ఒక్కటవుతున్న సీనియర్ నేతలు
నేడు కాంగ్రెస్ లాయలిస్ట్ ఫోరమ్ ఏర్పాటు
ప్రజాపక్షం/హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్‌లో కొత్త సమీకరణం మొదలైంది. త్వరలో పిసిసికి కొత్త అధ్యక్షుడిని వేయనున్న నేపథ్యంలో సీనియర్ నాయకులు ఒక్కటవుతున్నారు. అందులో భాగంగా కాంగ్రెస్ విధేయుల పేరుతో శుక్రవారం హైదరాబాద్‌లోని నిజాం క్లబ్‌లో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ లాయలిస్ట్ ఫోరమ్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ భేటీకి తెరవెనుక మాజీ పిసిసి అధ్యక్షులు వి.హనుమంతరావు అన్నీ తానై ఏర్పాట్లు చేయిస్తున్నారు. సమావేశానికి మాజీ మంత్రులు మర్రి శశిధర్‌రెడ్డి, సంభాని చంద్రశేఖర్, ఎఐసిసి కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు ఎం.కోదండరెడ్డి, పిసిసి మేధావుల సెల్ చైర్మన్ ఎ.శ్యామ్‌మోహన్, మాజీ ఎంఎల్‌సి బి.కమలాకర్‌రావు, ఖాదీ బోర్డు మాజీ అధ్యక్షులు జి.నిరంజన్ పాల్గొననున్నారు. ఇటీవల ఎన్నికల్లో పార్టీ ఓటమి, ఎంఎల్‌ఎలు పార్టీ వీడుతుండడం తదితర పరిణామాల నేపథ్యంలో ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు చెబుతున్నప్పటికీ, వాస్తవానికి టిపిసిసి చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తీరుపై వీరంతా గుర్రుగా ఉన్నారు. సీనియర్‌లకు ప్రాధాన్యతనివ్వకపోవడం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాలు చేయకపోవడం, పార్టీ వీడుతున్న నాయకులను నిలవరించలేకపోవడం వంటి అంశాలపై వీరు అసంతృప్తితో ఉన్నారు. త్వరలో టిపిసిసి అధ్యక్షుడి మార్పు ఉందనే వార్తల నేపథ్యంలో కూడా ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకున్నది. ఇప్పటికే వి.హనుమంతరావు తాను పిసిసి అధ్యక్ష పదవి రేసులో ఉన్నానని, అందరికంటే తానే అర్హుడినని ప్రకటించారు. మరోవైపు ఈ నెల 29న నల్లగొండలో జరగనున్న టిపిసిసి కార్యవర్గ సమావేశంలో ఏ అంశాలు లేవెత్తాలనే దానిపై కూడా వీరు చర్చించినట్లు తెలిసింది. త్వరలో మరికొందరు సీనియర్ నాయకులను తమతో కలుపుకోవాలని సమావేశంలో నిర్ణయించారు.