పెగాసస్ గూఢచర్యంపై సుప్రీంకోర్టుకు కేంద్రం స్పష్టీకరణ
కావాలంటే నిపుణుల కమిటీ నియమిస్తామని సూచన
తాత్కాలిక ఉత్తర్వు ఇస్తామని ధర్మాసనం హెచ్చరిక
మరోసారి ఆలోచించుకోవాలని హితవు
న్యూఢిల్లీ : పెగాసస్ వివాదంపై సవివరణాత్మకమైన అఫిడవిట్ దాఖలు చేయలేమని కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు సోమవారంనాడు స్పష్టం చేసింది. ఇదివరకే సంక్షిప్త సమాచారంతో కూడిన అఫిడవిట్ దాఖలు చేసిన విషయాన్ని ప్రస్తావించింది. అదే సరిపోతుందని, కొత్తగా రెండో అఫిడవిట్ దాఖలు చేయాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించింది. దేశ భద్రతకు సం బంధించిన అంశాలను బాహాటంగా చర్చించలేమని వివరణ ఇచ్చింది. కేంద్ర వాదనపై సుప్రీం కోర్టు స్పందిస్తూ, మరో అఫిడవిట్ సమర్పించకుంటే, ఈ కేసులో తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేయక తప్పదని హెచ్చరించింది. మరోసారి ఆలోచించుకోవాలని హితవు పలికింది. ఇందుకు మూడు రోజుల గడువు ఇచ్చింది. దేశంలోని రాజకీయపార్టీలు, ప్రముఖుల కదలికలపైన, వారు చేసే రోజువారీ కార్యకలాపాలపైన గూఢచర్యం చేసేందుకు ఇజ్రాయిలీ దేశానికి చెందిన ఒక ప్రైవేటు కంపెనీ రూపొందించిన సాఫ్ట్‌వేర్‌ను ప్రభుత్వమే కొనుగోలు చేసి ఉపయోగిస్తోందని దేశంలో పెద్ద దుమారం చెలరేగింది. భారత్‌లో సుమారు 300 మందికిపైగా నేతలు, పేరెన్నికగన్న వ్యక్తులు, ప్రముఖులు, అత్యున్నత అధికారులు, చివరకు న్యాయమూర్తులపైన కూడా కేంద్రం నిఘా నేత్రం వేసిందని అంతర్జాతీయ మీడియాలో వార్తలు రావడంతో, మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన చెలరేగింది. ప్రతిపక్షాలు పార్లమెంటును స్తంభింపజేశాయి. దేశవ్యాప్తంగా పౌరుల హక్కులపై ప్రతిచోటా నిరసన ప్రదర్శనలు, చర్చలు, సదస్సులు జరిగాయి. మోడీ ప్రభుత్వంపై దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత రావడంతో, ఆయన పదవికి రాజీనామా చేయాలని సర్వత్రా డిమాండ్లు వచ్చాయి. ఈ ఒత్తిడిని తట్టుకోలేక మోడీ ప్రభుత్వం అతలాకుతలమైపోయింది. పౌరుల స్వేచ్ఛ, వారి గోప్యతా హక్కులకు తీవ్ర ముప్పు వాటిల్లిందని దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని, పౌర హక్కుల ఉల్లంఘనకు జవాబుదారీ వహించాలని, ఈ గూఢచర్యంపై ఒక స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించాలని డిమాండ్ చేస్తూ సుప్రీంకోర్టులో అనేక పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై సుప్రీం ధర్మాసనం విచారణ ప్రారంభించి ఆగస్టు 17న కేంద్ర ప్రభుత్వానికి నోటీసు జారీ చేసింది. జాతీయ భద్రతాంశాల రహస్యాలు చెప్పమని అడగడం లేదని, పౌరుల హక్కుల ఉల్లంఘన జరిగిందో లేదో, వారి గోప్యతా హక్కుకు వాటిల్లిందో లేదో స్పష్టం చేయాలని