ప్రజాపక్షం/ సూర్యాపేట బ్యూరో : హైదరాబాద్ మహానగరానికి ధీటుగా గత కొన్ని ఏళ్లుగా సూర్యాపేటలో సాగిన రియల్ ఏస్టేట్ వ్యాపారం ప్రస్తుతం ఢమాల్ అయింది. తెలుగు రాష్ట్రాల రాజధానులకు మధ్యలో ఉండి 65వ జాతీయ రహదారికి సమీపంలో ఉన్న సూర్యాపేటలో రియల్ ఏస్టేట్ వ్యాపారం పదేళ్ల నుంచి మూడు పువ్వులు ఆరుకాయలుగా విరాజిల్లుతూ వస్తుంది. స్థానిక వ్యాపారులే కాకుండా తెలుగు రాష్ట్రాల నుంచి అనేక మంది పెట్టుబడిదారులు పెద్ద ఎత్తున భూములను కొనుగోలు చేస్తున్నా రు. రియల్ వ్యాపారం పుణ్యమా అని వ్యవసాయ సాగుభూములన్నీ వెంచర్లుగా మారాయి. ఎకరం భూమి ధర రూ. 50 వేలు ఉండగా పెరుగుతూ పెరుగుతూ నేడు రూ. 2కోట్లకు చేరింది. వ్యాపారులు ముందు భూములను కొనుగోలు చేసి ఆ తరువాత చేతులు మారు స్తుండటంతో భూముల ధరలు పైపైకి పోయాయి. కోట్లు కుమ్మరించి భూములను కొనుగోలు చేసి వెంచర్లు చేసినా ప్లాట్ల అమ్మకాలు లేక వ్యాపారులు తలలు పట్టుకున్నారు. భారీగా ధరల పెంపు వల్లే కొనుగోళ్లకు ముందుకు రావడం లేదని ప్రజల నుంచి అభిప్రాయం వ్యక్తమవుతుంది. దీనికి తోడు ఆర్థ్ధిక మాంధ్యం కూడా మరో కారణమని వ్యాపారులు వాపోతున్నారు. సూర్యా పేట పట్టణానికిఎటూ చూసినా ఇరువై కిలోమీటర్ల మేరకు రియల్ ఏస్టేట్ వ్యాపారం విస్తరించింది. గత పది సంవత్సరాలుగా రియల్ వ్యాపారం రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఊపందుకుంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ తరువాత కూడా వ్యాపారం ఏమాత్రం తగ్గుముఖం పట్టలేదు. స్ధానిక వ్యాపారులే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల నుండి అనేక మంది వ్యాపారులు ఇక్కడికి వచ్చి పెద్ద ఎత్తున భూములను కొనుగోలు చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా జిల్లాల పునరః విభజనలో భాగంగా మూడేళ్ల క్రితం సూర్యాపేట జిల్లా కేంద్రంగా ఏర్పడడంతో ఈ వ్యాపారం మరింత ఊపందుకుంది. పట్టణానికి ఎటూ చేసిన ఇరువై కిలోమీటర్ల మేరకు రియల్ ఏస్టేట్ వ్యాపారం విస్తరించడం గమనార్హం. 65వ జాతీయ రహదారికి అనుకుని ఉన్న వ్యవసాయ భూములకు డిమాండ్ పెరిగింది.ఎకరం భూమి గతంలో 50వేలు ఉండగా నేడు రూ. 2 కోట్లకు చేరింది. జాతీయ రహదారికి 5 కిలోమీటర్ల లోపలికి ఉన్న భూములు కూడా ఎకరం కోటి రూపాయల ధర పలుకుతుంది. జిల్లా నూతన కలెక్టరేట్ నిర్మాణ ప్రాంతంతో పాటు కుడకుడ రోడ్డు, జనగాం రోడ్డు, ఖమ్మం రోడ్డు, కాసరబాద రోడ్డు, నూతన ఎస్పీ కార్యాలయం నిర్మాణం జరుగుతున్న ప్రాంతాల్లో వందలాది ఎకరాలలో వెంచర్లు వెలిచాయి. కోట్లాది రూపాయలను కుమ్మరించి భూములను కొనుగోలు చేసిన వ్యాపారులు మహానగరాల స్ధాయిలో వెంచర్లను చేసి విక్రయాలు జరుపుతున్నారు. అలాగే మరి కొంతమంది వ్యాపారులు ఏకంగా ఇండ్ల నిర్మాణాలు చేపట్టి గ్రేటర్ కమ్యూనిటీల పేరుతో వాటిని విక్రయిస్తున్నారు. విశాలమైన రోడ్లు, పార్కుల ఏర్పాటు, స్వీమింగ్‌పూల్స్ నిర్మాణం, కమ్యూనిటీ హాల్స్, గుడి, బడి పేర్లతో స్ధలాల కేటాయింపు, మొక్కలు నాటి పెంచి పెద్ద చేసి ఫ్లాట్ల విక్రయాలు, ఇండ్ల నిర్మాణం చేపడుతున్నారు. దీనికి సూర్యాపేట ప్రాంత ప్రజలు కూడా ఆకర్షితులై వారి ఆర్ధిక స్ధోమతకు మించి కొనుగోళ్లు చేస్తున్నారు. ప్రజల నాడిని పసిగట్టిన వ్యాపారులు ఈ వెంచర్లలో గజం స్థలం రూ. 10వేల నుండి రూ. 15వేల రూపాయలకు విక్రయిస్తూ సోమ్ము చేసుకుంటున్నారు. మూడుపువ్వులు ఆరు కాయలుగా ఇన్ని రోజులు కొనసాగిన రియల్ వ్యాపారం గత ఆరు నెలల నుండి మందగించింది. వ్యాపారంపై ప్రత్యేక్షంగా పరోక్షంగా పదివేల కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. పట్టణంలో దాదాపు 5వేల మందికిపైగా రియల్ ఏస్టేట్ దళారులు ఉన్నారంటే రియల్ వ్యాపారం ఇన్ని రోజులు ఏలా సాగిందో దీనిని బట్టి స్పష్టమవుతుంది. వీరంతా నేడు వ్యాపారాలు లేక విలవిలాడుతున్నారు. ఎప్పుడు రద్దిగా ఉండే దస్తవేజులేఖర్లు క్రయ విక్రయాలు లేక ఈగలు కోట్టుకుంటున్న పరిస్ధితి.