.. అరెస్టులు..
జంతర్‌మంతర్ దీక్షా శిబిరం తొలగింపు
న్యూఢిల్లీ: లైంగిక వేధింపులకు పాల్పడిన భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యుఎఫ్‌ఐ) అధ్యక్షుడు, బిజెపి పార్లమెంటు సభ్యుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ను వెంటనే అరెస్టు చేయాలన్న డిమాండ్‌తో ఏప్రిల్ 23 నుంచి ఢిల్లీ జంతర్‌మంత్ వద్ద నిరసన దీక్షను కొనసాగిస్తున్న రెజ్లర్లపై పోలీసులు విరుచుకుపడ్డారు. కొత్త పార్లమెంటు భవన ప్రారంభోత్సవ సమయంలో, తమ సమస్యను అక్కడే మహిళల ‘మహాపంచాయత్’ నిర్వహించేందుకు వివిధ మార్గాల్లో సెంట్రల్ విస్టా ప్రాంతానికి వెళుతున్న రెజ్లర్లు, వారి మద్దతుదారులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ నిరసన ప్రదర్శనల్లో ప్రారంభం నుంచి కీలక పాత్ర పోషిస్తున్న అంతర్జాతీయ స్టార్ రెజ్లర్లు సాక్షి మాలిక్, వినేష్ ఫొగత్, బజరంగ్ పునియా, సంగీత ఫొగత్ తదితరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇలావుంటే, జంతర్‌మంతర్ వద్ద ఉన్న దీక్షా శిబిరం నుంచి రెజ్లర్లు బయలుదేరిన మరుక్షణమే, అక్కడకి చేరుకున్న పోలీసులు టెంట్లను పీకేశారు. ఫ్యాన్లు, మంచాలు, కూలర్లు, ఫ్యాన్లు, ఇతర సమాగ్రిని తొలగించారు. రెజ్లర్లు మళ్లీ వచ్చి, దీక్ష కొనసాగించకుండా నిరోధించడానికి పోలీసులు ఆ ప్రాంతాన్ని శుభ్రం చేశారని అంటున్నారు. కొత్త పార్లమెంటు భవనం వద్ద అమల్లో ఉన్న నిబంధనలు అతిక్రమించిన కారణంగానే రెజ్లర్లను అరెస్టు చేసినట్టు పోలీసులు స్పష్టం చేస్తున్నారు. బ్యారికేడ్లు ఛేదించుకొని ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించిన రెజ్లర్లను పోలీసులు అడ్డుకోవడంతో, ఇరు వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. తనను అరెస్టు చేసేందుకు ప్రయత్నించిన మహిళా కానిస్టేబుల్స్‌ను వినేష్ అడ్డుకుంది. ఆమె సోదరి, ప్రముఖ రెజ్లర్ సంగీతా ఫొగత్ రోడ్డుపై భీష్మించుకొని, అరెస్టును నివారించే ప్రయత్నం చేసింది. ఆయితే పోలీసులు బలవంతంగా వారిని అదుపులోకి తీసుకొని, అక్కడి నుంచి తరలించారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని, అరెస్టుల సమయంలో ఏం జరిగిందో సమీక్షిస్తున్నామని స్పెషల్ సిపి దీపేంద్ర పాఠక్ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. రెజ్లర్లు నిషేదాజ్ఞలను ఉల్లంఘించినట్టు ప్రాథమికంగా స్పష్టమవుతున్నదని అన్నారు. ఇలావుంటే, అరెస్టయిన రెజ్లర్లు, వారి మద్దతుదారులను వేరువేరు ప్రాంతాలకు తరలించినట్టు సమాచారం. పోలీసుల నుంచి దీనిపై ఎలాంటి ప్రకటన వెలువడలేదు.
రెజ్లర్లపై పోలీస్ జులుం
RELATED ARTICLES