సుప్రీంకోర్టు ఆ నోటీసులో కేంద్రాన్ని కోరింది. దీనిపై పరిమితమైన ఒక అఫిడవిట్‌ను కేంద్రం దాఖలు చేసింది. మరో అఫిడవిట్ వివరంగా ఇవ్వాలని ధర్మాసనం మళ్ళీ కోరింది. దేశ భద్రతతో రాజీ పడలేమని, రహస్యాలు బహిర్గతం చెయ్యలేమని, రెండో అఫిడవిట్ దాఖలు చెయ్యలేమని న్యాయస్థానం ఎదుట కేంద్రం చేతులు ఎత్తేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి రమణ సారథ్యంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ పెగాసస్ గూఢచర్యం సాఫ్ట్‌వేర్ కేసును విచారిస్తోంది. కేంద్ర ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ధర్మాసనం ముందు తన వాదనలు వినిపిస్తూ, “మొదట పరిమితమైన ఒక అఫిడవిట్ దాఖలు చేశాం, ఈ సమస్యపై ఇబ్బడిముబ్బడిగా దాఖలైన పిటిషన్లకు జవాబు చెప్పేందుకు ఇక రెండో అఫిడవిట్ దాఖలు చెయ్యాలనే ఉద్దేశం కేంద్ర ప్రభుత్వానికి లేదు” అని తుషార్ మెహతా పేర్కొన్నారు. ప్రజలవద్ద ప్రభుత్వానికి దాచిపెట్టే విషయమేదీ లేదు, అందువల్ల కేంద్ర ప్రభుత్వం ఈ ఆరోపణలపై తనకు తానుగా ‘ఒక స్వయం ప్రతిపతి ్తగల నిపుణుల కమిటీ’ ఏర్పాటు చేయగలదని ఆయన కోర్టుకు హామీ ఇచ్చారు.
“ధర్మాసనం తన ఉత్తర్వులను వెల్లడించకుండా రిజర్వు చేస్తుంది, దీనిపై తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేస్తాం, ఈ లోపు మరోసారి ప్రభుత్వం సవివరంగా అఫిడవిట్ దాఖలు చేసే విషయాన్ని పునరాలోచించుకోవాలి, దాఖలు చేసేట్లయితే, ఆ విషయాన్ని ఉత్తర్వులు ఇవ్వడానికి ముందుగానే మాకు తెలియజేయాలి, ఇందుకు రెండు మూడు రోజులు సమయం ఉంది” అని జస్టిస్ రమణ స్పష్టం చేశారు. ఈ ధర్మాసనంలో ఎన్.వి.రమణతోపాటు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమకోహ్లీ సభ్యులుగా ఉన్నారు. “మీరు పదే పదే అఫిడవిట్ దాఖలు చెయ్యలేమని చెబుతున్నారు, మేం కూడా పదే పదే దేశ భద్రతకు సంబంధించిన రాజీపడలేని అంశాలను అఫిడవిట్‌లో దాఖలు చెయ్యమని కోరడం లేదు, ఈ ఆరోపణలపై మీరు ఒక కమిటీని ఏర్పాటు చేయగలమనీ, అది ఒక నివేదిక ఇస్తుందని చెబుతున్నారు, ఈ మొత్తం విషయాన్ని పరిశీలించేటప్పుడు దాన్ని కూడా మేము పరిగణనలోకి తీసుకుని పరిశీలించి అప్పుడు ‘తాత్కాలిక ఉత్తర్వు’ జారీ చేస్తాం” అని ధర్మాసనం కేంద్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది. “మిస్టర్ మెహతా, మీరు పదే పదే ఒకే విషయాన్ని వల్లె వేస్తున్నారు, అది ఇక్కడ చర్చనీయంశం కాదు” అని సుతిమెత్తగా ధర్మాసనం సొలిసిటర్ జనరల్‌కు చివాట్లు వేసింది. సెప్టెంబరు 7వ తేదీన సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి సవివరంగా అఫిడవిట్ దాఖలు చేసేందుకు వారం రోజులు గడువు ఇస్తూ ఈ కేసును సెప్టెంబరు 13 నాటికి వాయిదా వేసింది.
రెండో అఫిడవిట్ ఇవ్వలేం
RELATED ARTICLES