ఎన్నికల అనుకూల బడ్జెట్ ?
బడ్జెట్ ప్రతిపాదనలు ఆమోదించిన మంత్రివర్గం
నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు
తొలిసారిగా గవర్నర్ ప్రసంగం లేకుండానే…
ప్రజాపక్షం / హైదరాబాద్ శాసనసభ, శాసనమండలి బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. తెలంగాణ ఏర్పడిన తరువాత ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం లేకుండాను మొదలయ్యే మొదటి సమావేశాలు ఇవే. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రతిపక్షాలు సన్నద్ధమౌతున్నాయి. అసెంబ్లీ వేదికగా కేంద్ర ప్రభుత్వ తెలంగాణ వ్యతిరేక చర్యలను ఎండగట్టేందుకు అధికార పక్షం కూడా వ్యూహరచరన చేస్తున్నది. దేశానికి కొత్త రాజ్యంగం అవసరమని సిఎం కెసిఆర్ చేసిన ప్రకటనతో రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కిన నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు వాడిగావేడిగా జరనున్నాయి.
అసెంబ్లీ, కౌన్సిల్ సమావేశాలో ఉదయం 11.30 గంటలకు ప్రారంభమౌతాయి. అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి టి.హరీశ్‌రావు, శాసనమండలిలో మంత్రి మహ్మద్ అలీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. కాగా ప్రగతిభవన్‌లో ఆదివారం సాయంత్రం సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేసింది. ఈసారి రాష్ట్ర బడ్జెట్ ‘ఎన్నికల బడ్జెట్’గా ఉండే అవకాశాలున్నాయి. 2024లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్నందున వచ్చే ఏడాది 2023- ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి ఉండడమే ఇందుకు కారణం. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా టిఆర్‌ఎస్ చేసిన వాగ్ధానాలలో అమలు చేయగా మిగిలిపోయిన వాగ్ధానాల అమలుకు అవసరమైన నిదులను కేటాయించేందుకు ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్దం చేసింది. ఈ నేపథ్యంలో గత ఏడాది కంటే ఈ ఏడాది ప్రవేశపెట్టే బడ్జెట్ భారీగా రూ.2.20 లక్షల కోట్ల వరకు ఉండవచ్చని, సంక్షేమ పథకాలకు నిధుల కేటాయింపు పెద్ద ఎత్తున ఉంటుందని సమాచారం. ఇటీవల కాలంలో ప్రభుత్వంపై వత్తిడి పెంచుతున్న దళితబంధు, సొంత స్థలంలో ఇండ్ల నిర్మాణం, 57 ఏళ్ల వారికి ఆసరా పెన్షన్ తదితర సంక్షేమ పథకాలకు అధిక నిధులను బడ్జెట్‌లో కేటాయించే అవకాశాలున్నాయి. ఉద్యోగాల కోసం నిరుద్యోగులు పెద్దఎత్తున ఆందోళనలు చేపడుతున్న నేపథ్యంలో ‘నిరుద్యోగ భృతి’ని ప్రకటించనున్నట్లు సమాచారం. దళితబంధు పథకానికి రూ.20 వేల కోట్లను, సొంత స్థలంలో ఇంటి నిర్మాణానికి రూ.5.5 లక్షల సాయం పథకానికి నిధుల కేటాయింపులు చేయనున్నారు. కరోనా వ్యాప్తి తగ్గి వ్యాపారాలు, ఇతర కార్యకలాపాలు మెరుగుపడడంతో పాటు భూముల క్రమబద్దీకరణ, రిజిస్ట్రేషన్ చార్జీల పెంపుతోరాష్ట్ర ఖజానాకు ఆదాయం కూడా పెరిగింది. మైనింగ్, భూముల వేలం తదితర చర్యల ద్వారా ఆదాయాన్ని మరింత పెంచుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. భూముల వేల ద్వారా రూ.10 వేల కోట్ల ఆదాయాన్ని గత డబ్జెట్‌లో లక్ష్యంగా నిర్ణయించగా ప్రస్తుతం హైదరబాద్‌తో పాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోని భూములను విక్రయించడం ద్వారా సుమారు రూ.20 వేల కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా నిర్ణయించింది.
విపక్షాలు సన్నద్దం
అసెంబ్లీ, కౌన్సిల్ బడ్జెట్ సమావేశాలలో ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రతిపక్షాలు సన్నద్ధమౌతున్నాయి. ప్రభుత్వం హామీ ఇచ్చిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు, నిరుద్యోగ భృతి, దళితబంధు, ధాన్యం కొనుగోలు తదితర అంశాలపై కాంగ్రెస్ సహా ఇతర ప్రతిపక్ష పార్టీలు తమదైన వ్యూహాలను రచిస్తున్నాయి. టిఆర్‌ఎస్ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన అనంతరం ఇచ్చిన వాగ్ధానాల అమలు కోసం ప్రజల గొంతుకను వినిపించేందుకు కాంగ్రెస్ పక్షం సిద్దమౌతుండగా, గవర్నర్ ప్రసంగం లేకుండా ప్రభుత్వం బడ్జెట్ సమావేశాల ప్రారంభించడాన్ని తీవ్రంగా నిరసించేందుకు బిజెపి సిద్దమౌతున్నది. మంత్రిగా, టిఆర్‌ఎస్ పక్ష నేతగా దాదాపు 18 ఏళ్ల పాటు అసెంబీలో ఉన్న మాజీ మంత్రి ఈటల రాజేందర్ ప్రతిపక్ష బిజెపి సభ్యులుగా ఈ అసెంబ్లీ సమావేశాల్లో అడుగుపెట్టనున్నారు.
కేంద్ర వైఖరిని ఎండగట్టనున్న రాష్ట్ర సర్కార్
తెలంగాణాకు కేంద్ర ప్రభుత్వం సహాయ నిరాకరణ, వ్యతిరేక చర్యలను ఎండగట్టడానికి టిఆర్‌ఎస్ ప్రభుత్వం కూడా వ్యూహా రచన చేస్తున్నది. ఉమ్మడి ఎపి పునర్ వ్యవస్థీకరణ చట్టంలో బయ్యారం ఉక్కు, కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయకపోవడం, నదుల అనుసంధానం పేరుతో నదీ జలాల ప్రాజెక్టులను కేంద్రం హస్తగతం చేసుకునే నోటిఫికేషన్ జారీచేయడం తదితర అంశాలపై కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు అసెంబ్లీ సమావేశాలను వేదికగా ఉపయోగించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది.