సిపిఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా
ప్రజాపక్షం/హైదరాబాద్: జిఎస్‌టి, గవర్నర్ల ద్వారా రాష్ట్రాల ప్రభుత్వాలను ప్రధాని మోడీ సర్కార్ భయభాంతులకు గురిచేస్తున్నదని సిపిఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా విమర్శించారు. ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాల హక్కులను, అధికారాలను బిజెపి ప్రభుత్వం హరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిపిఐ జాతీయ కార్యదర్శులు డాక్టర్ కె.నారాయణ, సయ్యద్ అజీజ్‌పాషా, జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్‌రెడ్డి, జాతీయ సమితి సభ్యులు పల్లా వెంకట్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావుతో కలిసిహైదరాబాద్‌లోని మగ్ధుంభవన్‌లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డి.రాజా మాట్లాడారు. ప్రజల ద్వారా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాల పాలనలో గవర్నర్ల జోక్యం ఏమిటని రాజా ప్రశ్నించారు. బిజెపి,- ఆర్‌ఎస్‌ఎస్ సిద్ధాంతాలను కొంత మంది గవర్నర్లు ముందుకు తీసుకెళ్తున్నారని, ఇటీవల తమిళనాడు గవర్నర్ సనాతన ధర్మాన్ని ప్రస్తావించిన విషయాన్ని రాజా గుర్తు చేశారు. కేరళ, తమిళనాడు, బెంగాల్‌తో పాటు తెలంగాణ రాష్ట్రంలో కూడా గవర్నర్ వ్యవస్థను బిజెపి ప్రభుత్వం తమ అవసరాల కోసం ఉపయోగిస్తోందని విమర్శించారు. మరోవైపు వివిధ రాష్ట్రాలలో అధికారంలోకి వచ్చేందుకు బిజెపి విచ్చలవిడిగా డబ్బులను వెదజల్లుతోందని, అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందన్నారు. అందులో భాగంగానే ఎంఎల్‌ఎలను ప్రలోభాలకు గురిచేస్తున్నదని, ఎంఎల్‌ఎల కొనుగోలు ఆరోపణల విషయంపై తెలంగాణ రాష్ట్రంలో విచారణ కొనసాగుతోందని, మిగతా రాష్ట్రాల్లో కూడా బిజెపి ఇలాగే ప్రవరిస్తోందన్నారు. ఎన్నికల సంస్కరణలు రావాల్సిన అవసరం ఉన్నదని, దామాషా పద్ధతిన ఎన్నికలు నిర్వహించాలని రాజా అన్నారు. ఎన్నికల ఖర్చును పూర్తిగా ప్రభుత్వమే భరించాలన్నారు. ఎన్నికల సంస్కరణలపై సిపిఐ నేత ఇంద్రజిత్ గుప్తా నేత్వత్వంలో కమిటీ ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. డాక్టర్ కె.నారాయణ మాట్లాడుతూ ప్రైవేటు విమానాల ద్వారా హవాలా డబ్బు, బంగారు ఆభరణాలు తరలుతున్న నేపథ్యంలో ప్రైవేటు విమానాలను తనిఖీ చేసి వాటిని నియంత్రించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అజీజ్‌పాషా మాట్లాడుతూ మంత్రులను, ప్రజాప్రతినిధులను, ఇతరులను అవమానించే, అభ్యంతరక ప్రసంగాలు చేసేవారిపై చర్యలు తీసుకోవాలని ఇటీవల ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం సూచించిందన్నారు. కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ ఎన్నికల సమయంలోనే పొత్తుల అంశంపై చర్చలు ఉంటాయని, అప్పటివరకు ప్రజా సమస్యలపై పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఎన్నికల పొత్తులో భాగంగా తాము బలంగా ఉన్న స్థానాలను కోరుకుంటామన్నారు. బిజెపిని ఓడించే బలమైన ప్రజాస్వామ్య, లౌకిక పార్టీలతోనే ఎన్నికల అవగాహన ఉంటుందని చెప్పారు.
రాష్ట్రాల ప్రభుత్వాలను టెర్రరైజ్ చేస్తున్న మోడీ ప్రభుత్వం
RELATED ARTICLES