HomeNewsBreaking Newsరాహుల్‌గాంధీపై ప్రశ్నల వర్షం

రాహుల్‌గాంధీపై ప్రశ్నల వర్షం

నేషనల్‌ హెరాల్డ్‌ హవాలా కేసులో రెండు విడతలుగా ఇడి విచారణ
అల్లర్ల నివారణకు భారీగా బలగాల మోహరిం

న్యూఢిల్లీ : రాజకీయ ప్రత్యర్థులను దెబ్బతీసేందుకు కేంద్రం చేతుల్లో దివ్యాస్త్రంగా మారిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టొరేట్‌ (ఇ.డి.) సోమవారం కాంగ్రెస్‌పార్టీ జాతీయ పూర్వాధ్యక్షుడు, లోక్‌సభ సభ్యుడు రాహుల్‌గాంధీ (51) ని రెండు విడతలు గా విచారణ చేసింది. ఆయనపై వరుస ప్రశ్నలు సంధించింది. అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ర్యాంక్‌ అధికారి ఒకరు యంగ్‌ ఇండియా కంపెనీ పూర్వపరాల గురించి రాహుల్‌ను ప్రశ్నించారు. యంగ్‌ ఇండి యా ప్రైవేట్‌ లిమిటెడ్‌కు చెందిన అనుబంధ కంపెనీ అసోసియేడెట్‌ జర్నల్స్‌ లిమిటెడ్‌ (ఎజెఎల్‌) సారథ్యంలో ‘నేషనల్‌ హెరాల్డ్‌’ దినపత్రిక ప్రచురితమయ్యేది. ఈ దినపత్రికను ప్రచురించే యంగ్‌ ఇండియా సంస్థను కాంగ్రెస్‌పార్టీయే స్థాపించింది. ఎజెఎల్‌ కంపెనీ కింద ఉన్న వేల కోట్ల రూపాయలను ఏ విధంగా షేర్‌ హోల్డర్లకు పంపిణీ చేస్తున్నారు? వాటి ఆర్థిక లావాదేవీలేమిటి? యంగ్‌ ఇండియన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, ఎజెఎల్‌ ప్రమోటర్ల పాత్ర ఏమిటి? నేషనల్‌ హెరాల్డ్‌ కార్యకలాపాలు, ఎజెఎల్‌కు కాంగ్రెస్‌పార్టీ ఎజెఎల్‌కు ఎందుకు రుణం మంజూరు చేసింది? కొత్త మీడియా ఎష్టాబ్లిష్‌మెంట్‌ పరిధిలో నిధులను ఎందుకు బదిలీ చేశారు? వంటి విషయాలను కూలంకషంగా అర్థం చేసుకోవడం కోసమే ఈ విచారణ చేస్తున్నట్లు ఇడి అధికారులు జూన్‌ మొదటివారంలోనే ప్రకటించారు. దానికి అనుగుణంగానే రాహుల్‌గాంధీపై ఇ.డి.అసిస్టెంట్‌ డైరెక్టర్‌ హోదా అధికారి ప్రశ్నిలు సంధించారని సమాచారం. రాహుల్‌ ఈ విధంగా ఇ.డి.ఎదుట విచారణకు హాజరు కావడం ఇదే మొదటిసారి. ‘నేషనల్‌ హెరాల్డ్‌’ దినపత్రికతో ముడిపడిన 13 ఏళ్ళ క్రితంనాటి హవాలా కేసు (అవినీతి మార్గంలో సంపాదన మనీకోసం నిధుల మళ్ళింపు నేరం) దర్యాప్తులో భాగంగా ఇ.డి. ఈ విచారణ చేపట్టింది. ఈ కేసులో జూన్‌ 2న రాహుల్‌ విచారణకు హాజరు కావాల్సి ఉండగా, విదేశీ పర్యటనలో ఉన్నందువల్ల ఆయన విజ్ఞప్తి మేరకు తేదీలను సవరించి జూన్‌ 13 న విచారణకు హాజరు కావాల్సిందిగా రెండోసారి సమన్లు జారీ చేశారు. కాంగ్రెస్‌పార్టీ నాయకులు, మద్దతుదారులతో కలిసి ఉదయం 11.10 గంటలకు రాహుల్‌గాంధీ న్యూఢిల్లీలోని ఇ.డి.