HomeNewsBreaking Newsరూ. 5 వేలకోట్లు కేటాయించాలి

రూ. 5 వేలకోట్లు కేటాయించాలి

భారీ వర్షాలు, వరదలను కేంద్రం జాతీయ విపత్తుగా ప్రకటించాలి
సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి డిమాండ్‌
హనుమకొండలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన
ప్రజాపక్షం/వరంగల్‌ ప్రతినిధి
రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలు వల్ల జరిగిన నష్టానికి కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తు కింద రూ. 5000 కోట్లు కేటాయించాలని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. మంగళవారం హన్మకొండలోని పలు వర్ష ప్రభావిత ప్రాంతాల్లో చాడ వెంకట్‌రెడ్డి సిపిఐ నాయకులతో కలిసి సందర్శించారు. అనంతరం బాలసముంద్రలోని సిపిఐ జిల్లా కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల కారణంగా ప్రభుత్వ, ప్రయివేటు ఆస్తులకు తీరని నష్టం జరిగిందని, రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించి వెళ్లడంతో సరిపోదని, కేంద్రం నుంచి ఆర్థికసాయం అందించాలన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా కేవలం రూ. 500 కోట్లు కేటాయించడం కంటి తుడుపు చర్యగానే మిగులుతుందన్నారు. వరద ముంపు ప్రాంతాల్లో శాశ్వత నివారణ చర్యలు చేపట్టాలన్నారు. వరంగల్‌, హన్మకొండ పట్టణాల్లో నాలాలు కబ్జాకు గురయ్యాయని, చెరువులను రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు ఆక్రమించారని, వాటి వల్లనే కాలనీలు ముంపుకు గురయ్యాయన్నారు. ప్రజాప్రతినిధులు, నాయకుల అండదండలతో నాలాలపై పెద్ద పెద్ద భవనాల నిర్మాణం జరిగిందని, దాని వల్లనే రోడ్లపైకి, ఇళ్లలోకి వరద నీరు చేరుకుంటుందన్నారు. పాలకుల అలసత్వం వల్లనే వరంగల్‌, హన్మకొండలో ఈ పరిస్థితి ఏర్పడిందని, ఇప్పటికైనా ఆక్రమణకు గురైన నాలాలపై సర్వే చేయాలన్నారు. నాలాలపై నిర్మాణాలను తొలగించి వారికి ప్రత్యామ్నాయం చూపాలని, నాలాలు వెడల్పు చేయాలని, ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాలన్నారు. ఇటీవల వదరల వల్ల కొట్టుకొనిపోయిన, కూలిపోయిన ఇళ్లకు నష్టపరిహారం ఇవ్వాలని, వరదల వల్ల మృతిచెందిన వారికి ఎక్స్‌గ్రేసియా అందించాలని డిమాండ్‌ చేశారు. గ్రేటర్‌ వరంగల్‌కు ఏటా రూ. 300 కోట్లు ఇస్తామని చెప్పి సిఎం కేసిఆర్‌ మాట నీటి మూటగా మారిందని అన్నారు.అలాగే స్మార్ట్‌ సిటీ కింద వరంగల్‌ను ప్రకటించిన కేంద్రం వరంగల్‌ కు ఏమిచ్చిందో బీజేపీ నాయకులు చెప్పాలని చాడ ప్రశ్నించారు.ఈ సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యుడు తక్కళ్లపల్లి శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి కర్రె బిక్షపతి, జిల్లా సహాయ కార్యదర్శులు తోట బిక్షపతి, మద్దెల ఎల్లేష్‌, రాష్ట్ర నాయకులు ఆదరి శ్రీనివాస్‌, మారుపాక అనిల్‌కుమార్‌, జిల్లా నాయకులు కొట్టెపాక రవి, బాషబోయిన సంతోష్‌, మాలోతు శంకర్‌, మునిగాల బిక్షపతి,బి.బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.
యుద్ధ ప్రాతిపదికన సహాయ చర్యలు చేపట్టాలి
ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో వర్షాలు, వరదల కారణంగా పంటలు నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ. 20 వేల నష్టపరిహారం ఇవ్వాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. గతంలో వర్షాల వల్ల నష్టపోయిన వారికి నేటికి నష్టపరిహారం ఇవ్వలేదన్నారు. అలాగే పశువులు చనిపోయి నష్టపోయారని, యుద్ధ ప్రాతిపదికన సహాయ చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం హన్మకొండలోని పలు వరద ముంపు ప్రాంతాల్లో చాడ వెంకట్‌రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యుడు తక్కళ్లపల్లి శ్రీనివాసరావు, జిల్లా నాయకులు పర్యటించారు. నయీంనగర్‌ పెద్ద మొరీ, జవహర్‌ నగర్‌ తదితర ప్రాంతాల్లో పర్యటించారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments