స్పష్టమైన హామీ రాకపోతే 17 నుంచి నిరసనలు
ధర్నాలో వక్తల హెచ్చరిక
ప్రజాపక్షం/హైదరాబాద్ నేషనల్ హెల్త్ స్కీమ్ మిషన్‌లో రెండవ ఎఎన్‌ఎంలుగా సేవలను అందిస్తున్న సిబ్బందిని బేషరతుగా క్రమబద్ధీకరించాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకపోతే ఈనెల 17 నుంచి జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు, ధర్నాలను నిర్వహించాలని నిర్ణయించారు. ఈనెల 18వ తేదీ నుంచి కంటి వెలుగు కార్యక్రమంలో ఆన్‌లైన్ పనుల నుండి ఎఎన్‌ఎంలను తప్పించకపోతే, తప్పని పరిస్థితుల్లో 18వ తేదీ నుండే నిరవదికసమ్మె చేపట్టాల్సి ఉంటుందని హెచ్చరించారు. ‘తెలంగాణ రాష్ట్ర ఎన్‌హెచ్‌ఎం రెండవ ఎఎన్‌ఎంల యూనియన్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ధర్నాచౌక్ వద్ద గురువారం భారీ ధర్నా జరిగింది. జాతీయ బిసి సంఘం అధ్యక్షుడు, ఎంపి ఆర్. కృష్ణయ్య, ఎఐటియుసి రాష్ట్ర అధ్యక్షుడు ఎం.డి యూసుఫ్, ఎన్‌హెచ్‌ఎం కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.నరసింహ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ రెండవ ఎఎన్‌ఎంలను అనేక రాష్ట్రాల్లో పర్మినెంట్ చేసినప్పటికీ మిగులు బడ్జెట్ గల తెలంగాణ రాష్ట్రంలో పర్మినెంట్ చేయకపోవడం అన్యాయమని, ఈ అంశాన్ని రానున్న పార్లమెంటు సమావేశాల్లో తన గళాన్ని వినిపిస్తానన్నారు. సంవత్సరాల తరబడి నేషనల్ హెల్త్ మిషన్ స్కీమ్‌లో రెండవ ఎఎన్‌ఎంలుగా సేవలను అందిస్తున్న సిబ్బందిని బేషరతుగా క్రమబద్ధీకరించాలని, సమాన పనికి సమాన వేతనం చట్టం ప్రకారం జీతాలు చెల్లించాలని, సిబ్బందిపై రాష్ట్ర ప్రభుత్వం విధిస్తున్న పని భారాన్ని తగ్గించాలని ఎండి యూసుఫ్,ఎం నరసింహ డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న కంటి వెలుగు కార్యక్రమంలో డేటా ఎంట్రీ ఆపరేటర్లను నియమించకుండా ఆ పనులను రెండవ ఎఎన్‌ఎంలతో చేపించుకునేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఎఎన్‌ఎంల పని మాత్రమే వారితో చేయించాలని, డేటా ఎంట్రీ ఆపరేటర్ల పని కూడా ఎఎన్‌ఎంలతో చేయించడం అన్యాయమని వారు వివరించారు. రాష్ట్రంలో అనేక ఆన్‌లైన్ విధులను ఎఎన్‌ఎంలతోనే కొనసాగిస్తున్నారని, జిఒ నంబర్ 16 ప్రకారం రెండవ ఎఎన్‌ఎంలను క్రమబద్ధీకరించి, వారికి న్యాయం చేయాలని వారు కోరారు. ఎఎన్‌ఎంల సేవలను ప్రశంసించిన రాష్ట్ర ప్రభుత్వం, అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ధర్నాకు ఎఐటియుసి రాష్ట్ర సమితి సభ్యులు, సెకండ్ ఎఎన్‌ఎం యూనియన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు రామాంజనేయులు సమావేశానికి అధ్యక్షత వహించగా, జాతీయ బిసి సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, నిరుద్యోగ జాక్ చైర్మన్ నీల వెంకటేష్ రెండవ ఏఎన్‌ఎంల యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి మధురిమ, రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి పడాల మమత, రేణుక, మంజుల, నీలిమ, సృజన, విజయ వాణి, విజయలక్ష్మి స్వర్ణలతలతో పాటు పలువురు ఎఎన్‌ఎంలు పాల్గొన్నారు. కాగా ఉపకేంద్ర పరిధిలో రెండవ ఎఎన్‌ఎంలు నిర్వహించే గ్రామాల శానిటేషన్ నిధులను రెండవ ఖాతాలో జమ చేయాలని, ప్రతి రెండవ ఏఎన్‌ఎమ్ కు 36 రిజిస్టర్లు ఆన్‌లైన్ అండ్ ఆఫ్‌లైన్ దీనికి సుమారు రూ.2500 ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలని కోరారు.
రెండవ ఎఎన్‌ఎంలను బేషరతుగా క్రమబద్ధీకరించాలి
RELATED ARTICLES