కేంద్ర కార్యాలయానికి వెళ్ళారు. తొలుత 20 నిమిషాలు హాజరుకు సంబంధించిన చట్టపరమైన ప్రాథమిక కార్యక్రమం పూర్తిచేసిన తరువాత మధ్యాహ్నం 2.10 గంటల వరకూ మూడు గంటలసేపు ఇ.డి అధికారులు మొదటి విడత విచారణ జరిపారు. మధ్యాహ్నం భోజన విరామం అనంతరం 3.30 గంటలకు రాహుల్‌ ఇ.డి. కార్యాలయానికి వచ్చాక అధికారులు తిరిగి రెండో విడత విచారన చేశారు. పిఎంఎల్‌ఎ (ప్రివెన్షన్‌ ఆఫ్‌ మనీ లాండరింగ్‌ యాక్ట్‌) చట్టంలోని సెక్షన్‌ 50 కింద రాహుల్‌గాంధీ చెప్పదలచుకున్న విషయాలన్నీ లిఖితపూర్వకంగా తెలియజేసినట్లు విశ్వసనీయ సమాచారం. రాహుల్‌గాంధీ ఉదయం అక్బర్‌ రోడ్‌లోని కాంగ్రెస్‌పార్టీ కేంద్ర కార్యాలయం నుండి పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ వాద్రా, రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లోత్‌, చత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి భూపేశ్‌ బాఘెల్‌, కేంద్ర ఆర్థికశాఖ మాజీ మంత్రి పి.చిదంబరం తదితరులతో కలిసి ఇ.డి. కార్యాలయానికి చేరుకున్నారు. సోదరి ప్రియాంకాగాంధీ రాహుల్‌ పక్కనే ఉండి ఈ మొత్తం కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఏడు ఎస్‌యువి వాహనాల్లో కాంగ్రెస్‌ నాయకులు ఇడి.కార్యాలయానికి బయలుదేరి వెళ్ళారు. నిత్యం సిఆర్‌పిఎఫ్‌ జెడ్‌ ప్లస్‌ కేటగిరీ రక్షణలో రాహుల్‌గాంధీ ఉండేవారు. కానీ 2019లో మోడీ ప్రభుతం సోనియాగాంధీ కుటుంబానికి స్పెషల్‌ ప్రోటెక్షన్‌ గ్రూప్‌ (ఎస్‌పిజి) రక్షణ కవచాన్ని ఉపసంహరించింది. రాహుల్‌గాంధీ విచారణ సందర్బంగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టొరేట్‌ కార్యాలయం ఉన్న ఎపిజె అబ్దుల్‌ కలామ్‌ రోడ్‌ ప్రాంతంలో ఢిల్లీ పోలీసులు సిఆర్‌పిసి చట్టం కింద 144వ సెక్షన్‌ ఆంక్షలు విధించారు. అక్కడ బ్యారికేడ్లు నిర్మించారు. నిషేధ ఆంక్షలు అమలు చేశారు. ఢిల్లీ పోలీసులు అల్లర్లు నివారించేందుకు వీలుగా అల్లర్ల వ్యతిరేక సత్వర కార్యాచరణ దళాలను, సిఆర్‌పిఎఫ్‌ బృందాలను మోహరించారు. అనధికార వ్యక్తుల్ని నిరోధించేందుకు ఈ బలగాలు పొజిషన్స్‌ తీసుకుని అప్రమత్తంగా వ్యవహరించారు.మోడీ ప్రభుత్వంతో పోరాడతాం
కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలను ఆయుధాలుగా ఉపయోగించి ప్రతిపక్షాలను అణచివేతకు గురిచేసే మోడీ ప్రభుత్వంపై పోరాటం కొనసాగిస్తామని ఇండియన్‌ యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు బి.వి.శ్రీనివాస్‌ పిటిఐ వార్తాసంస్థకు చెప్పారు. ఇ.డి. కార్యాలయం వద్ద ఆయన సోమవారంనాడు మాట్లాడుతూ, సిగ్గుమాలిన పద్దతులలో మోడీ ప్రభుత్వం చేస్తున్న ఈ విధమైన చర్యలకు కాంగ్రెస్‌పార్టీ భయపడబోదని ఆయన అన్నారు. కేవలం రాహుల్‌ గాంధీ తన మద్దతుదారులతో కలిసి ఇడి కార్యాలయానికి వెళుతున్నారన్న ఒక చిన్న కారణంగా సెంట్రల్‌ ఢిల్లీ మొత్తాన్ని పోలీసు బలగాలు కట్టడి చేశాయని, ఈ ప్రాంతాన్ని భద్రతాబలగాల దుర్గంగా మార్చేశారని ఆయన విమర్శించారు. పోలీసు బలగాలు ఆయనతో సహా మద్దతుదారులందరనీ నిర్బంధించింది. రాహుల్‌గాంధీ పార్టీ కేంద్ర కార్యాలయంలో బయలుదేరేముందు పార్టీ నేతలు పాత్రికేయులతో మాట్లాడుతూ, ఎజెఎల్‌ కంపెనీని 1937లో స్థాపించారని, ఎజెఎల్‌ ప్రస్తుతం భారీ అప్పుల్లో మునిగి ఉందని, 2002 కాంగ్రెస్‌పార్టీ నేషనల్‌ హెరాల్డ్‌ పత్రిక జర్నలిస్టులకు, ఇతర సిబ్బందికి జీతాలు ఇవ్వడం కోసం రూ.90 కోట్లు చెల్లించిందని చెప్పారు. ఇప్పటికే పార్టీ సీనియర్‌ నాయకులు మల్లికార్జున ఖర్గే, పవన్‌ బన్సాల్‌లను దర్యాప్తులో భాగంగా ఇ.డి. ప్రశ్నించింది. 2013 సెప్టెంబరులో బిజెపి ఎం.పి సుబ్రమణియన్‌ స్వామి ఇచ్చిన ప్రైవేటు క్రిమినల్‌ ఫిర్యాదును ఆధారం చేసుకుని యంగ్‌ ఇండియన్‌ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీకి వ్యతిరేకంగా ఆదాయపన్నుశాఖ దర్యాప్తు చేసింది. ఆ శాఖ ఇచ్చిన నివేదికను ఆధారం చేసుకుని ట్రయల్‌ కోర్టు విచారణ జరిపిన అనంతరం పిఎంఎల్‌ఎ నిబంధనల కింద సోనియా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టొరేట్‌ తాజా కేసు నమోదు చేసింది. ఈ కేసులో మొదటి నిందితులుగా కాంగ్రెస్‌పార్టీలో అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ సహా యంగ్‌ ఇండియన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ప్రమోటర్లు, ఇతర షేర్‌ హోల్డర్లు ఈ కేసులో ఉన్నారు.నిర్ణీత ప్రకారం ఈ నెల 23న సోనియాగాంధీ ఇ.డి.ముందు హాజరు కావాల్సి ఉంది. కానీ సోనియా కరోనా అనంతర సమస్యలతో ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్నారు. ట్రయల్‌ కోర్టు ముందు హాజరై సాక్ష్యం చెప్పాలని కోరుతూ గత ఏడాది ఫిబ్రవరిలో ఎం.పి సుబ్రమణియన్‌ స్వామి విజ్ఞప్తి మేరకు గాంధీ కుటుంబానికి ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో 2015లో రూ.50 వేల వంతున పూజీ కత్తుపై గాంధీ కుటుంబీకులు బెయిలు పొందారు. స్వామి ఈ కేసులో ఆర్థిక అంశాలను తప్పుగా అర్థం చేసుకున్నారని గాంధీ కుటుంబీకుల తరపున న్యాయవాది వాదించారు. ఈ కేసులో సుమన్‌ దూబే, టెక్నోక్రాట్‌ శామ్‌ పిట్రోడాలపై కూడా సుబ్రమణియన్‌ స్వామి ఆరోపణలు చేస్తూ నిందితులుగా పేర్కొన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments