HomeNewsBreaking Newsరిసార్ట్‌లో రిసెప్షనిస్ట్‌ హత్య

రిసార్ట్‌లో రిసెప్షనిస్ట్‌ హత్య

ఉత్తరాఖండ్‌లో బిజెపి నేత కొడుకు నిర్వాకం
అతిథులతో శృంగారంలో పాల్గొనలేదనే..!
నిందితుల అరెస్టు: పోలీసు వాహనంపై ప్రజల దాడి
సిట్‌ బృందంతో దర్యాప్తు : ముఖ్యమంత్రి ధామి వెల్లడి

డెహ్రాడూన్‌: ఉత్తరాఖండ్‌లోని ఒక బిజెపి నాయకుడి కొడుకు పులకిత్‌ ఆర్య నిర్వహిస్తున్న రిజార్టులో రిసెప్షనిస్టుగా పనిచేస్తున్న 19 ఏళ్ళ వయసుగల యువతి దారుణ హత్య కు గురైంది. రిసార్ట్‌కు వచ్చే అతిథులకు “ప్రత్యేక సేవలు” అందించలేదనే కారణంగా రిసెప్షనిస్టును హత్య చేసి కాలువలో పడేశారు. ఈనెల 18న యువతి అదృశ్యమైంది. పోలీసులు శనివారం ఆమె మృతదేహాన్ని కాలువలోంచి వెలికి తీశారు. ఈ హత్యలో బిజెపి నాయకుడి కొడుకుతోపాటు రిజార్టు మేనేజర్లుగా పనిచేస్తున్న మరో ఇద్దరు తోటి ఉద్యోగులు కూడా నిందితులుగా ఉన్నారని ఉత్తరాఖండ్‌ పోలీస్‌ డైరెక్టర్‌ జనరల్‌ అశోక్‌ కుమార్‌ శనివారం పాత్రికేయులకు వెల్లడించారు. రిజార్టు యజమాని ఆర్యను, అసిస్టెంట్‌ మేనేజర్‌ను శుక్రవారంనాడు పోలీసులు అరెస్టు చేసి జ్యుడీషియల్‌ కస్టడీ నిమిత్తం 14 రోజులు రిమాండ్‌కు తరలించారు. హరిద్వార్‌కు చెందిన బిజెపి నాయకుడు వినోద్‌ ఆర్య ఉత్తరాఖండ్‌ మతి కలా బోర్డుకు ఛైర్మన్‌గా కూడా వ్యవహరిస్తున్నాడు. వినోద్‌ ఆర్య కుమారుడే ఈ హత్యకేసులో ప్రధాన నిందితుడు పులకిత్‌ ఆర్య. నిందితులను ఇద్దరినీ అరెస్టు చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలిస్తుండగా తీవ్ర ఆగ్రహం చెందిన ఆ ప్రాంత ప్రజలు పెద్ద ఎత్తున చుట్టుముట్టి పోలీ సు వాహనంపై దాడి చేశారు. ఇదిలా ఉండగా, యజమాని ఆర్యకు చెందిన ఒక పచ్చళ్ళ ఫ్యాక్టరీ శనివారం ఉదయం అగ్నికి ఆహుతి కావడంతో ప్రజల్లో అనేక సందేహాలు తలెత్తుతున్నాయి. ఆ రిసెప్షనిస్టును పచ్చళ్ళ కర్మాగారానికి తీసుకువెళ్ళి అత్యాచారం చేసి ఉంటారని, సాక్ష్యాలు లేకుండా నిర్మూలించేందుకే ఫ్యాక్టరీని దగ్ధం చేసి ఉంటారని, ఈ ఘటనపై కూడా దర్యాప్తు చేయాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. కాగా, సిట్‌ బృందంతో ఈ ఘటనపై దర్యాప్తు చేస్తామని ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్‌ ధామి చెప్పారు.“వాళ్ళు నన్ను ఒక వ్యభిచారిగా మార్చాలని ప్రయత్నం చేస్తున్నారు” అంటూ చనిపోయేముందు రిసెప్షనిస్టు తన స్నేహితురాలకి పెట్టిన వాట్సాప్‌ మెసేజ్‌ ‘స్క్రీన్‌ షాట్స్‌’ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. నిందితుణ్ణి కఠినంగా శిక్షించాలని సోషల్‌ మీడియా గగ్గోలు పెడుతున్నది. రిసార్టుకు వచ్చే అతిథులతో సెక్స్‌లో పాల్గొంటే ప్రతిసారీ రూ.10,000 చొప్పున ముడతాయని వారు తనపై ఒత్తిడిచేస్తున్నారని తనను బలవంతంగా ఒక వ్యభిచారిగా మార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. అయితే పోలీసులు మాత్రం, “బహుశా ఆ టెక్ట్‌ మెసేజ్‌లు ఆమెవే కావచ్చు” అంటున్నారు!! మరిన్ని సాక్ష్యాలకోసం ఫోరెన్సిక్‌ పరీక్షలు చేస్తున్నామన్నారు. యువతి మృతదేహాన్ని వెలికితీసి రిషికేశ్‌లోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థకు తరలించారు. రిసెప్షనిస్టు స్నేహితురాలు మరో స్నేహితురాలితో మాట్లాడుతూ చాటింగ్‌ద్వారా చెప్పిన విషయం తమ దృష్టికి వచ్చిందని ఆయన అన్నారు. రిసార్టుకు వచ్చిన అతిథులతో లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనేందుకు రిసెప్షనిస్టు తిరస్కరించడంతో రిసార్టు యజమానే హంతకుడుగా మారాడని డిజిపి చెప్పారు. రిసార్టుకు వచ్చిన అతిథులతో సెక్స్‌ కార్యకలాపాల్లో పాల్గొనాలని హోటల్‌ యజమాని అయిన బిజెపి నాయకుడి కొడుకు ఆ యువతికి ఆదేశించాడు. అందుకు ఆమె తిరస్కరించింది. ఇంటినుండి రిసార్టులో విధి నిర్వహణకు వెళ్ళిన తమ కుమార్తె కనిపించడంలేదని యువతి తల్లిదండ్రులు తొలుత పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు రంగంలోకి దిగారు. యువతి ఒక గదిలో ఉంటోంది. తల్లిదండ్రులు వెళ్ళి చూడగా ఆ యువతి సోమవారం ఉదయం నుండి తన గదికి రాలేదని తెలియడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, రిసెపనిస్టు రాత్రివేళ ఫోన్‌ చేసి తనను చంపేస్తామని బెదరిస్తున్నారని, తాను కష్టాల్లో ఉన్నానని చెప్పిందని ఆమె స్నేహితురాలు తర్వాత పోలీసులకు స్పష్టంగా తెలియజేసింది. రిజార్టు యజమాని, తన తోటి మేనేజర్లు ఇద్దరు సెక్స్‌ కార్యకలాపాల్లో పాల్గొనకపోతే తనను చంపేస్తామని బెదిరిస్తున్నారని, తనపై తీవ్రమైన ఒత్తిడి తీసుకువసస్తున్నారని ఫోన్‌లో చెప్పిందని స్నేహితురాలు పోలీసులకు తెలియజేసింది. తరాత రాత్రి 8.30 గంటలకు ఆమె ఫోన్‌ పనచేయడం మానేసింది. ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా ఫోన్‌ ఎత్తకపోవడంతో చివరకు ఆమె స్నేహితురాలు రిసార్టు యజమాని పులకిత్‌ ఆర్యకు ఫోన్‌ చేసి ఆరా తీయగా, ఆమె తన రూమ్‌కు వెళ్ళిపోయిందని, నిద్రపోతూ ఉండి ఉండవచ్చునని సమాధానం చెప్పాడు. మరునాడు కూడా ఆమె పులకిత్‌ ఆర్యకు పదే పదే ఫోన్లు చేసి ప్రశ్నించింది. తర్వాత ఆర్య తన ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేశాడు. దాంతో ఆమె వెంటనే రిజార్టు మేనేజర్‌ అంకిత్‌కు ఫోన్‌ చేసి అడిగింది. ఆమె జిమ్‌లో ఉందని అతడు సమాధానం చెప్పారు. మరో ముఖ్యుడికి ఫోన్‌చేసి ఆ స్నేహితురాలు ప్రశ్నించగా రిసెప్షనిస్టు అసలు రిజార్డు డ్యూటీకే రాలేదని సమాధానం చెప్పాడు.
కాంగ్రెస్‌పార్టీ నిరసన ప్రదర్శనలు
బిజెపి నాయకుడు వినోద్‌ ఆర్య కుమారుడు పులకిత్‌ ఆర్య తన రిసార్టు రిసెప్షనిస్టును హత్య చేయడంతో కాంగ్రెస్‌పార్టీ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగింది. జిల్లా కేంద్రం డెహ్రాడూన్‌లో శనివారం నిరసన ప్రదర్శన జరిపింది. తండ్రీకొడుకులు ఇద్దరనీ కఠినంగా శిక్షించాలని కాంగ్రెస్‌పార్టీ డిమాండ్‌ చేసింది. పులకిత్‌ ఆర్యకు చెందిన పచ్చళ్ళ ఫ్యాక్టరీ ఎందుకు అగ్నికి ఆహుతైందని, ఏ సాక్ష్యాధారాలు తుడిచిపెట్టేందుకు ఈ చర్యకుపాల్పడ్డారని కాంగ్రెస్‌ ప్రశ్నించింది. ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు చేయాలని ఉత్తరాఖండ్‌ కాంగ్రెస్‌పార్టీ నాయకులు డిమాండ్‌ చేశారు. యువతి తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు ఐదు రోజుల వరకూ ఎఫ్‌ఐఆర్‌ ఎందుకు నమోదు చేయలేదని ఉత్తరాఖండ్‌ పిసిసి అధ్యక్షుడు కరణ్‌ మెహ్రా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వం నిందితులకు సహకరిస్తోందని, కఠిన చర్యలు తీసుకునే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని, ఉత్తరాఖండ్‌లో మహిళలకు ఏ మాత్ర రక్షణ లేదని ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కాగా రిసెప్షనిస్టు హత్య ఘటనపై విచారణ చేసేందుకు ‘సిట్‌’ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమిస్తున్నట్లు ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌ ధామి ఒక ప్రకటన చేశారు. డిఐజి రేణుకాదేవి ఈ సిట్‌ బృందానికి సారథ్యం వహిస్తారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments