రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా వినోద్‌కుమార్
ప్రజాపక్షం/హైదరాబాద్: రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షునిగా మాజీ ఎంపి బోయినపల్లి వినోద్‌కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె. జోషి శుక్రవారం ఉత్తర్వులను జారీ చేశారు. ఈ సంఘానికి అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు వ్యవహరిస్తారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అంశాల్లో ప్రణాళిక సంఘం అత్యంత కీలకం కావడంతో ఉపాధ్యక్షుడిగా అనుభవజ్ఞుడు, తనకు సన్నిహితుడైన వినోద్‌కుమార్‌ను సిఎం నియమించినట్లు సిఎంఒ ఒక ప్రకటనలో తెలిపింది. 2019 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి త్వరలోనే పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో అన్ని శాఖలకు సంబంధించిన వ్యవ హారాలను సమీక్షించి, ప్రతిపాదనలను రూపొందించే కీలక పనిని కూడా వినోద్‌కుమార్‌కే సిఎం అప్పగించారు. ప్రస్తుతం ఆర్థిక మంత్రి శాఖ సిఎం వద్దనే ఉండడంతో వినోద్ కుమార్‌కు ఎక్కువ ప్రాధాన్యత కల్పించే అవకాశాలు ఉన్నాయి. ఉపాధ్యక్షుని హోదాలో వినోద్‌కుమార్‌కు క్యాబినెట్ హోదాతో పాటు రాష్ట్ర మంత్రివర్గ సమావేశాలకు శాశ్వత ఆహ్వానితునిగా ఉంటారు. ఆయన ఈ పదవిలో మూడేళ్ల పాటు కొనసాగనున్నారు. రాష్ట్ర బౌగోళిక, సామాజిక, ఆర్థిక అంశాల పట్ల వినోద్‌కుమార్‌కు అవగాన ఉండడంతో ఆయన సేవలను సంపూర్ణంగా వినియోగించుకోవాలనే సిఎం నియమించారు. అయితే ఈ పదవిని గతంలో ప్రస్తుత వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి అప్పగించగా ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో కరీంనగర్ స్థానం నుంచి ఓడిపోయిన వినోద్‌కుమార్‌కు ఉపాధ్యక్షునిగా అవకాశం కల్పించారు.