భారత ప్రధానమంత్రిగా నరేంద్రమోడీ ప్రమాణ స్వీకారం
ప్రమాణం చేయించిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
మోడీ సహా మంత్రులుగా 58 మంది ప్రమాణం
మంత్రివర్గంలోకి బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా
తెలంగాణ నుంచి కిషన్‌రెడ్డికి సహాయమంత్రిగా స్థానం
కేబినెట్ హోదా : 25, స్వతంత్ర హోదా : 9, సహాయమంత్రులు : 24 మంది
న్యూఢిల్లీ: దేశ ప్రధానిగా గురువారం రాత్రి 7.00 గంటలకు రెండోసారి నరేంద్ర మోడీ ప్రమాణస్వీకారం చేశారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ ముందు బహిరంగ ప్రదేశంలో ఏర్పాటుచేసిన వేదిక వద్ద మోడీతో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీ ప్రమాణస్వీకారం చేయించారు. ఆయనతోపాటు కేంద్ర మంత్రులుగా బిజెపి అధ్యక్షుడు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, విదేశాంగ మాజీ కార్యదర్శి ఎస్ జైశంకర్, డివి సదానంద గౌడ, నిర్మలాసీతారామన్, రామ్ విలాస్ పాశ్వాన్ కూడా పదవీ ప్రమాణస్వీకారం చేశారు. మోడీ గత ప్రభుత్వంలో కీలక మంత్రులుగా పనిచేసిన సుష్మాస్వరాజ్, రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్, మేనక గాంధీ ఈసారి కొత్త మంత్రిమండలిలో లేరు. మాజీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బుధవారం మోడీకి లేఖ రాశారు. తన ఆరోగ్య కారణాలరీత్యా తాను కొత్త ప్రభుత్వంలో భాగస్వామిని కాలేనని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. రెండోసారి ప్రధానిగా పదవీ ప్రమాణస్వీకారం చేసిన తర్వాత నరేంద్ర మోడీ ‘దేశానికి సేవ చేసుకునే గౌరవం దక్కింది’ అని ట్వీట్ చేశారు. మోడీ పదవీ ప్రమాణ సీకార వేడుకకు బిమ్‌స్టిక్ దేశాధినేతలు.. బంగ్లాదేశ్ అధ్యక్షుడు అబ్దుల్ హమీద్, శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన, నేపాల్ ప్రధాని కెపి శర్మ ఒలి, మయన్మార్ అధ్యక్షుడు యు విన్ మియింత్, భూటాన్ ప్రధాని లోటె షెరింగ్ సహా పలువురు దేశ, విదేశ ప్రముఖులు హాజరయ్యారు. థాయ్‌లాండ్ తరఫున ప్రత్యేక దూత గ్రిసద బూన్‌రాచ్ ప్రాతినిధ్యం వహించారు. కిర్గిజ్‌స్థాన్ అధ్యక్షుడు సూరోన్‌బే జీన్‌బెకోవ్, మారిషస్ ప్రధాని ప్రవింద్ కుమార్ జుగ్నౌత్ కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, బిజెపి అగ్రనేతలు ఎల్‌కె అద్వాణి, మురళీ మనోహర్ జోషి, కాంగ్రెస్ అగ్రనేతలు..మాజీ ప్రధాని డా. మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, యుపిఎ చైర్‌పర్సన్ సోనియా గాంధీ, మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్, కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీ, యుపి, తమిళనాడు ముఖ్యమంత్రులు కుమారస్వామి, దేవేంద్ర ఫడ్ణవీస్, అరవింద్ కేజ్రీవాల్, యోగి ఆదిత్యనాథ్, పళనిస్వామి, ప్రముఖ సినీనటుడు రజనీకాంత్ దంపతులతో పాటు పారిశ్రామిక దిగ్గజాలు ముకేశ్ అంబానీ దంపతులు, రతన్ టాటా, స్టీల్ పరిశ్రామిక దిగ్గజం ఎల్‌ఎన్ మిట్టల్, ఎస్సార్ డైరెక్టర్ ప్రశాంత్ రూయా, వేదాంత చైర్మన్ అనిల్ అగర్వాల్, అదానీ గ్రూపు అధినేత గౌతం అదానీ, సినీ ప్రముఖులు హేమా మాలిని, సన్నీ డియోల్,షాహిద్ కపూర్, బోనీ కపూర్, రజనీకాంత్, కరణ్ జోహార్, కంగనా రనౌత్, వివేక్ ఓబ్రాయ్, అనుపమ్ ఖేర్, మధుర్ భండార్కర్, దాదాపు 8000 మంది అతిథులు హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని తిలకించడానికి ప్రజలు ముందుగానే వేదిక ప్రదేశానికి చేరుకున్నారు. లక్షలాది మంది టెలివిజన్ ప్రసారాల ద్వారా మోడీ పదవీ ప్రమాణ స్వీకారాన్ని దేశవ్యాప్తంగా చూశారు.