అధికారంలోకి రాగానే చేసే పని అదే
విజయ్ మాల్యా, నీరవ్, చోక్సీలకే ప్రధాని మోడీ చౌకీదార్
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచార సభలో రాహుల్‌గాంధీ
కల్యాణదుర్గం/గన్నవరం: కేంద్రంలో తమ పార్టీ అధికారంలోకి రాగానే ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కు గా ఉన్న ప్రత్యేక హోదాను ఇస్తామని మరోసారి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ స్పష్టంచేశారు. రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే రైతుల రుణాలను రెండు రోజుల్లోనే మాఫీ చేస్తామని ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోడీ పాలనలో ధనవంతులదే రాజ్యమని విమర్శించారు. ఐదేళ్ల పాలనలో విజయ్ మాల్యా, నీరవ్ మోడీ, చోక్సీలకే లబ్ధి చేకూర్చారని మండిపడ్డారు. ఆదివారం ఆయన అనంతపురం జిల్లా కల్యాణదుర్గం, కృష్ణా జిల్లా గన్నవరంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మోడీ ప్రభుత్వ విధానాలను ఎండగడుతూనే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే చేపట్టే కార్యక్రమాలను రాహుల్ ప్రజలకు వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు గిట్టుబాటు ధరలు వచ్చేలా చర్యలు తీసుకుంటామని, వేరుశనగ, చింతపండు రైతుల కష్టాలను తీరుస్తామని భరోసా ఇచ్చారు. కరువు ప్రాంతమైన రాయలసీమ రైతులపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తామని చెప్పారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో తమ పార్టీ అధికారంలోకి వచ్చిన రెండ్రోజుల్లోనే రుణమాఫీ చేశామని గుర్తుచేశారు. ‘మోడీ పాలనలో ధనవంతులదే రాజ్యమైపోయింది. విజయ్‌మాల్యా, నీరవ్ మోడీ, చోక్సీలకే మోదీ చౌకీదార్. ఆయనకు సామాన్యల ప్రజల బాధలు పట్టవు. దేశంలో మధ్యతరగతి ప్రజలే ఎక్కువ. చిన్న, సన్నకారు రైతులకు గిట్టుబాటు ధర లేదు. మోడీ హయాంలో 15 మంది వ్యక్తుల వద్దే సంపదంతా పోగైంది. మోడీ పాలనలో ప్రభుత్వ విద్యను మరిచిపోయారు. విద్యా వ్యవస్థను కార్పొరేట్‌మయం చేశారు. ఐదేళ్లలో మోడీ ఆ 15 మందికే దోచిపెట్టారు. రూ.15లక్షల కోట్లను ఆ 15 మంది అనుచరులకే పంచిపెట్టారు. మహిళలకు వడ్డీలేని రుణాలు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే. బిజెపి పాలనలో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడ్డారు. న్యాయ్ పథకంతో పేదరికంపై సర్జికల్ స్ట్రైక్ చేయబోతున్నాం. దేశాన్ని ధనవంతులు, పేదలు అని రెండు వర్గాలుగా మోడీ విడగొట్టారు. సామాన్యలుకు సాయం చేసేందుకే మేం న్యాయ్ తీసుకువస్తున్నాం. కోట్ల మంది పేదలకు న్యాయం చేసేందుకే ఈ పథకం తీసుకొస్తున్నాం. 5కోట్ల కుటుంబాలకు ఏడాదికి రూ.72వేలు ఆర్థిక సాయంగా ఇస్తాం. కులం, మతం, ప్రాంతం, పార్టీ.. ఏవీ చూడకుండా ప్రతి పేదవాడినీ ఆదుకుంటాం. న్యాయ్ పథకం 25 కోట్ల మంది పేదలకు ఉపయోగపడుతుంది” అని వివరించారు. రాఫెల్‌లో మోడీ రూ.30వేల కోట్లు అనిల్ అంబానీకి కట్టబెట్టారు. మేం మోడీలా చేయం.. పేద ప్రలజకు సాయం చేస్తాం. పెద్ద నోట్ల రద్దు పథకం చేపట్టిన మోడీ దేశంలోని కోట్లాది కుటుంబాలను నాశనం చేశారు.